మటన్‌తో వండే వంటకాలలో కీమా చాలా ప్రత్యేకం. దీంతో చేసే బిర్యానీ, వేపుడు, కర్రీ ఎంతో రుచిగా ఉంటాయి. దాబా స్టైల్‌లో చేసే కీమా కర్రీ ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తింటారు. దీన్ని చేయడం పెద్ద కష్టమేం కాదు. 45 నిముషాల్లో రెడీ అయిపోతుంది. 


కావాల్సిన పదార్థాలు
మటన్ కీమా - అరకిలో
నూనె - నాలుగు స్పూనులు
ఉల్లిపాయలు - మూడు 
పచ్చిమిర్చి - నాలుగు
బిర్యానీ ఆకు - ఒకటి
యాలకులు - మూడు 
లవంగాలు - నాలుగు
జీలకర్ర - ఒక స్పూను
అల్లం వెల్లుల్లి పేస్టు - మూడు స్పూనులు
పసుపు - అర స్పూను
కారం - రెండు స్పూనులు
ధనియాల పొడి - రెండు చెంచాలు
టమాటా ప్యూరీ - ఒక కప్పు
నిమ్మకాయ రసం - ఒక స్పూను
కొత్తి మీర - అర కట్ట
జీలకర్ర పొడి - అర చెంచా
గరం మసాలా - అర చెంచా


తయారీ ఇలా
1. ముందుగా కీమాను బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. వీలైతే కాస్త పసుపేసి కడిగితే మరీ మంచిది.
2. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. అందులో  బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, జీలకర్ర వేసి వేయించాలి. 
3.ఉల్లిపాయను బాగా తరిగి నూనెలో వేసి వేయించాలి. అవి గా వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు వేయాలి. 
4. అడుగంటలకు కలుపూనే ఉండాలి. పచ్చిమిర్చి వేసి వేయించాలి. 
5. ఆ మిశ్రమంలో పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు, గరం మసాలా వేసి కలపాలి. 
6. కాస్త నీరు వేస్తే అడుగంటకుండా ఉడుకుతుంది. మీకు ఈ మిశ్రమాన్ని కలుపుతూ ఉంటేనే మంచి సువాసనతో పాటూ ఇగురు కనిపిస్తుంది. 
7. అందులో టమాటా ప్యూరీ కూడా వేసి ఇగురులా ఉడికించాలి. 
8.  అందులో కీమా వేయాలి. నిమ్మరసం కూడా చల్లాలి. 
9. అవసరమైతే కాస్త నీళ్లు వేయచ్చు. మీకు వేపుడు కావాలంటే వేయద్దు. ఇగురు కావాలనుకుంటే గ్లాసుడు నీళ్లు పోయచ్చు. 
10. చిన్న మంట మీద దాదాపు అరగంటసేపు ఉడికించాలి. 
11. చివర్లో దించే ముందు కొత్తి మీర తరుగు వేయాలి. 
12. కీమా ఇగురు రుచి అదిరిపోతుంది. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ వండుతారు. 


ఆరోగ్యలాభాలెన్నో...
వారానికోసారైన కీమా కర్రీ తింటే ఆరోగ్యానికి మంచిది. మధుమేహం ఉన్నవారు అధికంగా తినకూడదు కానీ, సాధారణ వ్యక్తులు దీన్ని లాగించవచ్చు. దీనిలో  అన్ని బి విటమిన్లతో పాటూ, విటమిన్ ఇ, కె ఉంటాయి. ఇందులో కాల్షియం కూడా అధికంగా ఉంటుంది. గర్భిణులు తింటే పుట్టబోయే బిడ్డకు మంచిది. సెలీనియం, కొలీనియం వంటివి ఉండడం కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం తగ్గుతుంది.  


Also read: ఫ్రిజ్‌లో నీళ్ల కన్నా కుండలో నీళ్లు తాగడం వల్ల ఎంత ఆరోగ్యమో తెలుసా?


Also read: అబ్బాయిలు జర జాగ్రత్త, వీటిని తింటే సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుంది