టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా విజయానికి చేరువ అవుతుంది. ఈ మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసే సరికి భారత్ తన మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. క్రీజులో అజింక్య రహానే (29 బ్యాటింగ్: 71 బంతుల్లో, నాలుగు ఫోర్లు), కేఎస్ భరత్ (5 బ్యాటింగ్: 14 బంతుల్లో) ఉన్నారు. అంతకు ముందు ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లొ 469 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ ఇంకా 318 పరుగులు వెనకబడి ఉంది. కనీసం ఫాలో అప్ తప్పించుకోవాలన్నా 119 పరుగులు చేయాలి.


30 పరుగులకే ఓపెనర్లు అవుట్
రెండో రోజు భారత జట్టు మొదటి ఇన్నింగ్స్ వేగంగా మొదలైంది. రోహిత్ శర్మ (15: 26 బంతుల్లో, రెండు ఫోర్లు), శుభ్‌మన్ గిల్ (13: 15 బంతుల్లో, రెండు ఫోర్లు) మొదటి మూడు ఓవర్లలోనే 22 పరుగులు సాధించారు. నాలుగు, ఐదు ఓవర్లలో ఎక్కువగా పరుగులు రాలేదు. ప్యాట్ కమిన్స్ వేసిన ఆరో ఓవర్ చివరి బంతిని లెగ్ సైడ్ ఆడబోయిన రోహిత్ శర్మ వికెట్ల ముందు ఎల్బీడబ్ల్యూగా దొరికిపోయాడు. తర్వాత కేవలం నాలుగు బంతుల వ్యవధిలోనే శుభ్‌మన్ గిల్‌ను స్కాట్ బోలాండ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో భారత్ 30 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. రెండు వికెట్ల నష్టానికి 37 పరుగులు చేసి టీ బ్రేక్‌కు వెళ్లింది.


టీ తర్వాత విరాట్ కోహ్లీ (14: 31 బంతుల్లో, రెండు ఫోర్లు), ఛతేశ్వర్ పుజారా (14: 25 బంతుల్లో, రెండు ఫోర్లు) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు. 71 పరుగులకే భారత టాప్ ఆర్డర్ పూర్తిగా పెవిలియన్ బాట పట్టింది. అజింక్య రహానే, రవీంద్ర జడేజా ఇన్నింగ్స్‌ను కుదుట పరిచారు. వీరు ఐదో వికెట్‌కు 71 పరుగులు జోడించారు. అయితే ఆట ఆఖర్లో భారత్‌ను దురదృష్టం వెంటాడింది. మరో నాలుగు ఓవర్లలో ఆట ముగుస్తుందనగా రవీంద్ర జడేజాను నాథన్ లియాన్ అవుట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన కేఎస్ భరత్, అజింక్య రహానే మరో వికెట్ పడకుండా రోజును ముగించారు. మూడో రోజు భారత్ మ్యాచ్‌లో కమ్ బ్యాక్ ఇవ్వాలంటే ఈ జోడి భారీ భాగస్వామ్యం నెలకొల్పాల్సిందే.


ఆస్ట్రేలియా భారీ స్కోరు
అంతకు ముందు ఆస్ట్రేలియా తన మొదటి ఇన్నింగ్స్‌లో 469 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో రోజు రెండో సెషన్‌లో ఆస్ట్రేలియాను టీమిండియా పెవిలియన్‌కు పంపించింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌లో ట్రావిస్ హెడ్ (163: 174  బంతుల్లో, 25 ఫోర్లు, ఒక సిక్సర్), స్టీవ్ స్మిత్ (121: 268 బంతుల్లో, 19 ఫోర్లు) సెంచరీలు సాధించారు. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.


రెండో రోజు ఆట ప్రారంభం అయిన మొదటి మూడు బంతుల్లోనే స్టీవ్ స్మిత్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 95 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ప్రారంభించిన స్టీవ్ స్మిత్... మహ్మద్ సిరాజ్ వేసిన మొదటి ఓవర్ రెండు, మూడు బంతులను బౌండరీలుగా తరలించి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత ట్రావిస్ హెడ్ కూడా 150 పరుగుల మైలురాయిని దాటాడు. ఆ తర్వాత వారిద్దరూ అవుటయ్యారు.


లంచ్ సమయానికి ఆస్ట్రేలియా ఏడు వికెట్ల నష్టానికి 422 పరుగులు సాధించింది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (9: 34 బంతుల్లో), అలెక్స్ క్యారీ (48: 69 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్) ఎనిమిదో వికెట్‌కు 51 పరుగులు జోడించి ఆఖర్లో ఆస్ట్రేలియాను ఆదుకున్నారు. అలెక్స్ క్యారీ అవుటయ్యాక నాథన్ లియాన్ (9: 25 బంతుల్లో, ఒక ఫోర్), ప్యాట్ కమిన్స్ (9: 34 బంతుల్లో) కూడా త్వరగా అవుటయ్యారు. దీంతో ఆస్ట్రేలియా 469 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. మహ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. రవీంద్ర జడేజా ఒక్క వికెట్ తీసుకున్నాడు.