Necrotizing Fasciitis Causes :  విజయవాడలోని వరదలు అక్కడి ప్రజలకు ఎంత నష్టం మిగిల్చాయో అందరికీ తెలుసు. అయితే ఈ వరదలు ఓ బాలుడి కాలు తినేశాయి. అదేంటి అనుకుంటున్నారా? అవును వరదనీటి ద్వారా సోకిన బాక్టీరియా ఓ బాలుడి శరీరంలోకి ప్రవేశించింది. అది లోపలినుంచి మాంసాన్ని తినేయడంతో అతని కాలు తీసేయాల్సి వచ్చింది. దాని పేరు నైక్రోటైజింగ్ ఫాసిటిస్ (Necrotizing Fasciitis) అని వైద్యులు తేల్చారు. దీనితో వరద లేదా వాన నీటిలో తిరిగేప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఆ బాక్టీరియా గురించిన షాకింగ్ విషయాలు ఏంటంటే.. 


నైక్రోటైజింగ్ ఫాసిటిస్.. దీనిని ఫ్లష్ ఈటింగ్​ బాక్టీరియా (Flesh Eating Bacteria) అంటారు. ఇది అత్యంత అరుదైన, తీవ్రపరిణామాలు కలిగించే బాక్టీరియల్ ఇన్​ఫెక్షన్. ఇది శరీరంలో చేరి మృదు కణాజాలాన్ని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా కండరాలు, కొవ్వు వాటి చుట్టూ ఉన్న ఇతర అవయవాలను ఇది నాశనం చేస్తుంది. లోపలి నుంచి మాంసాన్ని తినేసి.. కృంగిపోయేలా చేసే ప్రాణాంతక బాక్టీరియా ఇది. అయితే కేరళలో మెదడును తినేసే బాక్టీరియా కూడా నీటి ద్వారానే శరీరంలోనికి చేరింది. మరి శరీరాన్ని తినేసే నైక్రోటైజింగ్ ఫాసిటిస్ లక్షణాలు ఏంటి? కారణాలు, చికిత్సలు వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


Also Read :  స్విమ్మింగ్ పూల్స్‌తో జాగ్రత్త, చిన్నారి మెదడు తినేసిన అమీబా - ఇది సోకితే 18 రోజుల్లోనే మరణం


కారణాలు ఇవే.. 


సాధారణంగా ఈ బాక్టీరియా మధుమేహ రోగుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఇది కొన్ని సందర్భాల్లో నీటి ద్వారా, ఇతర కారకాల వల్ల కూడా వ్యాపించవచ్చు. సాధారణంగా గ్రూప్ ఏ స్ట్రెప్టోకోకస్, కానీ స్టెఫిలో కాకస్, క్లెబ్సిల్లా వంటి ఇతర బాక్టీరియా కూడా నైక్రోటైజింగ్ ఫాసిటిస్​కి కారణమవచ్చు. ఇవి గాయాల నుంచి కానీ.. శస్త్రచికిత్స, కీటకాలు కాట్ల ద్వారా శరీరం లోపలికి ప్రవేశిస్తుంది. మధుమేహం, క్యాన్సర్ కారకాలను పెంచి.. రోగనిరోధక శక్తిని తగ్గించి.. ప్రమాదాన్ని పెంచుతుంది. 



లక్షణాలు ఇవే


మాంసాన్ని తినేసే ఈ బ్యాక్టీరియా శరీరంలోకి చేరిందంటే ఎక్కువ సమయం తీసుకోదు. తక్కువ రోజుల్లో శరీరమంతటా వ్యాపిస్తుంది. లోపలున్న కణజాలాన్ని చంపుతుంది. ఇది తీవ్రమైన నొప్పి, మండే అనుభూతినిస్తుంది. ప్రభావిత ప్రాంతం చుట్టూ వాపు, ఎరుపు, మంటగా ఉంటుంది. జ్వరం, చలితో కూడిన నీరసం ఎక్కువైతుంది. చర్మం రంగు మారి పొక్కులు ఏర్పడతాయి. అల్సర్లు, పుండ్లు ఏర్పడతాయి. తీవ్రమైన పరిస్థితుల్లో ఇది మరణానికి దారి తీస్తుంది. 


చికిత్స ఉందా?


ఇలాంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తే తక్షణమే వైద్య సహాయం తీసుకోవాలి. బాక్టీరియా సోకిన కణజాలాన్ని శస్త్రచికిత్స ద్వారా తొలగిస్తారు. ఇంట్రావీనస్ యాంటీ బయాటిక్స్ ఇస్తారు. కొన్ని ద్రవాలు, నొప్పిని తగ్గించే సపోర్టివ్ కేర్ ఇస్తారు. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే మరణం సంభవిస్తుంది. పది నుంచి 30 శాతం మరణాల రేటు ఉంటుంది. కాబట్టి అనుమానం కలిగిన వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.



Also Read : ఆ జబ్బు ఉన్నవాళ్లకి మనిషిని చంపి ముక్కలుగా కోస్తుంటే చాలా ఆనందంగా ఉంటుందట.. షాకింగ్ విషయాలు ఇవే
















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.