Zee5 Original Series Paruvu Review In Telugu: చిరంజీవి కుమార్తె సుష్మితా కొణిదెల, అల్లుడు విష్ణుప్రసాద్ నిర్మించిన కొత్త సిరీస్ 'పరువు'. జీ5 ఓటీటీ వేదికలో శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో నాగబాబు, నివేదా పేతురాజ్, నరేష్ అగస్త్య, ప్రణీతా పట్నాయక్, రమేష్, సునీల్ కొమ్మిశెట్టి ప్రధాన తారాగణం. పవన్ సాధినేని షో రన్నర్ (Pavan Sadineni)గా రూపొందిన సిరీస్ ఇది. సిద్ధార్థ్ నాయుడు, రాజశేఖర్ వడ్లపాటి దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ ఎలా ఉంది? అనేది చూస్తే...


కథ (Paruvu Web Series Story): పల్లవి అలియాస్ డాలీ (నివేదా పేతురాజ్) కుటుంబానిది గుంటూరు. వాళ్ళకు కులం పట్టింపులు ఎక్కువ. తమ కులం కాని సుధీర్ (నరేష్ అగస్త్య)ను ప్రేమించిన డాలీ... ఇంట్లో పెద్దలను కాదని హైదరాబాద్ వెళ్లి ప్రేమ వివాహం చేసుకుంటుంది. పెదనాన్న మరణవార్త తెలిసి ఆయన్ను కడసారి చూసేందుకు సొంతూరు ప్రయాణం అవుతుంది. పల్లవి దంపతులను ఆమె బావ చందు (సునీల్ కొమ్మిశెట్టి) పికప్ చేసుకుంటాడు. దారి మధ్యలో వాళ్లకు గొడవ అవుతుంది. సుధీర్ కొట్టిన దెబ్బకు చందు మరణిస్తాడు.


చందు శవాన్ని పల్లవి, సుధీర్ దంపతులు ఏం చేశారు? చందును ఎమ్మెల్యే రామయ్య (నాగబాబు) ఏదో చేసి ఉంటాడని అతడి ప్రేయసి స్వాతి (ప్రణీతా పట్నాయక్) ఏం చేసింది? హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు చందు నాటు తుపాకీ ఎందుకు కొన్నాడు? చందు కోసం పోలీసులు చేసిన దర్యాప్తులో ఏం తేలింది? రామయ్య కోసం పనిచేసే పోలీస్ చక్రవర్తి (రాజ్ కుమార్ కసిరెడ్డి), తక్కువ కులానికి చెందిన పోలీస్ బాబ్జి (మొయీన్) ఏం చేశారు? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి.


విశ్లేషణ (Paruvu Web Series Review): క్షణికావేశం... కోపంలో లేదా భయంలో లేదా అనుమానంతో తీసుకునే నిర్ణయాలు జీవితాలను ఎటువంటి ప్రమాదంలోకి తోస్తాయనేది చెప్పడానికి చక్కటి ఉదాహరణ 'పరువు' వెబ్ సిరీస్. టైటిల్ చూసి స్ట్రీమింగ్ స్టార్ట్ చేసిన వీక్షకులకు తొలుత వచ్చే సన్నివేశాలు పరువు హత్యల నేపథ్యంలో సాగే సిరీస్ అని అర్థం అవుతుంది. అయితే... ఇదొక మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ అని తెలియడానికి ఎక్కువ సమయం పట్టదు.


కథ, కథనం పరంగా 'పరువు' కొత్తది ఏమీ కాదు. పరువు హత్యల నేపథ్యంలో కొన్ని సినిమాలు వచ్చాయి. ఇప్పుడు సిరీస్ వచ్చింది. స్టోరీతో పాటు స్క్రీన్ ప్లే రొటీనైనా... క్యారెక్టరైజేషన్లు బలంగా రాసుకోవడంతో పాటు క్యారెక్టర్లు తగ్గ నటీనటులను ఎంపిక చేసుకోవడం వల్ల సన్నివేశాలు ఎంగేజ్ చేశాయి.


కులం గోడలు, పంతాలు పట్టింపులు, అధికారం కోసం నాయకులు చేసే కుట్రలు 'పరువు'లో కనిపిస్తాయి. సిద్ధార్థ్ నాయుడు, రాజశేఖర్ వడ్లపాటి దర్శకత్వంలో గ్రిప్పింగ్ మూమెంట్స్ ఉన్నాయి. రన్ టైమ్ కూడా ఎక్కువ ఉంది. వెబ్ సిరీస్ అంటే బూతులు ఉండాల్సిందేనని అనుకున్నారో? ఏమో? అవసరం లేని చోటు శృతి మించిన సంభాషణలు రాశారు. రన్ టైమ్ తగ్గించి సంభాషణల్లో జాగ్రత్త వహిస్తే బావుండేది.


Also Read'హరోం హర' రివ్యూ: కుప్పంలో కేజీఎఫ్ రేంజ్ కథ - సుధీర్ బాబుకు విక్రమ్ రేంజ్ ఎలివేషన్స్... సినిమా ఎలా ఉందంటే?


కులం పట్టింపులు లేని ఈతరం అమ్మాయిగా నివేదా పేతురాజ్ చక్కటి నటన కనబరిచారు. భర్త మీద ప్రేమను, భయాన్ని ఒకేసారి చూపించే సన్నివేశాల్లో నటన బావుంది. నరేష్ అగస్త్య సెటిల్డ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. రాజకీయ నాయకుడిగా నాగబాబు నటన, ఆ పాత్రకు ఆయన కటౌట్ పర్ఫెక్ట్ యాప్ట్. సునీల్ కొమ్మిశెట్టి నటనతో ఆ క్యారెక్టర్ కొత్తగా కనిపించింది. రాజ్ కుమార్ కసిరెడ్డి, మొయీన్, రమేష్ తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ప్రణీతా పట్నాయక్ నటన ఆడియన్స్ గుర్తించేలా ఉంటుంది. ఆమె క్యారెక్టర్ గుర్తుంటుంది.


పరువు హత్య నుంచి మొదలై... మర్డర్ మిస్టరీ మీదుగా పవర్ పాలిటిక్స్ దాటుకుని... కాబోయే భర్త కోసం రాజకీయ నేతపై మహిళ చేసే పోరాటం నుంచి భర్త కోసం కన్న తండ్రిని ఎదిరించిన భార్య తెగువ దగ్గర 'పరువు' ఆగింది. ఎనిమిది ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ లెంగ్తీగా ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే... ఒక్కసారి స్ట్రీమింగ్ మొదలు పెడితే చివరి వరకు చూసేలా చేస్తుంది. పరువు... గ్రిప్పింగ్ థ్రిల్లర్. వీకెండ్ వాచ్ లిస్టులో యాడ్ చేయడానికి బెస్ట్ ఆప్షన్.


Also Readమహారాజ రివ్యూ: తమిళంలో బ్లాక్ బస్టర్ రిపోర్ట్, మరి తెలుగులో? - విజయ్ సేతుపతి 50వ సినిమా ఎలా ఉందంటే?