మన శరీరానికి అత్యవసరమైన పోషకాలలో అయోడిన్ కూడా ఒకటి. మనం తల్లి గర్భంలో పిండంగా ఉన్న స్థితి నుంచి జీవించి ఉన్నంతకాలం అయోడిన్ మన శరీరానికి అవసరపడుతూనే ఉంటుంది. మన ప్రతి దశలోనూ దానిది కీలక పాత్ర అనే చెప్పాలి. అయోడిన్ లోపిస్తే మాత్రం కొన్ని రకాల జబ్బులు రావడం ఖాయం. అందుకే ఉప్పుకు అదనంగా అయోడిన్‌ను కలిపి అయోడైజ్డ్ ఉప్పుగా బయట అమ్ముతున్నారు. అయోడిన్ మట్టిలోనూ, సముద్రాల్లోనూ సహజంగా లభిస్తుంది. దీన్ని ఉప్పులో కలిపి అమ్ముతుంటారు. ప్రపంచంలో ఎక్కువ భాగం అయోడిన్ మహాసముద్రాల్లోనే ఉందని చెబుతారు. 


ఇది మన శరీరానికి అత్యవసరమైనదని ముందే చెప్పుకున్నాం. మన మెదడు ఎదుగుదలకు, శ్వాస తీసుకోవడానికి, గుండె వేగం సమతుల్యంగా ఉండడానికి, జీర్ణక్రియ సవ్యంగా జరగడానికి, జీవక్రియలు మెరుగుపడడానికి, శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉండడానికి, మనం చురుగ్గా పనిచేయడానికి అయోడిన్ అవసరం పడుతుంది. ఈ పనులన్నీ చేసేది థైరాయిడ్ హార్మోన్. ఈ థైరాయిడ్ హార్మోన్ కి అయోడిన్ చాలా అవసరం. అయోడిన్ లేకపోతే థైరాయిడ్ హార్మోన్లు తయారు కావు. థైరాయిడ్ గ్రంథి అయోడిన్‌ను గ్రహించి థైరాయిడ్ హార్మోన్లను విడుదల చేస్తుంది. అయోడిన్ లోపిస్తే మాత్రం థైరాయిడ్ గ్రంధి ఉబ్బిపోతుంది. దీన్నే గాయిటర్ అంటారు. మెడ కింద వాపులా కనిపిస్తుంది. అలా మెడి కింద వాపు ఉందంటే వారికి అయోడిన్ లోపించిందని అర్థం. కాబట్టి అయోడిన్ లోపించకుండా జాగ్రత్తలు పడాల్సిన అవసరం ఉంది.  మన శరీరంలో సెలీనియం, జింక్, రాగి, ఇనుము, విటమిన్ ఎ వంటివి లోపించినా కూడా అయోడిన్ పనితీరు శరీరంలో దెబ్బతింటుంది.


పిల్లల్లో కూడా అయోడిన్ లోపం కనిపిస్తూ ఉంటుంది. అలా అని వారికి ఉప్పును అధికంగా వేసి ఆహారం పెట్టకూడదు. అది మరింత ప్రమాదకరం. అయోడిన్ ఉన్న ఆహార పదార్థాలను తినిపించడం వల్ల వారు ఆ లోపం నుంచి బయటపడతారు. దీర్ఘకాలంగా శరీరంలో అయోడిన్ లోపిస్తే పిల్లల మెదడు ఎదుగుదల క్షీణిస్తుంది. అలాగే మహిళల్లో రొమ్ముల్లో గడ్డలు లాంటివి ఏర్పడతాయి. అవి నొప్పి కూడా పెడుతుంటాయి. అందుకే సమతుల ఆహారం తీసుకుంటూ అయోడిన్ అందేలా చూడాలి. ఉప్పును అయోడిన్ కోసం అధికంగా తినడం మంచి పద్ధతి కాదు. ఇతర ఆహారాల్లో కూడా అయోడిన్ లభిస్తుంది. వాటిని తింటూ ఉంటే అయోడిన్ లోపాన్ని త్వరగా అధిగమించవచ్చు.  ప్రతి రోజూ అయోడిన్ ఉన్న ఆహారాలను కనీసం రెండయినా తినాలి. దీని వల్ల తగినంత అయోడిన్ శరీరానికి అందుతుంంది.



Also read: గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే ఏం తినాలో చెబుతున్న హార్వర్డ్ అధ్యయనం



Also read: ఎర్ర బెండకాయలు కనిపిస్తే కచ్చితంగా కొనండి, వీటిలో ఎన్నో పోషక విలువలు




























గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.