Vinayaka Chavithi 2023: సెప్టెంబరు 18 సోమవారం వినాయక చవితి. అప్పుడే ఊరూవాడా మండపాలు సిద్ధమైపోతున్నాయి. అయితే వినాయక పూజలు చేయడం కాదు ఆ రూపం వెనుకున్న పరమార్థం తెలుసుకోవాలంటారు పండితులు..
శ్లోకం
వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
వినాయక చవితి రోజు ప్రారంభమై తొమ్మిది రోజుల పాటూ ప్రత్యేక పూజలు నిర్వహించి...పదో రోజు ఊరేగింపుగా తీసుకెళ్లి గంగమ్మ ఒడికి చేరుస్తారు. ఆ తొమ్మిది రోజులూ ఊరూవాడా సంబరమే. అయితే గణపతిని సంబరంగా ఆరాధించాం, ఆడిపాడుతూ నిమజ్జనం చేశాం అన్నది కాదు..భగవంతుడి ఆరాధన ఎంతో కొంత మార్పు తీసుకురావాలి. అప్పుడే అది నిజమైన భక్తి, నిజమైన పండుగ అవుతుంది. మరి లంబోదరుడి నుంచి ఏం నేర్చుకోవాలి...ఆ రూపం వెనుకున్న పరమార్థం ఏంటి...ఆయన గుణగణాలేంటో చూద్దాం..
Also Read: ఓంకారేశ్వర్‌లో 108 అడుగుల ఆదిశంకరాచార్య విగ్రహావిష్కరణకు మూహూర్తం ఫిక్స్!
వినాయకుడిని తలుచుకోగానే ..బానపొట్ట, ఆ పొట్ట చుట్టూ సర్పం, వక్ర తొండం, నాలుగు చేతులు, ఎలుక వాహనం, చేటంత చెవులు కళ్లముందు సాక్షాత్కరిస్తాయి. ఇవన్నీ మనిషికి ఉండాల్సిన సద్గుణాలను చెబుతాయి..
- పూర్ణకుంభంలా ఉండే గణనాథుడి దేహం పరిపూర్ణమైన ఈ జగత్తుకు గుర్తు
- ఏనుగు తల మేధస్సుకు సంకేతం
- చిన్న కళ్ళు నిశిత పరిశీలనకు గుర్తు
- వక్రతుండం ఓంకార ప్రణవనాదానికి ప్రతీక
- చేటంత చెవులు అనవసరమైన విషయాలను చేటలా చెరిగేసి అవసరమైన విషయాలు మాత్రమే స్వీకరించాలని సూచన
- చిన్న నోరు అతిగా మాట్లాడినందువల్ల అనర్థాలే తప్ప ఒరిగేదేం ఉండదని సూచిస్తాయి
- వినాయకుడు ధరించిన గొడ్డలి ఇహలోక బంధాలు శాశ్వతం కాదని వాటిని తెంచేసుకోవాలనేందుకు సూచన
- ఏనుగు లాంటి ఆయన ఆకారాన్ని మోస్తున్న మూషికం ఆశకు చిహ్నం. మూషికం చిన్నగానే వున్నా ఎంత దూరమైనా ప్రయాణిస్తుంది. వేగంగా కదులుతుంది. అంటే పట్టుదల ఉంటే దేన్నైనా సాధించవచ్చని అర్థం
- వినాయకుడి పొట్టచుట్టూ ఉండే సర్పం శక్తికి సంకేతం
- నాలుగు చేతులు మానవాతీత సామర్ధ్యాలకు, తత్వానికి సంకేతం
- చేతిలో ఉన్న పాశం, అంకుశం సన్మార్గంలో నడిపించే సాధనాలు
- గణేషుడికి ఇష్టమైన లడ్డూ ఆశయాలకు అనుగుణంగా అడుగేస్తే విజయం మీ సొంతం అవుతుందని అర్థం
Also Read: ఒక్క స్తోత్రంతో పేదరాలి ఇంట బంగారువర్షం కురిపించిన ఆది శంకరాచార్యులు
తెలివితేటలకు ప్రతీక గణపతి
వ్యాసమహర్షి చెప్పిన మహాభారతాన్ని రాసింది గణపతే. మహాభారతం రాయడానికి వ్యాసుడికి ఓ లేఖకుడి అవసరం ఏర్పడింది. గణేశుని కన్నా సమర్థుడైన లేఖకుడు ఆయనకు కనిపించలేదు. తాను చెబుతుంటే రాసి పెట్టాల్సిందిగా కోరాడు వ్యాసుడు. అయితే గణపతి ఓ పరీక్ష పెట్టాలనుకున్నాడు. అదేంటంటే...వ్యాస మహర్షి నిజంగా చెప్పాలి అనుకున్నదే చెబుతారా? లేదంటే పాండిత్య ప్రదర్శన చేస్తారా? అని తెలుసుకునేందుకు..‘మీరు ఆపకుండా చెప్తేనే రాస్తాను...ఎక్కడైనా ఆపితే నేను కలం పక్కన పెట్టేస్తాను, మళ్లీ ముట్టుకోను’ అని సవాలు చేశాడు . అందుకు అంగీకరించిన వ్యాసమహర్షి భారతం మొత్తం ఆపకుండా చెప్పాడు. వినాయకుడు కూడా ఒక్క అక్షరం పొల్లు పోకుండా, ఆగకుండా రాశాడు. అంతటి మేధాసంపత్తి గణపతి సొంతం.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.