ETV Win Original Movie Rush Review In Telugu: దర్శకుడిగా, రచయితగా రవిబాబు (Ravi Babu)ది భిన్నమైన పంథా. థ్రిల్లర్స్ తీయడంలో ఆయన స్పెషలిస్ట్. 'అనసూయ', 'అమరావతి', 'అవును', 'అవును 2'తో విజయాలు అందుకున్నారు. ఆయన తీసిన 'నచ్చావులే', 'మనసారా' చిత్రాలూ విజయాలు సాధించాయి. దర్శక రచయితగా రవిబాబు విజయాలు అందుకుని కొన్నేళ్లు అవుతోంది. కొంత విరామం తర్వాత ఆయన నుంచి వచ్చిన సినిమా 'రష్'. దీనికి ఆయన కథ అందించడంతో పాటు నిర్మించారు. ప్రధాన పాత్రలో నటించారు. డైసీ బొపన్న, కార్తీక్ ఆహుతి జంటగా నటించారు. సతీష్ పోలోజు దర్శకత్వం వహించడంతో పాటు యాక్షన్ కొరియోగ్రఫీ అందించారు.


కథ (Rush Telugu Movie Story): ఆదిత్య (కార్తీక్ ఆహుతి), కార్తీక (డైసీ బొపన్న) దంపతులకు ఓ అబ్బాయి రిషి (మాస్టర్ వెంకట్ శౌర్య), ఓ అమ్మాయి రియా (బేబీ మెతుకు అనురాగ). వాళ్ళది హ్యాపీ ఫ్యామిలీ. ఆఫీసుకు వెళ్లిన ఆదిత్యకు ఎవరో అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ వస్తుంది. మీ లేఅవుట్ ల్యాండ్స్ ఎవరో కబ్జా చేశారని చెప్పడంతో హడావిడిగా బయలుదేరతాడు. రోడ్డులో యాక్సిడెంట్ అవుతుంది. ఓ ఆస్పత్రిలో అతడిని జాయిన్ చేస్తారు. ఆ విషయం తెలిసి భర్త దగ్గరకు కారులో బయలుదేరుతుంది కార్తీక. హైవేలో కొందరు బైకర్స్‌తో గొడవ అవుతుంది. వాళ్ళను చితక్కొట్టిన కార్తీక భర్త దగ్గరకు వెళుతుంది. అయితే, ఆ తర్వాత నర్సింగ్ (వీరన్న చౌదరి) వాళ్ళను చంపేస్తాడు. రిషిని కిడ్నాప్ చేసి పోలీసుల దగ్గర ఎవిడెన్స్ రూములో ఉన్న ఒక బ్యాగ్ తీసుకుని రమ్మని చెబుతాడు. 


కొడుకు కోసం పోలీస్ స్టేషనుకు వెళ్లిన కార్తీక... ఆ బ్యాగ్ తీసుకొస్తుంది. బైకర్స్ మర్డర్ కేసులో పోలీసులు తనను వెతుకుతున్నారని తెలిసి స్టేషనుకు ఎందుకు వెళ్లింది? ఎంత మంది ఎదురొచ్చినా కొట్టేంత ఫైటింగ్ స్కిల్స్ కార్తీకకు ఉండటానికి గల కారణం ఏమిటి? ఆమె గతం ఏమిటి? పిల్లాడిని కాపాడుకుని భర్త దగ్గరకు క్షేమంగా వెళ్లిందా? మధ్యలో శివ (రవిబాబు) చేసిన ఇన్వెస్టిగేషన్ ఏమిటి? ఎవిడెన్స్ రూమ్ నుంచి తెచ్చిన బ్యాగులో ఏముంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 


విశ్లేషణ (Rush Movie Review): రష్ చూడటం మొదలు పెట్టిన పది పదిహేను నిమిషాలకు 'ఇది రవిబాబు సినిమాయేనా?' అని సందేహం కలుగుతుంది. కథ, కథనం ఏమాత్రం బాలేదు. నిర్మాణ విలువలు మరీ నాసిరకంగా ఉన్నాయి. బాంబ్ బ్లాస్ట్, కార్ డ్రైవింగ్ సీన్స్ చూస్తుంటే... ఇంత దారుణంగా చుట్టేశారేంటి? అని ప్రతి సన్నివేశంలో, అడుగడుగునా అనిపిస్తుంది. ఈ చిత్రానికి రవిబాబు దర్శకుడు కాదు. అయితే... కథా రచయిత, నిర్మాత ఆయనే. లో బడ్జెట్ ఉన్నప్పటికీ... క్వాలిటీ ఫిల్మ్స్ అందించిన ఆయన నుంచి ఇటువంటి అవుట్ పుట్ చూడటం ఆశ్చర్యంగా అనిపించింది.


సామాన్య గృహిణికి అసాధారణ పరిస్థితులు ఎదురైతే? రవిబాబు కథలో ఎగ్జైట్ చేసే పాయింట్ ఉంది. ఆ మహిళలకు బాషా లాంటి బ్యాగ్రౌండ్ చూపించారు. అందువల్ల, ఆ ఫైట్స్ ఎలా చేసింది? అనే సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. కానీ, ఓ పాయింట్ మాత్రం పట్టించుకోలేదు... సీన్స్, స్క్రీన్ ప్లే ఎంత ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేసేలా ఉన్నాయా? లేదా? అని! 


డైసీ బొపన్న గెటప్ తెలుగు ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా లేదు. ఆ హెయిర్ స్టైల్ ఆమెకు సెట్ కాలేదు. యాక్టింగ్ కూడా అంతంత మాత్రమే. రవిబాబు మినహా మిగతా నటీనటుల ఎంపికలో కూడా బడ్జెట్ ప్రాబ్లమ్స్ చాలా కొట్టొచ్చినట్టు కనిపించాయి. ఒకట్రెండు రేసింగ్, ఛేజింగ్ సీక్వెన్సులు తప్ప ఆకట్టుకునే అంశాలు ఈ సినిమాలో లేవు. బేసిగ్గా మెయిన్ లీడ్ ఎమోషన్ కనెక్ట్ అయితే సినిమాకు ఆడియన్ కనెక్ట్ అవుతాడు. డైసీ పాత్రతో గానీ, ఆవిడ ఫ్యామిలీ బాండింగ్ సన్నివేశాలతో గానీ కనెక్ట్ కావడం కష్టం. అందుకని, సినిమాలో ట్విస్టులు రివీల్ అయినా సరే పెద్దగా థ్రిల్ ఉండదు. ముందుగా చెప్పినట్టు ప్రొడక్షన్ వేల్యూస్, డైరెక్షన్ & టెక్నికల్ వేల్యూస్ సోసోగా ఉన్నాయి.


Also Read: లవ్ మౌళి రివ్యూ: బోల్ సీన్లు, లిప్ కిస్సులతో నవదీప్ - సినిమా అంతా అంతేనా? కంటెంట్ ఉందా?


రవిబాబు నటన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తన పాత్ర వరకు న్యాయం చేశారు. రచయితగా, దర్శకుడిగా తాను చేసే సినిమాల్లో తన క్యారెక్టర్లను ప్రత్యేకంగా తీర్చి దిద్దడం ఆయనకు అలవాటు. ఈ సినిమాలో కూడా రవిబాబు పాత్రకు చివరలో ఓ ట్విస్టు ఉంది. కానీ, అప్పటి వరకు సినిమాను ఓపిగ్గా చూడటం కష్టమే. బ్యాడ్ డైరెక్షన్ & ప్రొడక్షన్ వేల్యూస్ కారణంగా మంచి స్టోరీ పాయింట్ వేస్ట్ అయ్యింది.


రష్... అంత హడావిడిగా చూడాల్సిన సినిమా కాదు! ఆ మాటకు వస్తే... మంచి సినిమాటిక్ ఫీల్ ఇస్తుందని చూసే సినిమా కూడా కాదు! రష్ చూడాలంటే ఓపిక ఉండాలి. వీకెండ్ వేరే ఆప్షన్ ఏదీ లేకపోతే... తప్పనిసరి పరిస్థితుల్లో చూడాల్సి వస్తే... స్ట్రీమింగ్ బటన్ వైపు చూడండి. లేదంటే హ్యాపీగా అవాయిడ్ చేయండి.


Also Readసత్యభామ రివ్యూ: యాక్షన్‌తో చితక్కొట్టిన కాజల్ - బరిలో మిగతా సినిమాలకు పోటీ ఇస్తుందా?