ఐపీఎల్ 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ చరిత్ర సృష్టించింది. తమ మొదటి సీజన్‌లోనే ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. ఆదివారం రాత్రి రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. అనంతరం గుజరాత్ టైటాన్స్ 18.1 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది.
ఘోరంగా విఫలమైన రాజస్తాన్ బ్యాటర్లు
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్తాన్‌కు ఓ మోస్తరు ఆరంభం లభించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (22: 16 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు), జోస్ బట్లర్ (39: 35 బంతుల్లో, ఐదు ఫోర్లు) మొదటి వికెట్‌కు నాలుగు ఓవర్లలోనే 31 పరుగులు జోడించారు. ఆ తర్వాత వచ్చిన వారెవరూ క్రీజులో ఎక్కువ సేపు నిలబడలేదు. వరుస విరామాల్లో గుజరాత్ బౌలర్లు వికెట్లు తీస్తూనే ఉన్నారు.
ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా నాలుగు ఓవర్లలో 17 పరుగులు మాత్రమే ఇచ్చి జోస్ బట్లర్, సంజు శామ్సన్ (14: 11 బంతుల్లో, రెండు ఫోర్లు), షిమ్రన్ హెట్‌మేయర్ (11: 12 బంతుల్లో, రెండు ఫోర్లు) వంటి కీలక వికెట్లు పడగొట్టాడు. మిగిలిన బౌలర్లలో స్పిన్నర్ సాయి కిషోర్ రెండు వికెట్లు తీయగా... షమి, యష్ దయాళ్, రషీద్ ఖాన్‌లకు తలో వికెట్ దక్కింది.
ఆడుతూ, పాడుతూ కొట్టేశారు
131 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌కు కూడా ఆరంభంలోనే ఎదురు దెబ్బలు తగిలాయి. ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (5: 7 బంతుల్లో, ఒక ఫోర్), వన్‌డౌన్ బ్యాటర్ మాథ్యూ వేడ్‌లు (8: 10 బంతుల్లో, ఒక సిక్సర్) ప్రారంభంలోనే అవుటయ్యారు. దీంతో గుజరాత్ 23 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.
అయితే మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (45: 43 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (34: 30 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్) జట్టును ఆదుకున్నారు. కొట్టాల్సిన స్కోరు తక్కువగా ఉండటంతో వీరు మెల్లగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. మూడో వికెట్‌కు 63 పరుగులు జోడించారు. అయితే కీలక సమయంలో పాండ్యాను చాహల్ అవుట్ చేశాడు.
కానీ తర్వాత వచ్చిన డేవిడ్ మిల్లర్ (32: 19 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్) మాత్రం రాజస్తాన్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. తను వేగంగా ఆడటంతో లక్ష్యాన్ని ఛేదించడం సులభం అయింది. 19వ ఓవర్ మొదటి బంతికి శుభ్‌మన్ గిల్ సిక్సర్‌తో మ్యాచ్ ముగించాడు. రాజస్తాన్ బౌలర్లలో ప్రసీద్, బౌల్ట్, చాహల్ తలో వికెట్ తీసుకున్నారు.