Adi Shankaracharya : పరమేశ్వరుడి జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన ఓంకారేశ్వర్‌లో 108 అడుగుల ఎత్తైన ఆదిశంకరాచార్య విగ్రహాన్ని 'ఐక్యతా విగ్రహం'గా మధ్యప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ 18న ఆవిష్కరించనుంది. ఈ మేరకు పౌరసంబంధాల శాఖ ఇప్పటికే ప్రకటన విడుదల చేసింది. ఇండోర్‌కు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓంకారేశ్వర్ లో నర్మదా నది ఒడ్డున ఉన్న మాంధాత పర్వతంపై 'స్టాట్యూ ఆఫ్ యూనిటీ' ఆవిష్కరిస్తారు. ఓంకారేశ్వర్‌లో ‘అద్వైత లోక్’ పేరుతో మ్యూజియం, ఆచార్య శంకర్ ఇంటర్నేషనల్ అద్వైత వేదాంత ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటుతో పాటు 36 హెక్టార్లలో ‘అద్వైత వనాన్ని’ అభివృద్ధి చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రకటనలో తెలిపారు.ఈ వేడుకకు దేశం నలుమూలల నుంచి సాధువులు హాజరుకానున్నారు.
Also Read: ఒక్క స్తోత్రంతో పేదరాలి ఇంట బంగారువర్షం కురిపించిన ఆది శంకరాచార్యులు
శివ స్వరూపంగా భావించే ఆది శంకరాచార్యులు ఓంకారేశ్వర్‌లో నాలుగేళ్లపాటూ ఉన్నారు. కేరళలో జన్మించిన శంకరాచార్య తన బాల్యంలో సన్యాసం తీసుకున్న తర్వాత, ఓంకారేశ్వర్‌కు చేరుకున్నారు. అక్కడ తన గురువైన గోవింద్ భగవత్‌పాద్‌ను కలుసుకున్నారని చెబుతారు . మత విశ్వాసాల ప్రకారం, శంకరాచార్య అద్వైత వేదాంత తత్వాన్ని ప్రజలకు వ్యాప్తి చేయడానికి 12 సంవత్సరాల వయస్సులో ఓంకారేశ్వర్‌ను విడిచి దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లారని చెబుతారు.
అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేసిన శంకరాచార్యులు
ఆది శంకరాచార్యులు అద్వైత సిద్ధాంతాన్ని కాలి నడకలో భారత దేశమంతా తిరుగుతూ ప్రచారం చేసి, అందుకు అవసరం అయిన పీఠాలను, ధార్మిక క్షేత్రాలను స్థాపించారు. సద్గురు సాంగత్యం, శిష్యరికం, దైవారాధన, నిత్య నైమిత్తిక చర్యలు, ధ్యానం, యోగం, సత్సంగం, భక్తి సాధనాలతో పరబ్రహ్మ తత్త్వాన్ని గ్రహించి అనుభూతి పొందవచ్చని శంకరులు బోధించారు. ఇందుకోసం ఏం చేయాలో చెబుతూ ఉన్నతమైన స్థాయిలో ఐదు సూత్రాలను సాధనా పంచకం రూపంలో ఇచ్చారు. ఇందులో విషయాలు చాలా సులభముగా అనిపించినా అది ఆచరణలో పెట్టటానికి ఎంతో నియమం, నిగ్రహం, పట్టుదల అవసరం. వేదాధ్యయనం చేయాలంటే దానికి సరైన గురువు, పాఠశాల, క్రమశిక్షణతో కూడిన దైనందినచర్య, అభ్యాసం, ఏకాగ్రత, సాధన - ఇవన్నీ కావాలి. అహంకారం వదలాలంటే దీనికి మన అలవాట్లు, మానసిక స్థితిని అందుకు తగిన విధంగా సిద్ధం చేసుకోవాలి. నియమిత సాత్త్విక ఆహారం తీసుకోవటం, సుఖ, దుఃఖాలకు అతీతంగా, రాగద్వేషాలు లేకుండా - ఒక రకమైన ఉదాసీన వైఖరిని అలవరచుకోవాలి. దీనికి మళ్లీ పైన చెప్పిన గురువు, అభ్యాసము, సాధన, క్రమశిక్షణ అన్నీ అవసరం. సాధనా పంచకాన్ని ఒక శిఖర మార్గంగా తీసుకుని దానిలో ఉన్న ప్రతి పరమాణు ధ్యేయాలకు సద్గురువును ఆశ్రయించి, శ్రుతులను అనుగమిస్తూ, అవరోధాలను అధిగమిస్తూ జీవితంలో ముందుకుసాగాలి. దీనికి భక్తి, జ్ఞానం, వైరాగ్యం, పరిశ్రమ, సహనం, శ్రద్ధ అన్ని తోడు చేసుకోవాలి. అప్పుడే భగవంతుడి సన్నిధికి చేరుకుంటారు. ఈ పంచకంలో భావం, నిగూఢమైన ఆశయం, సందేశం సంపూర్ణంగా తెలియజేయడమే శంకరుల ఉద్దేశం.
Also Read: ఆలయాల సమీపంలో ఇల్లుంటే ఏమవుతుంది, ఏ ఆలయానికి ఇల్లు ఎటువైపు ఉండాలి!
ఎంతో మంది స్వాములు, రుషులు భారతదేశంలో జన్మించి, ఆధ్యాత్మిక సందేశాన్ని ప్రచారం చేశారు కానీ శంకరులు సుస్థిర పరచిన అద్వైత సారం, ధార్మిక సిద్ధాంతాలు, పద్ధతులు ఇప్పటికీ చెక్కు చెదరకుండా, ప్రామాణికాలుగా నిలిచాయి.