Sun Transit in Virgo 2023: గ్రహాల రాజు సూర్యుడు నెలకోసారి ఓ రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇలా 12 రాశుల్లో సంచారం పూర్తయ్యేసరికి ఏడాది పడుతుంది. ప్రస్తుతం సింహరాశిలో ఉన్న సూర్యుడు సెప్టెంబరు 17 నుంచి కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. కన్యారాశికి అధిపతి అయిన బుధుడు కూడా సెప్టెంబరు నెలాఖరుకి కన్యారాశిలో అడుగుపెట్టనున్నాడు. సూర్యుడు-బుధుడు ఇద్దరూ స్నేహపూర్వక సంబంధాలు కలిగి ఉంటారు. ఈ రెండు రాశుల సంచారం ప్రభావం 12 రాశులపైనా ఉంటుంది. కొన్ని రాశులవారికి అద్భుతమైన ఫలితాలుంటే..మరికొన్ని రాశులకు మిశ్రమ ఫలితాలు.. ఇంకొన్ని రాశులవారికి ప్రతికూల ఫలితాలుంటాయి. ఈ ఐదు రాశులవారికి అద్భుత ఫలితాలున్నాయి...


మేష రాశి (Aries) (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)


కన్యా రాశిలో సూర్యుడి సంచారం మేష రాశివారికి అనుకూల ఫలితాలనిస్తుంది. పాత వ్యాధి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. కొత్త ఆదాయ వనరులు పొందుతారు. ఇంట్లో శుభకార్యాల నిర్వహణకు ప్లాన్ చేస్తారు. పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. 


Also Read: భగవద్గీత మొత్తం చదవలేదా అయితే ఈ శ్లోకాలు గుర్తుపెట్టుకోండి చాలు!


కర్కాటక రాశి (Cancer) కర్కాటకం (పునర్వసు 4 పాదం, పుష్యమి, ఆశ్లేష)


కన్యారాశిలో సూర్యుడి సంచారం అంటే  కర్కాటక రాశి నుంచి మూడో స్థానంలో ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశివారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ధైర్యం రెట్టింపు అవుతుంది. నూతన పెట్టుబడులు పెట్టాలనుకుంటే కలిసొచ్చే సమయమే ఇది. వృత్తికి సంబంధించిన కొత్త అవకాశాలు లభించవచ్చు.


సింహ రాశి (Leo)(మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం)


మీ రాశికి సూర్య భగవానుడే అధిపతి. కాబట్టి సూర్యుని సంచారము మీకు ముఖ్యమైనది. సూర్యుని సంచారం వలన  ప్రతి పనిలో విజయం సాధిస్తారు. అదృష్టం కలిసొస్తుంది. ఎప్పటి నుంచో నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందుతారు. వైవాహిక జీవితంలో ఎదురయ్యే సమస్యలు కూడా ఈ సమయంలో పరిష్కారమవుతాయి.


ధనుస్సు రాశి  (Sagittarius) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) 


కన్యా రాశిలో సూర్యుడి సంచారం ధనుస్సు రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. అదృష్టం కలిసొస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటే అది విజయవంతమయ్యే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. మీ కోర్కెలు నెరవేరుతాయి. కొన్నాళ్లుగా వెంటాడుతున్న బ్యాడ్ టైమ్ మీకు దూరంగా జరగనుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ సమయం చాలా శుభప్రదం కానుంది.


Also Read: సెప్టెంబరు 14 పోలాల అమావాస్య, ఈ వ్రతం ఎందుకు ఆచరించాలి, విశిష్టత ఏంటి!


మీన రాశి (Pisces) (పూర్వాభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)


సూర్యుడి సంచారం మీన రాశివారికి అనుకూల ఫలితాలనిస్తుంది. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు తొలగిపోతాయి. సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకు కెరీర్లో పురోగతి లభిస్తుంది. మీ గౌరవం పెరుగుతుంది. 


ప్రస్తుతం సింహరాశిలో సంచరిస్తున్న సూర్య భగవానుడు సెప్టెంబరు 17న సింహరాశి నుంచి కన్యారాశిలోకి ప్రవేశించనున్నాడు.  అక్టోబరు 18 వరకూ అదే రాశిలో సంచరించి మళ్లీ అక్టోబరు 18న తులా రాశిలో అడుగుపెట్టనున్నాడు..


గమనిక:ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.   ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.