కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకున్నపుడు అది మన జీర్ణవ్యవస్థలోని గట్ బ్యాక్టీరియా మనుగడకు అంతరాయం కలిగిస్తుందని, ప్రవర్తన మీద కూడా ప్రభావం చూపి ఆందోళన కలిగించే విధంగా మెదడులో రసాయనాలను ఉత్పత్తి చేస్తుందని కొత్త అధ్యయనం చెబుతోంది.


ఒత్తిడిలో ఉన్నపుడు జంక్ ఫూడ్ తీసుకుంటే ఆందోళన స్థాయి మరింత పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి ఒత్తిడి పెరిగే కొద్దీ ఎక్కువ క్యాలరీలు కలిగిన ఆహారం మీదకు మనసు లాగుతుంది. అందుకే డిప్రెషన్ లో ఉన్నవారు, ఒత్తిడితో కూడిన పనుల్లో ఉన్న వారు తరచుగా ఏదైనా తినాలని లేదా తాగాలని ఆత్రుత పడుతుంటారు. ఇలాంటి కోరిక కలిగినపుడు కొవ్వులు, క్యాలరీలు ఎక్కువ కలిగిన ఆహారం తీసుకుంటే అది మెదడు పనితీరు మీద నేరుగా ప్రభావం చూపుతుందని కొత్త అధ్యయనం తెలియజేస్తోంది. కొవ్వులు ఎక్కువ కలిగిన ఆహారం తీసుకోవడం వల్ల బరువు పెరగడం, గుండె, రక్తనాళాలకు సంబంధించిన జబ్బులతో పాటు ఆందోళనకు డిప్రెషన్ కు కూడా కారణం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


కొవ్వు అధికంగా కలిగిన ఆహారం తీసుకున్నపుడు మెదడులోని రసాయన ప్రక్రియ మీద నేరుగా ప్రభావం పడుతుందని ఇంటిగ్రేటివ్ ఫిజియాలజీ ప్రొఫెసర్ క్రిస్టోఫర్ లోరీ అంటున్నారు.


అధ్యయనం కోసం జంతువుల మైక్రోబయోమ్ లేదా గట్ బ్యాక్టీరియాను అంచనా వేశారు. తక్కువ క్యాలరీలు కలిగిన ఆహారం తీసుకునే వారితో పోలిస్తే ఎక్కువ కొవ్వు కలిగిన ఆహారం తీసుకునే వారు ఎక్కువ బరువు పెరగడాన్ని గుర్తించారు. అంతేకాదు అధిక కొవ్వు కలిగిన ఆహారం తీసుకునే వారిలో న్యూరోసట్రాన్స్మీటర్స్ ద్వారా జరిగే  సెరోటోనిన్ ఉత్పత్తి, సిగ్నలింగ్ లో పాల్గొనే మూడు జన్యువులు ఒత్తిడి, ఆందోళనకు కూడా కారణం అవుతాయి. సెరోటోనిన్ ను ఫీల్ గుడ్ బ్రెయిన్ కెమికల్ గా వ్యవహరిస్తారు. సెరొటోనిన్స్ పరిమితికి మించి ఆక్టివేట్ అయినపుడు ఆందోళన కు కూడా కారణం కాగలవు.


కొవ్వు ఎక్కువ కలిగిన ఆహారాలు జీర్ణవ్యవస్థలో జీవించే బ్యాక్టీరియా మీద ప్రభావాన్ని చూపుతాయి. అనారోగ్యకరమైన మైక్రోబయోమ్ గట్ లైనింగ్ పనితీరును ప్రభావితం చేస్తుంది. ఫలితంగా జీర్ణాశయంతర పేగుల నుంచి మెదడుకు వెళ్లే నాడుల ద్వారా మెదడుతో కమ్యూనికేట్ చెయ్యడానికి  వీలవుతుందేమో అని నిపుణులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.


కనుక ఏది ఏమైనా ఒత్తిడిలో ఉన్నపుడు పోషణ గురించి కూడా సరైన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. లేదంటే పరిస్థితులు మరింత దిగజారి ఆందోళనకు కారణం కాగలవనేది కొత్త అధ్యయనం చేస్తున్న హెచ్చరిక. వీలైనంత వరకు ఒత్తిడికి దూరంగా ఉండడం అవసరం. తప్పనిసరి పరిస్థితుల్లో ఒత్తిడి నిర్వహణలో భాగంగా సమతుల ఆహారం తీసుకోవడంక కూడా అవసరమనేది ఈ అధ్యయన సారాంశం.


Also Read : Prostate cancer symptoms: అబ్బాయిలూ.. మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? జాగ్రత్త, ప్రొస్టేట్ క్యాన్సర్ కావచ్చు!













గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.