పురుషుల్లో ఎక్కువగా కనిపించేది ప్రొస్టేట్ క్యాన్సర్ ఒకటి. ఈ వ్యాధిని ఎంత త్వరగా గుర్తిస్తే అంత సమర్థవంతంగా చికిత్స అందించవచ్చు. సాధారణంగా 50 సంవత్సరాల పైబడిన పురుషుల్లో ప్రొస్టేట్ ప్రమాదం ఎక్కువ. లేదా కుటుంబ చరిత్రలో ప్రొస్టేట్ క్యాన్సర్ ఉన్నవారికి కూడా ఈ ముప్పు ఉంది. వీరు ఏటా స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవాలి. ప్రొస్టేట్ క్యాన్సర్‌‌ను త్వరగా గుర్తించి చికిత్స ప్రారంభించడం అవసరం.


ప్రొస్టేట్ క్యాన్సర్ చాలా నెమ్మదిగా పురోగమించే క్యాన్సర్. ప్రారంభంలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు కూడా. సమస్య తీవ్రమయ్యే కొద్దీ లక్షణాలు బయటపడుతుంటాయి.



  • ప్రొస్టేట్ క్యాన్సర్‌‌లో ముందుగా కనిపించే లక్షణం మూత్ర విసర్జనలో అసౌకర్యంగా అనిపిస్తుంది. తరచుగా మూత్రవిసర్జనలో మంటగా అనిపించడం, అంతరాయం ఏర్పడడం, ఈ ఇబ్బంది రాత్రి సమయాల్లో ఎక్కువగా ఉండడం ముఖ్యంగా గమనించాల్సిన విషయం. ప్రొస్టేట్ గ్రంథి పరిమాణం పెరిగిపోయి మూత్ర నాళం నొక్కుకుపోవడం వల్ల ఇలా మూత్ర విసర్జనలో ఇబ్బంది ఏర్పడుతుంది.

  • మూత్రంలో లేదా వీర్యంలో రక్తం కనిపించడం మరో ముఖ్యమైన లక్షణం. మూత్రంలో రక్తం కనిపించడాన్ని హెమటూరియా అని, వీర్యంలో రక్తం కనిపిస్తే హెమటోస్పెర్మియా అని అంటారు. ఈ సంకేతాలను ప్రమాదకరమైనవిగా భావించాలి.

  • అంగస్థంభన సమస్యలు ప్రొస్టేట్ ఆరోగ్యాన్ని ప్రతిబింభిస్తాయి. అయితే ఈ సమస్య ఇతర అనారోగ్యాల వల్ల కూడా కావచ్చు.

  • వీపు కింద భాగంలో, తుంటి భాగంలో, తొడల భాగంలో నిరంతరాయంగా నొప్పి లేదా లాగుతున్న బాధ కొనసాగుతుంది. దీన్ని తీవ్రంగా భావించాలి. ఎందుకంటే క్యాన్సర్ ఎముకల వరకు వ్యాపించి ఉండవచ్చు.

  • తరచుగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు కూడా ప్రొస్టేట్ క్యాన్సర్ వల్ల కావచ్చు. ప్రొస్టేట్ క్యాన్సర్ వల్ల ప్రొస్టేట్ గ్రంథి పరిమాణం పెరుగటం వల్ల ఈ సమస్య వస్తంది.


ఎలా నిర్థారించాలి?


ప్రొస్టేట్ క్యాన్సర్ ను వీలైనంత త్వరగా గుర్తించాలి. ఇందుకు పలు పరీక్షలు చేయించుకోవాలి. ప్రొస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ ద్వారా పీఎస్ఏ స్థాయిని కొలుస్తుంది. ఎలివేటెడ్ పీఎస్ఏ స్థాయిలు ప్రొస్టేట్ క్యాన్సర్ ను సూచిస్తాయి. కానీ కొన్ని సార్లు క్యాన్సర్ లేకపోయినా ఈ స్థాయిలు ఎలివేట్ అవుతాయి.


డిజిటల్ రెక్టల్ ఎగ్జామ్ ద్వారా ప్రొస్టేట్ గ్రంథిలో ట్యూమర్లు ఉన్నాయో లేదో నిర్ధారిస్తాయి. అల్ట్రా సౌండ్, ఎంఆర్ఐ, సీటీస్కాన్ లలో ప్రొస్టేట్ గ్రంథిలో ఏర్పడిన అసాధారణ మార్పులను, పరిసర కణజాల మీద ఈ మార్పుల ప్రభావాన్ని గుర్తించడం సాధ్యమవుతుంది. పీఎస్ఏ స్థాయి చాలా ఎక్కువగా ఉంటే ప్రొస్టేట్ బయాప్సీ చేస్తారు. క్యాన్సర్ నిర్ధారణకు ప్రొస్టేట్ కణాలను ల్యాబ్ లో పరీక్షిస్తారు. ప్రొస్టేట్ క్యాన్సర్ కుటుంబ చరిత్ర కలిగినవారు జన్యుపరీక్ష ద్వారా ముప్పును ముందుగా తెలుసుకుని ప్రమాదం నుంచి బయటపడవచ్చు.


Also Read : Prostate Cancer: పురుషులూ.. ఈ చిన్న చిన్న లైఫ్‌స్టైల్ మార్పులతో ప్రొస్టేట్ క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు, ఇలా చెయ్యండి












గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.