Cancer Risk Factors with Cakes : పిల్లల నుంచి పెద్దలవరకు అందరూ ఇష్టంగా తినే వాటిలో కేక్స్ కూడా ఒకటి. బర్త్‌డే అయినా.. ఏ సెలబ్రేషన్ అయినా కేక్ ఉండాల్సిందే. అయితే ఈ కేక్స్ తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటోంది కర్ణాటక ప్రభుత్వం. ఈ నేపథ్యంలో పలు హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఇంతకీ కేక్ తినొచ్చా? నిపుణులు ఇచ్చే సలహాలు ఏంటి? కర్ణాటకలో ఏమి జరిగింది వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
శారీరక, మానసిక సమస్యలు
తాజాగా కర్ణాటకలోని ఫుడ్ సేఫ్టీ విభాగం లోకల్‌గా ఉండే బేకరీలపై దాడి చేసింది. అక్కడ తయారు చేసే కేక్‌లలో క్యాన్సర్‌కు కారణమయ్యే పదార్థాలు వినియోగించినట్లు తెలిపింది. వారు సేకరించిన కొన్ని శాంపిల్స్‌లో క్యాన్సర్‌కు కారణమయ్యే ప్రమాదకరమైన ఆర్టిఫిషియల్ కలర్స్‌ని కలిగి ఉన్నట్లు గుర్తించారు. నిర్దేశించిన పరిమాణం కంటే ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఈ క్యాన్సర్ కారకాలు శారీరక, మానసిక ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పును కలిగిస్తాయని అక్కడి అధికారులు తెలిపారు. రెడ్ వెల్వెట్, బ్లాక్ ఫారెస్ట్ కేక్‌లలో వీటి పరిమాణం ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు.
కేక్‌లు మాత్రమే కాదు..
కేవలం కేక్‌లు మాత్రమే కాకుండా కబాబ్‌లు, పానీపూరీ సాస్‌లలో కూడా కృతిమ రంగుల వినియోగం ఎక్కువగానే ఉన్నట్లు గుర్తించారు. అయితే ఇది కేవలం కర్ణాటకలోనే కాదు.. ఇతర రాష్ట్రాల్లో కూడా కేక్‌ల వినియోగం.. వాటికి ఆర్టిఫీషియల్ రంగుల వినియోగం ఎక్కువగానే ఉంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వాటివల్ల కలిగే ఆరోగ్య ప్రమాదల గురించి చెప్తూ.. వాటికి వీలైనంత దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
మరెన్నో ఆరోగ్య సమస్యలు
ఆర్టిఫీషియల్ కలర్స్‌ని ఎన్నో ఏళ్లుగా ఫుడ్స్ వినియోగం కోసం ఉపయోగిస్తున్నారు. ఈ సింథటిక్ కలర్స్‌ని బొగ్గుతారు నుంచి తయారు చేస్తారట. ఈ కలర్స్ విషపూరితమైనవిగా చెప్తున్నారు.. ఎన్విరాన్మెంటల్ హెల్త్ పెర్స్పెక్టివ్స్లో ఫుడ్ కలర్స్‌పై జరిపిన అధ్యయనం గురించి రాసుకొచ్చారు. వీటిని వినియోగిస్తే చర్మంపై వాపు, దద్దుర్లు, శ్వాస సమస్యలు వంటి అలెర్జీలు వస్తాయని దానిలో రాసుకొచ్చారు. ఉబ్బసం, ఆస్తమా ఉన్నవారికి వీటి ప్రభావం ఎక్కువగానే ఉంటుందట. పిల్లల్లో హైపర్ యాక్టివ్, న్యూరో బిహేవియరల్ సమస్యలకు దారితీస్తుందని యూనివర్సిటీ ఆఫ్ బర్కిలీ తెలిపింది.
ప్రాణాంతక సమస్యలు
సింథటిక్ కలర్స్‌తో కూడిన ఫుడ్ తింటే.. విరేచనాలు, వికారం, కంటిచూపు సమస్యలు, కాలేయ సమస్య, థైరాయిడ్, క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని చెప్తున్నారు నిపుణులు. ఫుడ్ కలర్స్‌తో క్యాన్సర్ వస్తుందా అంటే దీనికి ఆన్సర్ లేదు కానీ.. ఇది క్యాన్సర్ కారకాలను పెంచుతుందని చెప్తున్నారు నిపుణులు. పలు అధ్యయనాల్లో దీనిగురించి ప్రస్తావించారు కూడా.
సూచనలివే..
ప్రాసెస్ చేసిన ఫుడ్స్, కలర్స్ వినియోగించిన ఫుడ్స్ ఉపయోగించడం, తినడం కచ్చితంగా ప్రాణాంతకమని హెచ్చరిస్తున్నారు. అందుకే వాటికి వీలైనంత దూరంగా ఉండాలని.. పిల్లలకు కూడా వాటిని ఇవ్వకపోవడమే మంచిదంటున్నారు. కేక్లాంటివి తినాలనుకున్నప్పుడు సహజమైన ఫుడ్ కలర్స్‌తో ఇంట్లో వాటిని చేసుకుని తినవచ్చని సూచిస్తున్నారు.
Also Read : వానల్లో, వరదల్లో తిరుగుతున్నారా? అయితే జాగ్రత్త.. మాంసాన్ని తినేసే బాక్టీరియా సోకొచ్చు.. విజయవాడలో ఏమైందంటే