రోగ్యానికి విశ్రాంతి ఎంత అవసరమో వ్యాయామం కూడా అంతే అవసరం. కానీ, వ్యాయామం అంటే.. ఉదయాన్నే లేచి చెయ్యాలేమో అనుకొని చాలామంది.. వెనకడుగు వేస్తారు. కొందరు ప్రయత్నించి... మానేస్తుంటారు. అయితే, పరిశోధకులు మాత్రం.. వ్యాయామం.. ఉదయాన్నే చెయ్యాలా ఏంటీ? అని అంటున్నారు. తాజా అధ్యయనం ప్రకారం.. వ్యాయామం ఉదయాన్నే చెయ్యాల్సిన అవసరం లేదని.. సాయంత్రం వేళల్లో కూడా చెయ్యొచ్చని అంటున్నారు.


కొత్త అధ్యయనం ప్రకారం.. వ్యాయామం ఉదయమే చెయ్యాల్సిన అవసరం లేదని.. సాయంత్రం చేసే వర్కవుట్‌తో కూడా బరువు తగ్గవచ్చాని. డయాబెటిస్ సమస్య నుంచి కూడా ఉపశమనం పొందవచ్చని అంటున్నారు.


సాయంత్రం వేళ్లలో చేసే వ్యాయామంతో రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో పెట్టుకోవచ్చని తాజా అధ్యయనంలో తేల్చారు. రోజంతా కూర్చుని పనిచేసే వారు లేదా సరైన శారీరకశ్రమ లేని, అధిక బరువు, స్థూలకాయులు, డయాబెటిస్ కలిగిన వారు సాయంత్రం ఒక మోస్తరు నుంచి తీవ్రమైన వ్యాయామం చెయ్యడం ద్వారా బరువును అదుపులో పెట్టుకోవచ్చు. రక్తంలో చక్కెర‌ను కూడా కంట్రోల్ చేయవచ్చని పరిశోధకులు తెలిపారు.


స్పెయిన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ గ్రానెడకు చెందిన నిపుణులు ఈ అధ్యయనం నిర్వహించారు. దీని ప్రకారం వ్యాయామం చేసే సమయం కూడా శరీరం మీద ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. మధుమేహులకు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. శరీరంలో తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఇలా రక్తంలో గ్లూకోజ్ పెరిగిపోతే శరీరంలోని అవయవాలు చెడిపోయే ప్రమాదం ఉంది. కనుక మధుమేహులు రోజూ తప్పనిసరిగా వ్యాయామం చెయ్యాలి. ఇది వారి రక్తంలో ఆరోగ్యవంతమైన షుగర్ స్థాయిలను నిర్వహించడంలో తోడ్పడుతుంది. ఉదయాన్నే వ్యాయామానికి సమయం లేని వారు ఇక నుంచి చింతించాల్సిన పని లేదు. సాయంత్రం పూట చేసే వ్యాయామంతో కూడా రక్తంలో షుగర్ స్థాయిలను నియంత్రించవచ్చు.


సాయంత్రం ఎప్పుడు? 


అద్యయనంలో సూచించిన వివరాల ప్రకారం.. రోజూ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 లోపు వాకింగ్, జాగింగ్.. ఎరోబిక్స్ నుంచి వివిధ వ్యాయామాల వరకు.. ఏం చేసినా మంచి ఫలితాలే వస్తాయని నిపుణులు వెల్లడించారు. కనుక ఇక నుంచి ఉదయాన్నే సమయం చాలడం లేదనే సాకుతో వ్యాయామం ఎగ్గొట్టే వారికి ఆ అవకాశం లేదు. ఉదయం కుదరకపోయినా.. సాయంత్రం తప్పకుండా వ్యాయామాలు చెయ్యాల్సిందే. అప్పుడే ఆరోగ్యంగా ఉండటం సాధ్యమవుతుంది. లేకపోతే సమస్యలతో సావాసం చెయ్యాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం? ఈ రోజు నుంచే మొదలు పెట్టండి మరి.


Also Read : కసిగా 10 వేల అడుగులు టార్గెట్ పెట్టుకుని నడిచేస్తున్నారా? ఈ సమస్యలు తప్పవు, ఈ టిప్స్ పాటించండి











గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.