ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత  ఏఆర్‌ రెహమాన్‌ తాజాగా(సెప్టెంబర్ 10న) చెన్నైలో నిర్వహించిన మ్యూజికల్ కాన్సర్ట్ తీవ్ర గందరగోళానికి దారితీసింది. ఆదిత్యరామ్ ప్యాలెస్ మైదానంలో ఏర్పాటు చేసిన ఈ ఈవెంట్ లో నిర్వాహకులు సరైన భద్రతా ఏర్పాటు చేయకపోవడంతో తొక్కిసలాట జరిగింది. కెపాసిటీకి మించి టికెట్లు విక్రయించడంతో భారీగా సంగీత ప్రియులు తరలి వచ్చారు. సరైన ఏర్పాట్లు లేకపోవడంతో అభిమానులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.  సీట్లు లేక, పార్కింగ్‌ సదుపాయాలు లేక అవస్థలు పడ్డారు. లోపలికి వెళ్లిన వారికి సైతం ప్రశాంతంగా సంగీతాన్ని ఎంజాయ్ చేసే పరిస్థితి లేదు. తొక్కిసలాటలో ఎక్కడ ప్రాణాలు పోతాయోనని చాలా మంది బయటకు వచ్చేశారు. చిన్న పిల్లలతో వెళ్లిన మహిళలు నరకయాతన అనుభవించారు.  ఈవెంట్ కు వెళ్లిన పలువురు సోషల్ మీడియా వేదికగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిర్వాహకులను తిడుతూ పోస్టులు పెట్టారు. డబ్బులు తీసుకున్నప్పుడు ఏర్పాట్లు సరిగ్గా చేయడం తెలియదా అంటూ మండిపడ్డారు.    


రెహమాన్ కు మద్దుతు తెలిపిన కార్తీ, యువన్ శంకర్ రాజా


ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహణపై పలువురు తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో నటుడు కార్తీ ఆయనకు మద్దతుగా నిలిచారు. తప్పు నిర్వాహకులదే తప్ప, రెహమాన్ ది కాదన్నారు. "మాకు రెహమాన్ సర్‌ గురించి బాగా తెలుసు. మేము ఆయనను ఎంతగానో ఇష్టపడతాం. ఇప్పటికి 3 దశాబ్దాలుగా ఆయన సంగీతాన్ని ఎంజాయ్ చేస్తున్నాం. మ్యూజికల్ కాన్సర్ట్ లో జరిగిన ఘటనలు దురదృష్టకరం. విషయం తెలుసుకుని రెహమాన్ సర్ చాలా బాధపడ్డారు. ఈ మ్యూజిక్ కాన్సర్ట్ లో నా ఫ్యామిలీ కూడా ఉంది. అయినా, నేను రెహమాన్ సర్ కు మద్దతుగా ఉంటాను. ఈ ఘటనకు నిర్వాహకులు బాధ్యత తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఎప్పుడూ ప్రేమను కురిపించే రెహమాన్ సర్ మీద, ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం మంచింది కాదు” అంటూ ఆయన ట్వీట్ చేశారు. అటు "తోటి మ్యూజిక్ డైరెక్టర్ గా, నేను జరిగిన ఘటనల పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. AR రెహమాన్‌కు అండగా ఉంటాను. ఇందులో రెహమాన్ తప్పేమీ లేదు. నిర్వాహకుల అజాగ్రత్తతోనే ఈ ఇబ్బందులు తలెత్తాయి” అని యువన్ శంకర్ రాజా అభిప్రాయపడ్డారు.






తండ్రికి అండగా నిలిచిన కూతుళ్లు


రెహమాన్ కూతుర్లు రహీమా, ఖతీజా సైతం జరిగిన ఘటనలకు నిర్వాహకులదే బాధ్యత అన్నారు. ఇందులో తన తండ్రి పొరపాటు ఏమీ లేదన్నారు. ఈ మ్యూజికల్ కాన్సర్ట్ ద్వారా రెహమాన్ డబ్బులు వసూళు చేసి ప్రజలను మోసం చేశారని వస్తున్న విమర్శలను ఖండించారు. ఇలాంటి విమర్శలు చేసే సమయంలో కాస్త ఆలోచించాలని హితవు పలికారు. ఈమేరకు రెహమాన్ చేసే సామాజిక సేవలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.  


రెహమాన్ ఏమన్నారంటే?


అటు ఈ ఘటనపై రెహమాన్‌  స్పందించారు. తాను కాన్సర్ట్‌ పై దృష్టి పెట్టానని.. బయట ఏం జరిగిందో తన దృష్టికి రాలేదని అన్నారు. అభిమానులు ఇబ్బందులు పడ్డారని తెలుసుకుని తాను కలత చెందానని చెప్పారు. అలాగే ఓ ట్వీట్‌ సైతం చేశారు. ‘‘ఇబ్బందికర పరిస్థితుల్లో కాన్సర్ట్‌ లోకి రాలేకపోయిన వాళ్లు, వారు కొనుగోలు చేసిన టికెట్‌, తమకు ఎదురైన ఇబ్బందులను తెలియజేస్తూ వివరాలు పంపిస్తే మా టీమ్ మిమ్మల్ని సంప్రదిస్తుంది’’ అని పేర్కొన్నారు.


Read Also: ‘మ్యాడ్’ మూవీ నుంచి తొలి సాంగ్ ప్రోమో రిలీజ్- ఫుల్ సాంగ్ వచ్చేది ఎప్పుడంటే?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial