పురుషుల ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ప్రొస్టేట్, సెమినల్ వెసికిల్స్ ముఖ్యమైన భాగాలు. అక్రూట్ పరిమాణంలో ఉండే ప్రొస్టేట్ గ్రంథి మూత్రాశయం కింద ముత్రాశయం చుట్టూ ఆవరించి ఉంటుంది. ఈ గ్రంథి పక్కనే సెమినల్ వెసికిల్స్ అనే చిన్న గ్రంథులు ఉంటాయి. ప్రొస్టేట్ గ్రంథి కణజాలాలలో కలిగే అసాధారణ పెరుగుదలను ప్రొస్టేట్ క్యాన్సర్ గా చెప్పవచ్చు. ప్రొస్టేట్ పరిమాణంలో పెరిగిన ప్రతిసారీ క్యాన్సర్ కాకపోవచ్చు.


కారణాలు


ప్రొస్టేట్ క్యాన్సర్ రావడానికి రకరకాల కారణాలు ఉంటాయి. అతి బరువు, వంశపారంపర్యం, ఆహారం, వయసు ఇలా రకరకాల కారకాల వల్ల ప్రొస్టేట్ క్యాన్సర్ రావచ్చు. నివారించగలిగే క్యాన్సర్లలో ప్రొస్టేట్ క్యాన్సర్ గురించి ముందుగా చెప్పుకోవచ్చు. కొద్దిపాటి జాగ్రత్తలతో, జీవనశైలి మార్పులతో కచ్చితంగా ప్రొస్టేట్ క్యాన్సర్ ను నివారించే అవకాశాలు ఉంటాయి.


ప్రొస్టేట్ గ్రంథి వీర్యకణాల పోషణ, అవి చురుకుగా కదిలేందుకు అవసరమయ్యే సెమినల్ ద్రవాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ గ్రంథి కణాల్లోని డీఎన్ఏ లో వచ్చే అసాధారణ మార్పులు గ్రంథి పరిమాణంలో మార్పులకు కారణం అవుతాయి. కొంత మందిలో క్యాన్సర్ చాలా త్వరగా ముదిరిపోతుంది. కొందరిలో నెమ్మదిగా ముదురుతుంది. వీలైనంత త్వరగా గుర్తించి చికిత్స ప్రారంభించడం అవసరం. మనదేశంలో పురుషుల్లో వచ్చే క్యాన్సర్లలో ప్రొస్టేట్ క్యాన్సర్ మొదటి పది క్యాన్సర్లలో ఒకటి. ఇది సాధారణంగా 65 సంవత్సరాల పైబడిన వృద్ధులలో ఎక్కువగా కనిపిస్తుంది.


జాగ్రత్తలు ఏం తీసుకోవాలి?


కొన్ని జాగ్రత్తలు, జీవన శైలి మార్పులతో ప్రొస్టేట్ క్యాన్సర్ ను నివారించడం సాధ్యమే అని నిపుణులు చెబుతున్నారు.



  • ట్రాన్స్ ఫ్యాట్స్, సాచూరేటెడ్ కొవ్వుల వినియోగం బాగా తగ్గించాలి. వీటికి బదులుగా గింజలు, నూనె కలిగిన చేపలు, ఒమెగా3ఫ్యాటీ ఆసిడ్లు కలిగిన పదార్థాల మీద దృష్టి నిలపాలి.

  • రోజువారీ ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా ఆకుకూరలు ఎక్కవగా తీసుకోవాలి. లైకోపిన్ కలిగిన టమటలు, సల్ఫోఫెరాన్ కలిగిన బ్రొకొలి, కాలీఫ్లవర్ వంటి క్రూసిఫెరా కుటుంబానికి చెందిన కూరగాయలు తినడం వల్ల ప్రొస్టేట్ కణాల పెరుగదలను మందగించేలా చెయ్యవచ్చు.

  • ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద వేడిచేసిన లేదా కాల్చిన మాంసపదార్థాలలో క్యాన్సర్ కారకాలు ఉత్పత్తి అవుతాయి. కనుక గ్రిల్డ్ లేదా బేక్డ్ పదార్థాల వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలి.

  • అధిక బరువు కలిగి ఉండడం వల్ల కూడా ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రమాదం పెరుగుతంది. క్యాన్సర్ ప్రమాదాన్ని తప్పించుకోవాలంటే శరీర బరువు అదుపులో ఉంచుకోవడం అవసరం.

  • ప్రతిరోజు తప్పనిసరిగా వ్యాయామం చెయ్యడం జీవనశైలిలో భాగం చేసుకోవాలి. ఇది కేవలం బరువు అదుపులో ఉండేందుకు మాత్రమే కాదు శరీరంలో ఇన్ఫ్లమేషన్ ను కూడా నివారిస్తుంది. నిరోధక వ్యవస్థ పనితీరును మెరుగ్గా ఉంచుతుంది.

  • క్యాన్సర్ నివారణలో అత్యంత ముఖ్యమైంది పొగతాగే అలవాటును మానుకోవడం. మద్యం తీసుకునే అలవాటు ఉంటే మోతాదు తగ్గించడం క్రమంగా మానేయ్యడం కూడా అవసరం.


Also Read : వ్యాయామం ఉదయాన్నే చెయ్యాలా ఏంటీ? కొత్త అధ్యయనంలో ఆశ్చర్యం కలిగించే విషయాలు వెల్లడి











గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.