ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో సీఐడీ నమోదు చేసిన కేసు, ఏసీబీ కోర్టు ఇచ్చిన రిమాండ్ ఆర్డర్లను కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు తరపు లాయర్లు ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారణ ముగిసేవరకూ ఏసీబీ కోర్టులో విచారణపై స్టే విధించాలని కోరారు. చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ మంగళవారం (సెప్టెంబరు 12) హైకోర్టు ప్రారంభ సమయంలో ఈ పిటిషన్ వేశారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17ఏ ప్రకారం ఎవరైనా పబ్లిక్‌ సర్వెంట్‌పై కేసు పెట్టాలంటే, లేదా దర్యాప్తు చేయాలంటే కూడా గవర్నర్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని గుర్తు చేశారు. అలాంటిదేమీ లేకుండా చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా సీఐడీ వ్యవహరించిందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాస రెడ్డి వద్ద ప్రస్తావించారు. లంచ్ మోషన్ పిటిషన్‌గా దీన్ని స్వీకరించాలని కోరారు. అయితే, ఈ పిటిషన్ బుధవారం విచారణకు రానుంది.


‘‘ఈ కేసు తొలుత నమోదైన 22 నెలల తర్వాత ఎలాంటి కనీస సాక్ష్యాలు లేకపోయినా ఉద్దేశపూర్వకంగా, ముఖ్యమంత్రి కక్ష్యతోనే నన్ను ఇరికించారు. ప్రాణాలకు ముప్పు ఉందని కేంద్ర ప్రభుత్వం నాకు జడ్‌+ సెక్యూరిటీ కల్పించింది. అయినా రాజకీయ ప్రత్యర్థులు నన్ను అంతం చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. నన్ను జైలులో ఉంచడం సేఫ్ కాదు. జడ్‌+ సెక్యూరిటీకి నన్ను దూరంగా ఉంచాలి. దాని ద్వారా ప్రత్యర్థులు టార్గెట్‌ను సులువుగా సాధించగలుగుతారు’’ అని పిటిషన్‌లో వివరించారు.


చంద్రబాబు హాయంలో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ల ఏర్పాటు కోసం ఏపీఎస్‌ఎస్‌డీసీ, సీమెన్స్‌ మధ్య జరిగిన ఒప్పందం విషయంలో ఏపీఎస్‌ఎస్‌డీసీ ఛైర్మన్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 2021 డిసెంబరు 9న ఏపీ సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. అయితే, ఆ రోజు ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పాత్ర లేనేలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఓ నిందితుడు చెప్పారని ఏడాది తర్వాత చంద్రబాబు పేరును తెరపైకి తెచ్చారు. తప్పుడు ఆ కేసులో ఇరికించి తనను అరెస్టు చేయాలని రాష్ట్రప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని పని చేసింది. సీఐడీ రిమాండ్ రిపోర్టులో ఒక్కటైనా చెల్లుబాటు అయ్యే ఆధారాలు లేవని పిటిషనర్ వివరించారు.


గవర్నర్ ముందస్తు అనుమతి తప్పనిసరన్న సుప్రీంకోర్టు
‘‘అనినీతి నిరోధక సవరణ చట్టం సెక్షన్‌ 17ఏ 2018 జులై 26న అమల్లోకి వచ్చింది. పబ్లిక్‌ సర్వెంట్లపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేయాలంటే కాంపిటెంట్‌ అథారిటీ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సుప్రీంకోర్టు 2021లో కీలక తీర్పు ఇచ్చింది. 2021 డిసెంబరు 9న నమోదుచేసిన ఎఫ్‌ఐఆర్‌ విషయంలో గవర్నర్‌ ఆమోదం లేకుండా జరుగుతున్న ప్రక్రియ అంతా చట్ట విరుద్ధమే. ఈ కేసులో సీఐడీకి దర్యాప్తు చేసే అధికారం లేదు. అసలు ఈ కేసు ఎంపీ, ఎమ్మెల్యేలపై కేసులను విచారణ చేసే స్పెషల్ కోర్టు పరిధిలోకి వస్తుంది. కాబట్టి నాపై నమోదు చేసిన కేసును కొట్టేయాలి.విచారణ పరిధి, రిమాండు విధించే అధికారం కూడా ఏసీబీ కోర్టుకు లేవు. గవర్నర్‌ ఆమోదం పొందలేదనే విషయాన్ని ఏసీబీ కోర్టు కూడా మర్చిపోయినట్టుంది. చంద్రబాబుకు రిమాండు కూడా విధించింది’’ అని పిటిషన్ లో పేర్కొన్నారు. గతంలో ఓ కేసు విచారణ సందర్భంగా స్కిల్ డెవలప్ మెంట్ ఏకంగా 2.13 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగించేలా చేసిందని హైకోర్టు గుర్తించిందని పిటిషనర్ గుర్తు చేశారు. అసలు స్కిల్ డెవలప్ మెంట్ కి ఆర్థికంగా నష్టం జరిగిందని నిరూపించేందుకు ప్రాసిక్యూషన్‌ ఆధారాలు చూపలేకపోయిందని గుర్తు చేశారు.