'సలార్' ఎప్పుడు విడుదల (Salaar Release) అవుతుంది? అని రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ముందుగా ప్రకటించినట్లు... ఈ నెల 28న విడుదల కావడం లేదు. అది వంద శాతం నిజం! అయితే... ఆ మాటను ఇప్పటి వరకు 'సలార్' దర్శక, నిర్మాతలు చెప్పడం లేదు. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ కించిత్ కోపంగా ఉన్నారు. విడుదల విషయం పక్కన పెడితే... ఇప్పుడు సినిమాకు సంబంధించి ఓ కొత్త కబురు తెలిసింది. 


నెట్‌ఫ్లిక్స్ చేతికి 'సలార్' ఓటీటీ రైట్స్!
Netflix acquired Salaar digital streaming rights : 'సలార్' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుందని తెలిసింది. భారీ రేటుకు ఈ డీల్ జరిగిందట. తెలుగు, తమిళ, కన్నడ భాషల ఓటీటీ రైట్స్ మాత్రమే నెట్‌ఫ్లిక్స్ తీసుకుందని టాక్. మరి, హిందీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ & శాటిలైట్ రైట్స్ ఏదో ఒక ఛానల్ తీసుకునే అవకాశం ఉంది.


Also Read : ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - 'స్పిరిట్' షూటింగ్ స్టార్ట్ చేసేది ఎప్పుడో చెప్పిన ప్రొడ్యూసర్!



Salaar New Release Date : ఇప్పుడు ప్రభాస్ అభిమానులు డిజిటల్ రైట్స్ న్యూస్ కంటే కూడా కొత్త విడుదల తేదీ కోసం ఎక్కువ ఎదురు చూస్తున్నారు. తొలుత ఈ ఏడాది ఆఖరి నెలలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని వార్తలొచ్చాయి. ఆ తర్వాత దీపావళి సందర్భంగా నవంబర్ నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం వచ్చింది. ఏ విషయమైనా అధికారికంగా వెల్లడించే వరకు నమ్మలేం. సినిమా పనులు పూర్తి కావడం మీద ఆధారపడి ఉంటుంది. 


'సలార్' ప్లేసులో ఆ మూడు సినిమాలూ...
'సలార్' వాయిదా పడటంతో పాటు ఈ నెల 28న రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన 'స్కంద' విడుదల అవుతోంది. తొలుత ఆ సినిమాను ఈ నెల 15న విడుదల చేయాలనుకున్నా... వాయిదా వేశారు. అదొక్కటే కాదు... రాఘవా లారెన్స్, కంగనా రనౌత్ నటించిన 'చంద్రముఖి 2' కూడా సెప్టెంబర్ 15 నుంచి 28కి వాయిదా పడింది. వీటితో పాటు 'పెదకాపు 1' సెప్టెంబర్ 29న రిలీజ్ అవుతోంది.


Also Read : విశాల్‌కు అనుకూలంగా కోర్టు తీర్పు - 'మార్క్ ఆంటోని' విడుదలకు లైన్ క్లియర్!


'కెజియఫ్ 2' తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'సలార్'. దీనిని కూడా 'కెజియఫ్' నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ జోడీగా శృతి హాసన్ నటిస్తున్నారు. జర్నలిస్ట్ ఆద్య పాత్రలో ఆమె కనిపిస్తారు. ప్రభాస్, శృతి హాసన్ జంటగా నటిస్తున్న మొదటి చిత్రమిది. ఈ సినిమాలో ప్రభాస్ తల్లిగా ఈశ్వరీ రావు నటిస్తున్నారు.


వరదరాజ మన్నార్ పాత్రలో మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, రాజ మన్నార్ పాత్రలో సీనియర్ తెలుగు హీరో జగపతి బాబు, ఇతర పాత్రల్లో 'పొగరు' ఫేమ్ శ్రియా రెడ్డి, కన్నడ నటుడు మధు గురుస్వామి నటిస్తున్నారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. భువన గౌడ సినిమాటోగ్రాఫర్, ఉజ్వల్ కులకర్ణి ఎడిటర్.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial