రోజుకో గుడ్డు తింటే ఎంతో ఆరోగ్యమని ఇప్పటికే ఆరోగ్యనిపుణులు  చాలా సార్లు చెప్పారు. ఇప్పుడు ఒక కొత్త అధ్యయనం కూడా అదే విషయాన్ని నిర్ధారిస్తోంది. గుడ్డు తరచూ తినేవారిలో గుండె ఆరోగ్యంగా ఉంటుందని చెబుతోంది. గుడ్డులోని పోషకాలు గుండెకు చాలా మేలుచేస్తాయి. గుడ్డులో ఉండే మంచి కొలెస్ట్రాల్ ఈ ప్రధాన అవయవానికి చాలా అవసరం. గుడ్డు తినడం వల్ల గుండెకు కలిగే లాభాల గురించి, కొత్త అధ్యయనం గురించి eLife మ్యాగజైన్లో ప్రచురించారు. రోజుకు ఒక గుడ్డు వరకు తినడం హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.


గుండెకు ఎలా మేలు?
గుడ్డులో మంచి కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. అంతేకాదు అనేక రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. గుడ్డు తినని వారితో పోలిస్తే తినే వారిలో గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే  ప్రమాదం గణనీయంగా తక్కువగా ఉన్నట్టు కొత్త అధ్యయనంలో కనుగొన్నారు. గుడ్డులో ఉండే ప్లాస్మా కొలెస్ట్రాల్ గుండె జీవక్రియలలో పోషిస్తున్న పాత్రను పరిశోధించారు. గుడ్లను మితంగా తినే వ్యక్తుల రక్తంలో అపోలిపోప్రొట్రీన్ A1 అని పిలిచే ప్రోటీన్ అధిక స్థాయిలో ఉన్నట్టు గుర్తించారు. ఇది మంచి ప్రొటీన్ జాబితాలోకి వస్తుంది.  ఈ ప్రొటీన్ ఉన్న వ్యక్తులు తమ రక్తంలో అధిక స్థాయిలో హెచ్డిఎల్  అణువులను కలిగి ఉంటారు. గుండె ఆరోగ్యానికి హెచ్డిఎల్ చాలా అవసరం. ఇది రక్త నాళాల నుంచి చెడు కొలెస్ట్రాల్ ను, కొవ్వును తొలగిస్తుంది. తద్వారా గుండెపోటు, స్ట్రాక్ వంటివి వచ్చే అవకాశం తగ్గుతుంది. అంటే గుడ్డులో ఉండే మంచి ప్రొటీన్ వల్ల రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడవు. దాని వల్ల గుండెకు ఎంతో మేలు జరుగుతుంది. 


అధ్యయనం ఇలా...
చైనాకు చెందిన శాస్త్రవేత్తలు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. 4,778 మందిపై దీన్ని నిర్వహించారు. వీరిలో 3,401 మందికి గుండె సంబంధ వ్యాధి ఉంది, 1,377 మందికి లేదు. వారి రక్తం నుంచి ప్లాస్మా నమూనాలను సేకరించి అధ్యయనం చేశారు. ప్లాస్మాలో ఉండే మెటాబోలైట్లను గుర్తించి, వాటి సంఖ్యను లెక్కించారు. అవి ఎక్కువగా ఉంటే గుండెకు మేలు చేకూరుతుంది. క్రమం తప్పకుండా గుడ్లు తినే వారితో పోలిస్తే, తక్కువ గుడ్లు తినేవారిలో వారి రక్తంలో ప్రయోజనకరమైన మెటాబోలైట్‌లు తక్కువగా ఉండి, హానికరమైన మెలాబోలైట్లు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు.


దీన్ని బట్టి రోజుకో గుడ్డు తింటే గుండె ఆరోగ్యానికి చాలా మేలని నిర్ణయించారు అధ్యయనకర్తలు. అలాగని రోజుకు నాలుగైదు గుడ్లు తింటే మాత్రం శరీరంలో కొలెస్ట్రాల్ అధికంగా చేరిపోయే అవకాశం ఉంది. రోజుకో గుడ్డు క్రమం తప్పకుండా తింటే చాలని సూచిస్తున్నారు వైద్యులు. 


Also read: దాబా స్టైల్‌లో కీమా కర్రీ రెసిపీ, తింటే ఎంతో బలం



Also read: అబ్బాయిలు జర జాగ్రత్త, వీటిని తింటే సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుంది