Vijay Sethupathi's Maharaja Movie Review In Telugu: సినిమా చూస్తున్నప్పుడు తెరపై తాను నటించడం లేదని, జీవిస్తున్నానని చెప్పే అతికొద్ది మంది హీరోల్లో విజయ్ సేతుపతి ఒకరు. అంతలా ఉంటుంది ఆయన నటన. ప్రేక్షకులు సైతం ఆ పాత్రతో ప్రయాణం చేసేలా... ప్రాణం పోస్తారు. తెరపైకి విజయ్ సేతుపతి వస్తే చూపు తిప్పుకోవడం కష్టం. అటువంటి విజయ్ సేతుపతి 50వ సినిమా అంటే? ఫ్యాన్స్, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి. 'మహారాజ' ప్రచార చిత్రాలు ఆ అంచనాలను మరింత పెంచాయి. కోలీవుడ్‌లో ప్రీమియర్ షోలు పడ్డాయి. బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ వచ్చాయి. మరి, సినిమా ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.


కథ (Maharaja Movie Story): మహారాజ (విజయ్ సేతుపతి) ఓ సామాన్య బార్బర్. ఓ ప్రమాదం కారణంగా తన బిడ్డ జ్యోతి (సచనా నమిదాస్) నెలల పసికందుగా ఉన్నప్పుడు భార్య (దివ్య భారతి) మరణిస్తుంది. ఆ ప్రమాదంలో పాప ప్రాణాలతో ఉండటానికి కారణమైన చెత్త బుట్టకు లక్ష్మి అని పేరు పెట్టిన తండ్రి కుమార్తెలు... దేవతను చూసుకున్నట్టు చూసుకుంటారు. స్పోర్ట్స్ క్యాంపు కోసం జ్యోతి వేరే ఊరు వెళ్లిన సమయంలో... ఒక రోజు మహారాజాను చితక్కొట్టిన దొంగలు లక్ష్మీని తీసుకు వెళతారు. దాంతో తన కుమార్తె తిరిగొచ్చే లోపు ఎలాగైనా లక్ష్మీని వెతికి పెట్టమని పోలీసుల దగ్గరకు వెళతాడు.


చెత్త బుట్ట పోయిందని చెప్పేసరికి పోలీసులు ఎలా రియాక్ట్ అయ్యారు? ఆ చెత్త బుట్టలో మహారాజ ఏం దాచాడు? ఎలక్ట్రిక్ షాప్ యజమానిగా పగలు మంచివాడిగా నటిస్తూ రాత్రుళ్లు దొంగతనాలు చేసే సెల్వ (అనురాగ్ కశ్యప్) ముఠాకు, మహారాజ ఇంటిలో లక్ష్మీకి సంబంధం ఉందా? నిజంగా లక్ష్మి (చెత్తబుట్ట) కోసమే మహారాజ పోలీసుల దగ్గరకు వెళ్లాడా? మరొక కారణం ఉందా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.


విశ్లేషణ (Maharaja Movie Review Telugu): ఏ క్యారెక్టర్ అయినా సరే తన ఇమేజ్ కనపడకుండా ఆ క్యారెక్టర్, దాని తాలూకా లక్షణాలు కనిపించేలా నటించడం విజయ్ సేతుపతిలో గొప్పదనం. 'మహారాజ' మొదలైన కాసేపటికే... హీరో బార్బర్ అంటే ప్రేక్షకులు నమ్మేస్తారు. ఉడుంపట్టు పట్టినట్టు ఏదైనా పట్టుకున్నాడంటే ఎవరి తరం కాదని ప్రేక్షకులూ అంచనాకు వచ్చేస్తారు. ఆ క్యారెక్టర్ అంత బలంగా రిజిస్టర్ అయ్యేలా చేయడంలో విజయ్ సేతుపతి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు. అయితే... ఈ సినిమాకు బలం అతని నటన ఒక్కటే కాదు, నితిలన్ సామినాథన్ రచన, దర్శకత్వం సైతం!


సినిమా మొదలైన కాసేపటికి 'మహారాజ' గుండెల నిండా కుమార్తెపై అమితమైన ప్రేమ ఉందని అనుకుంటాం. కాసేపటికి అమ్మాయి కోసం ఎంత దూరమైనా వెళ్లే మొండోడు అనుకుంటాం. చెత్తబుట్ట కోసం స్టేషన్ మెట్లు ఎక్కినప్పుడు పిచ్చోడు అనుకుంటాం. చివరకు, ఇటువంటి తండ్రి ప్రతి అమ్మాయికీ ఉండాలని బలంగా కోరుకుంటాం. ప్రారంభం నుంచి చివరి వరకు ప్రేక్షకుల్లో రకరకాల అనుభూతి, భావాలు కలుగుతాయి. అయితే... ఒక్క సందర్భంలోనూ మహారాజ క్యారెక్టర్‌ను జడ్జ్ చేయాలని ఎవరూ అనుకోరు. లక్ష్మిని వెతికి పెట్టమని పోలీసుల దగ్గరకు వెళ్లిన సందర్భం చూసి నవ్వుకుంటాం. తర్వాత ఒకరి తల నరికినప్పుడు షాక్ అవుతాం. ఇంటర్వెల్ తర్వాత ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతుంటే... ఏదో తెలియని ఉద్వేగానికి గురి అవుతాం. కొన్నిసార్లు క్లాప్స్ కొడతాం, ఇంకొన్నిసార్లు విజిల్స్ వేస్తాం. పతాక సన్నివేశాలకు వచ్చినప్పుడు బరువెక్కిన గుండెతో బయటకు వస్తాం. అక్కడ తండ్రీ కుమార్తెల బంధాన్ని చూపించిన విధానం గుండెలకు హత్తుకుంటుంది.


'మహారాజ'లో అడుగడుగునా విజయ్ సేతుపతి నటనతో పాటు దర్శక రచయిత నితిలన్ సామినాథన్ ప్రతిభ కనబడుతుంది. నవ్వించాడు, ఏడిపించాడు, ఫైట్స్‌తో హై ఇచ్చాడు, ప్రారంభం నుంచి ముగింపు వరకు కథతో నడిపించాడు. అన్నిటి కంటే ముఖ్యంగా కథానాయకుడి బలం చూపించడానికి ప్రతిసారీ పదిమందిని కొట్టాల్సిన అవసరం లేదని ఒక్క సన్నివేశం చాలని రెండు మూడు చోట్ల చెప్పిన తీరు బావుంది. నిర్మాతలు సుధన్ సుందరం, జగదీష్ పళనిసామితో పాటు సంగీత దర్శకుడు అజనీష్ లోక్‌నాథ్, ఛాయాగ్రాహకుడు దినేష్ పురుషోత్తమన్ నుంచి దర్శకుడికి మంచి మద్దతు లభించింది. టెక్నికల్ పరంగా, ప్రొడక్షన్ వేల్యూస్ పరంగా సినిమా ఉన్నత స్థాయిలో ఉంది.


గులాబీ మొక్కకు అంటు కట్టినట్లు ఒక్కో సన్నివేశాన్ని చాలా పకడ్బందీగా రాసిన దర్శకుడు... నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో 'వావ్' ఫ్యాక్టర్ అందించారు, మేజిక్ చేశాడు. అయితే... స్లో పేస్ నేరేషన్ కొన్ని సన్నివేశాల్లో కాస్త ఇబ్బంది పెట్టింది. విజయ్ సేతుపతికి తప్ప మిగతా క్యారెక్టర్లకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. అవసరమైన సన్నివేశాల్లోనూ వాళ్లను ఉత్సవ విగ్రహాలను కింద మార్చేశారు. ముఖ్యంగా మమతా మోహన్ దాస్ క్యారెక్టర్. స్క్రీన్ ప్లే కోసం, అప్పటికి ఒక షాక్ ఫ్యాక్టర్ ఇవ్వడం కోసం కొన్ని అనవసరమైన సన్నివేశాలు రాశారు. పాము వచ్చే సన్నివేశం! అంటే... కథానాయకుడి క్యారెక్టర్ సింబాలిజం కోసం ఆ సీన్స్ రాశారు కానీ రిజిస్టర్ కావడం కష్టం. క్లైమాక్స్ ట్విస్ట్ కొందరు ఊహించే అవకాశం ఉంది. ఆ ట్విస్ట్ ఎంత ముందు తెలిస్తే... సినిమా అంత ప్రిడిక్టబుల్‌గా ఉంటుంది మూవీ. దాంతో ఎంజాయ్‌ చేయలేరు.


Also Read: రష్ రివ్యూ: ETV Winలో యాక్షన్ థ్రిల్లర్ - రవిబాబు సినిమా బావుందా? లేదా?


విజయ్ సేతుపతి... విజయ్ సేతుపతి... విజయ్ సేతుపతి... సినిమా చూస్తున్నంత సేపూ మక్కల్ సెల్వన్ తప్ప మరొక నటుడి మీదకు చూపు వెళ్లదు. 'మహారాజ' కంటే గొప్పగా విజయ్ సేతుపతి నటించిన క్యారెక్టర్లు, సినిమాలు ఉన్నాయి. కానీ, ఈ ఒక్క సినిమాకు ఆయన తప్ప మరొకరు న్యాయం చేయలేరనేంతలా ఒదిగిపోయారు. ఆ తర్వాత బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ నటన ఆకట్టుకుంటుంది. విలనిజం బావుంది. కుమార్తె రోల్ చేసిన సచనా నమిదాస్ సైతం అద్భుతంగా నటించింది. అభిరామి, మమతా మోహన్ దాస్, నటరాజ్, భారతీ రాజా తదితరులు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.


ప్రేక్షకులకు ఒకవైపు వినోదం అందించడంతో పాటు మరోవైపు బుర్రకు పదును పెట్టే సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. వినోదం అంటే నవ్వడం మాత్రమే కాదు... కథతో పాటు ప్రేక్షకుడు నడవడం, తెరపై ప్రతి సన్నివేశాన్ని అనుభూతి చెందడం! ఒక్క ముక్కలో చెప్పాలంటే... 'మహారాజ' రివేంజ్ డ్రామా. కాస్త స్లోగా ఉంటుంది. కానీ, హండ్రెడ్ పర్సెంట్ సినిమాటిక్ ఫీల్ ఇస్తుంది. పతాక సన్నివేశాల్లో తండ్రులను, అమ్మాయిలను కంటతడి పెట్టిస్తుంది. విజయ్ సేతుపతి నటన, నితిలన్ సామినాథన్ దర్శకత్వం, మరీ ముఖ్యంగా ట్విస్టులు మెప్పిస్తాయి. డోంట్ మిస్ ఇట్.


Also Readలవ్ మౌళి రివ్యూ: బోల్ సీన్లు, లిప్ కిస్సులతో నవదీప్ - సినిమా అంతా అంతేనా? కంటెంట్ ఉందా?