ఐపీఎల్ 15వ సీజన్ చివరి గేమ్‌లో గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు ట్రోఫీని ముద్దాడనుంది. ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ లీగ్. ఇందులో విజేతలకు వచ్చే పారితోషికాలు కూడా ఆ రేంజ్‌లోనే ఉంటాయి. మరి ఫైనల్ తర్వాత ఐపీఎల్ విజేతలకు, రన్నరప్‌లకు బెస్ట్ ప్లేయర్స్‌కు ఎంత ప్రైజ్ మనీ అందిస్తుందో తెలుసా?


ఐపీఎల్ పారితోషికాల వివరాలు ఇవే...
విజేత: ఐపీఎల్ టోర్నమెంట్‌లో విజేతలుగా నిలిచిన జట్టుకు అక్షరాలా రూ.20 కోట్లు ప్రైజ్ మనీ లభించనుంది.


రన్నరప్: ఫైనల్స్‌లో ఓటమి పాలై రన్నరప్‌గా నిలిచిన జట్టుకు రూ.13 కోట్ల ప్రైజ్‌మనీ అందించనున్నారు.


మూడో స్థానం: క్వాలిఫయర్-2లో ఓటమి పాలైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు రూ.7 కోట్ల ప్రైజ్‌మనీ లభించనుంది.


నాలుగో స్థానం: ఎలిమినేటర్‌లో ఓడిపోయిన లక్నో సూపర్ జెయింట్స్ రూ.6.5 కోట్ల ప్రైజ్ మనీ అందుకోనుంది.


ఆరెంజ్ క్యాప్: ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌కు ఈ క్యాప్ లభించనుంది. దీంతోపాటు రూ.15 లక్షల నగదు బహుమతి కూడా అందుకోనున్నారు. ఇది దాదాపుగా జోస్ బట్లర్‌కు కన్ఫర్మ్ అయినట్లే.


పర్పుల్ క్యాప్: సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ పర్పుల్ క్యాప్ అందుకోనున్నాడు. ప్రస్తుతం 26 వికెట్లతో హసరంగ మొదటి స్థానంలో ఉన్నాడు. అయితే చాహల్ ఒక్క వికెట్ తీస్తే హసరంగను దాటి పర్పుల్ క్యాప్ దక్కించుకుంటాడు. పర్పుల్ క్యాప్ అందుకున్న వారికి కూడా రూ.15 లక్షలు లభించనున్నాయి.


ఐపీఎల్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ: ఎమర్జింగ్ ప్లేయర్‌గా నిలిచిన ఆటగాడికి రూ.20 లక్షలు లభించనున్నాయి.


మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్‌: ఈ అవార్డు గెలిచిన ఆటగాడు రూ.12 లక్షలు అందుకోనున్నాడు.


మ్యాగ్జిమం సిక్సర్స్ అవార్డు: టోర్నమెంట్‌లో ఎక్కువ సిక్సర్లు కొట్టిన ఆటగాడికి ఈ అవార్డు లభించనుంది. రూ.12 లక్షల క్యాష్‌ప్రైజ్‌ను వీరికి అందించనున్నారు.


గేమ్ చేంజర్ ఆఫ్ ది సీజన్‌గా నిలిచిన ఆటగాడికి రూ.12 లక్షలు, సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ అవార్డు గెలిచిన ఆటగాడికి రూ.15 లక్షల క్యాష్ ప్రైజ్ లభించనుంది.