గుండెపోటు యువతను కూడా కబళిస్తోంది. గుండెపోటుతో మరణించే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఆధునిక కాలంలో మారిన ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటివి త్వరగా గుండెపోటు బారిన పడేలా చేస్తున్నాయి. గుండెకు చేటు చేసే చెడు కొలెస్ట్రాల్‌ను పెంచి ట్రై గ్లిజరైడ్స్ శరీరంలో పేరుకుపోయేలా ఆధునిక జీవనశైలి దోహదపడుతోంది. అందుకే ఆహార పద్ధతులను జీవన శైలిని మార్చుకోవడం ద్వారా గుండెను కాపాడుకోవచ్చు. అదెలాగో హార్వర్డ్ అధ్యయనం చెబుతోంది.


గుండెపోటు రావడానికి ప్రధాన కారణాలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడం, ట్రైగ్లిజరైడ్స్ అధికంగా చేరడం. ఈ రెండు శరీరంలో పేరుకుపోకుండా అడ్డుకుంటే గుండెను రక్షించుకోవచ్చు. మన శరీరం తనకు కావలసిన కొలెస్ట్రాల్‌‌ని కొంత తయారు చేసుకుంటుంది. అలాగే మనం తినే ఆహారం ద్వారా కూడా కొలెస్ట్రాల్ శరీరంలో పేరుకు పోతుంది. దీనిలో మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ అని రెండు రకాలు ఉంటాయి. మంచి కొలెస్ట్రాల్ వల్ల గుండెకు మేలు జరుగుతుంది. మనం తినే ఆహారం ద్వారా చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా ఉండాలంటే ఆహారపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన వైద్యులు ఎలాంటి ఆహారాన్ని తినాలో చెబుతున్నారు. వాటిని తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాలను తగ్గించుకోవచ్చు.


రోజువారీ ఆహారంలో ఓట్స్ కచ్చితంగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే దీనిలో బీటా గ్లూకాన్ ఉంటుంది. అది జీర్ణక్రియ వేగాన్ని తగ్గిస్తుంది.ఆకలి తక్కువ వేసేలా చేస్తుంది. దీనివల్ల ఆహారం అంతా జీర్ణం అవుతుంది. కొలెస్ట్రాల్ కూడా పేరుకుపోకుండా ఉంటుంది. కాబట్టి ఓట్స్ తో చేసే ఆహారాలు ప్రతిరోజూ తినేందుకు ప్రయత్నించండి.


బీన్స్ లో ఎన్నో రకాలు ఉన్నాయి. ఆ బీన్స్ రకాలన్నీ కూడా గుండెకు మేలు చేసేవే. రాజ్మా కూడా బీన్స్ జాతికి చెందింది. వీటితో వండిన వంటకాలు తినడం వల్ల ఎక్కువ సేపు ఆకలి వేయదు. దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి చెడు కొలెస్ట్రాల్ శరీరంలో చేరదు. వంకాయ, బెండకాయ వంటివి కూడా ఎక్కువగా తినాలి. నిజానికి ఈ రెండూ ఎక్కువ మందికి ఇష్టం ఉండదు. కానీ గుండె కోసం వంకాయ, బెండకాయతో చేసిన వంటలు కచ్చితంగా తినాలి. ఇవి గుండెకు రక్షణగా ఉంటాయి. ప్రతిరోజు గుప్పెడు జీడిపప్పులు, బాదం, వాల్నట్స్, పిస్తా, వేరుశెనగ వంటివి నానబెట్టి తినడం అలవాటు చేసుకోవాలి. అయితే వీటిని అధికంగా తింటే మాత్రం కొలెస్ట్రాల్ రూపంలో పేరుకు పోతాయి. ఇవన్నీ కలిపి ఒక గుప్పెడు రోజుకు తింటే చాలు, చెడు కొలెస్ట్రాల్ రక్త ప్రవాహంలోకి కలవకుండా వీటిలోని ఫైబర్ అడ్డుకుంటుంది.


ఇక పండ్లలో సిట్రస్ పండ్లు అవకాడోలు, బొప్పాయి, ద్రాక్షలు, స్ట్రాబెర్రీలు, యాపిల్ వంటివి రోజూ తింటూ ఉండాలి .ఇవన్నీ కూడా చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తాయి. సోయాతో చేసిన టోఫు, సోయా పాలు, సోయాబీన్స్ వంటివి కూడా చెడు కొలెస్ట్రాల్ పై శక్తివంతంగా పనిచేస్తాయి. గుండెకు రక్షణగా నిలుస్తాయి.


Also read: ఎర్ర బెండకాయలు కనిపిస్తే కచ్చితంగా కొనండి, వీటిలో ఎన్నో పోషక విలువలు




























గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.