ఆకుపచ్చ రంగులో ఉండే బెండకాయలు అందరికీ తెలిసినవే,  కానీ ఎర్ర బెండకాయలు కూడా ఉన్నాయి. వీటిని హైబ్రిడ్ బెండకాయలు అని కూడా అంటారు. వీటి గురించి చాలా తక్కువ మందికే తెలుసు. ఈ ఎర్ర బెండకాయలు తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇవి చాలా అరుదుగా పండిస్తూ ఉంటారు. ఎక్కడైనా మీకు కనిపిస్తే కచ్చితంగా కొని తెచ్చుకోండి. ఈ బెండకాయల సాగులో ఎలాంటి రసాయనాలు, ఎరువులు వాడరు. కేవలం సేంద్రీయ పద్ధతిలోనే పండిస్తారు. కాబట్టి వీటి ధర కూడా కాస్త అధికంగానే ఉంటుంది. అయితే ఆకుపచ్చ బెండకాయలతో పోలిస్తే ఈ ఎర్ర బెండకాయలలో ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా ఉంటాయి. కాబట్టే ధర కూడా అధికంగా ఉంటుంది. వారణాసిలోని అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్లు ఈ ఎర్ర బెండకాయల విత్తనాలను అమ్ముతున్నారు. ఈ విత్తనాలను చల్లాక 40 రోజులకే బెండకాయలు చేతికొస్తాయి. సేంద్రీయ పద్ధతిలో పండిస్తే రేటు కూడా ఎక్కువ పలుకుతుంది. ఎకరాకు 40 నుంచి 80 క్వింటాళ్ల వరకు పంట చేతికి వస్తుంది. కాబట్టి ఎర్ర బెండకాయలను పండించిన కూడా లాభమే.


ఆకుపచ్చ బెండకాయతో పోలిస్తే ఎర్ర బెండకాయలో పోషక విలువలు ఎక్కువ అని ముందే చెప్పుకున్నాం. డయాబెటిస్ బారిన పడినవారు ఎర్ర బెండకాయలను తింటూ ఉంటే ఎంతో ఆరోగ్యం. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అలాగే అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు కొలెస్ట్రాల్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు కూడా ఎర్ర బెండకాయను తరచూ తింటూ ఉండాలి. గుండె జబ్బుల బారిన పడినవారు గుండె జబ్బులు రాకుండా జాగ్రత్త పడాలి అనుకుంటున్నవారు కూడా ఎర్ర బెండకాయ కు ప్రాధాన్యత ఇవ్వాలి.  వీటిని తినడం వల్ల ఎన్నో రకాల వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందని వైద్యులు కూడా చెబుతున్నారు. సాధారణ బెండకాయతో ఎలాంటి వంటకాలు వండుతారో అవన్నీ కూడా ఎర్ర బెండకాయతో వండుకోవచ్చు. దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఎర్ర బెండకాయ తింటే మలబద్ధకం సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు తొలగిపోతాయి.


ఈ బెండకాయలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని కాపాడతాయి. మెదడుకు కూడా ఎర్ర బెండకాయలు ఎంతో మేలు చేస్తాయి. మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తాయి. వాతావరణం వేడిగా ఉంటే ఇవి సరిగా పండవు. ఎండ తక్కువగా ఉన్న వాతావరణంలోనే ఇవి పండుతాయి. ప్రస్తుతం మధ్యప్రదేశ్, తెలంగాణలో కూడా ఈ బెండకాయలు సాగు చేస్తున్నారు. తెలంగాణలోని వరంగల్‌కు చెందిన ఓ రైతు ఎర్ర బెండకాయలు సాగు చేస్తున్నాడు. అతను ఉత్తరప్రదేశ్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెజిటబుల్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన విత్తనాలను కొని తెచ్చుకున్నాడు. రక్తహీనత సమస్య ఉన్నవారు కూడా ఎర్ర బెండకాయలను తరచూ తింటూ ఉండాలి. దీనిలో మన శరీరానికి అవసరమైన విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ బి, మెగ్నీషియం, కాల్షియం, ఫైబర్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచుతాయి. గర్భిణీ స్త్రీలు ఎర్ర బెండకాయలను తింటే ఎంతో మేలు. వారికి కావలసిన ఫోలేట్ దీనిలో అధికంగా ఉంటుంది.


Also read: పాదాల వాపును తేలిగ్గా తీసుకోకండి, ఆ సమస్యలకు సంకేతం కావచ్చు



























గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.