తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడైన, తమిళంలో కథానాయకుడిగా వరుస విజయాలను అందుకోవడంతో పాటు తెలుగులోనూ పేరు తెచ్చుకున్న తెలుగు వ్యక్తి విశాల్ (Vishal). ఆయన నటించిన తాజా సినిమా 'మార్క్ ఆంటోనీ' (Mark Antony Movie). వినాయక చవితి సందర్భంగా ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే... ఈ సినిమా విడుదలపై కోర్టులో కేసు నడిచింది. అందువల్ల, విడుదలపై సందిగ్ధం నెలకొంది. అందులో హీరోకి అనుకూలంగా తీర్పు వచ్చింది. 


అసలు 'మార్క్ ఆంటోనీ' గొడవ ఏమిటి?
'మార్క్ ఆంటోనీ' విడుదలపై స్టే కోరుతూ ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ మద్రాస్ హై కోర్టును ఆశ్రయించింది. తమకు విశాల్ డబ్బులు ఇవ్వాలని, ఆ బాకీ తీరే వరకు సినిమా విడుదల కాకుండా స్టే ఇవ్వాలని కోరింది. దాంతో ముందుగా అనుకున్న సమయానికి సినిమా విడుదల అవుతుందా? లేదా? అని అనుమానాలు నెలకొన్నాయి.


తాజాగా ఆ కేసులో విశాల్, ఆయన చిత్ర బృందానికి అనుకూలంగా కోర్టు నుంచి తీర్పు లభించింది. దాంతో 'మార్క్ ఆంటోని' విడుదలకు మార్గం సుగమనం అయ్యింది. ఈ నేపథ్యంలో ''మార్క్ ఆంటోని' విడుదల చేసేందుకు కోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చింది. సెప్టెంబర్ 15న మా సినిమా భారీ ఎత్తున విడుదల కాబోతోంది'' అంటూ హీరో విశాల్ ట్వీట్ చేశారు. ఆ మాటలతో సినిమా విడుదలకు ముందు ఉన్న అడ్డంకులు అన్నీ తొలిగిపోయాయని చెప్పవచ్చు. 


Also Read : ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - 'స్పిరిట్' షూటింగ్ స్టార్ట్ చేసేది ఎప్పుడో చెప్పిన ప్రొడ్యూసర్!






'మార్క్ ఆంటోనీ' చిత్రానికి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించగా... ఎస్ వినోద్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. రెట్రో జానర్ సినిమా 'మార్క్ ఆంటోని'లో దర్శక నటుడు ఎస్.జె. సూర్య ముఖ్యమైన పాత్రలో నటించారు. విశాల్ సరసన హైదరాబాదీ అమ్మాయి రీతూ వర్మ నాయికగా నటించారు. ప్రముఖ తెలుగు హాస్య నటుడు కమ్ హీరో సునీల్, తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్, నటి అభినయ, కింగ్ స్లే, వైజి మహేంద్రన్ ఇతర పాత్రల్లో నటించారు.


Also Read : కళ్యాణ్ రామ్ 'డెవిల్'తో దర్శకుడిగా మారిన నిర్మాత - తెర వెనుక ఏం జరిగింది?  


బాక్సాఫీస్ బరిలో 'మార్క్ ఆంటోనీ'కి ఎదురు లేదు
'మార్క్ ఆంటోనీ'కి తొలుత సోలో రిలీజ్ లభించలేదు. సెప్టెంబర్ 15న సినిమాను విడుదల చేస్తామని అనౌన్స్ చేసినప్పుడు, చేసిన తర్వాత... ఆ తేదీకి మరో రెండు భారీ సినిమాలు ఉన్నాయి. 


రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన 'స్కంద' చిత్రాన్ని తొలుత సెప్టెంబర్ 15న విడుదల చేయాలని భావించిన సంగతి తెలిసిందే. రామ్ 'వారియర్' సినిమాతో తమిళ తెరకు పరిచయం అయ్యారు. అందుకని, తమిళ ప్రేక్షకుల చూపు సైతం 'స్కంద' మీద పడింది. తమిళంలో అయితే నృత్య దర్శకుడు రాఘవా లారెన్స్ హీరోగా పి. వాసు దర్శకత్వం వహించిన 'చంద్రముఖి 2'ను కూడా తొలుత సెప్టెంబర్ 15న విడుదల చేయాలని భావించారు. 'సలార్' వాయిదా పడటంతో ఆ రెండు సినిమాలు నెలాఖరుకు వెళ్లాయి. దాంతో విశాల్ సినిమాకు సోలో రిలీజ్ దక్కింది. 


తెలుగులో 'రామన్న యూత్', 'సోదర సోదరీమణులారా' సినిమాలు సెప్టెంబర్ 15న అవుతున్న అవి 'మార్క్ ఆంటోనీ'కి పోటీ కాదని చెప్పవచ్చు.



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial