Health Tips in Telugu | అసిడిటి, కడుపులో మంట, ఛాతిలో మంట, ఆసిడ్ రిఫ్లక్స్ వంటివి సాధారణమైన జీర్ణసంబంధ సమస్యలు. వీటి వల్ల చాలా అసౌకర్యం కలుగుతుంది. చాలా మంది అసిడిటి తగ్గించుకునేందుకు ఉపయోగించే మూడు పానీయాలు నిజానికి పరిస్థితిని మరింత దిగజారుస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అసిడిటి ఎందుకు?
హార్ట్ బర్న్, అసిడిటి, ఆసిడ్ రిఫ్లక్స్ సమస్యలు రావడానికి కారణం ఏమిటి? ఎందుకు ఈ సమస్యలు వస్తాయో ముందుగా కారణాలు తెలిస్తే వీటి నుంచి ఉపశమనం పొందే మార్గాలు అర్థమవుతాయి. జీర్ణాశయంలో మనం తీసుకున్న ఆహారం జీర్ణం కావడం కోసం ఆమ్లాలు ఉత్పత్తి అవుతాయి. ఇవి జీర్ణాశయంలోనే ఉంటాయి. ఇవి జీర్ణాశయం నుంచి అన్నవాహికలోకి ఎగతన్ని పైకి రావడం వల్ల ఛాతిలో మంట వస్తుంది. ఇలా ఆమ్లాలు అన్నవాహికలోకి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి.
మోతాదుకు మించి తినెయ్యడం, లేదా త్వరత్వరగా భోజనం ముగించడం
మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం
అధిక బరువు లేదా స్థూల కాయం
పొగతాగే అలవాటు
జీవితంలో ఒత్తిడి
కొన్ని రకాల మందుల వల్ల కూడా అసిడిటి అవుతుంది.
కడుపులో లేదా గుండెల్లో మంట మొదలవగానే చల్లగా తాగాలని అనుకుంటారు. అయితే మనం ఇక్కడ చెప్పుకునే పానీయాలు అసిడిటి ఉన్న సమయంలో అసలు తాగకూడదని నిపుణులు చెబుతున్నారు.
నిమ్మరసం లేదా లెమన్ వాటర్
నిమ్మరసం కలిపిన నీళ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని చాలా మంది తరచుగా తాగుతుంటారు. నిజానికి నిమ్మకాయ నీళ్లు మంచివే. కానీ కడుపులో మంటగా, ఆసిడ్ రిఫ్లక్స్ అవుతున్న సమయంలో నిమ్మరసం తీసుకోవద్దు. దీనిలోని ఆమ్లతత్వం అన్నవాహికను మరింత ఇరిటేట్ చేస్తుంది. ఫలితంగా సమస్య మరింత తీవ్రమవుతుంది.
సోడా లేదా సాఫ్ట్ డ్రింక్స్
రెగ్యులర్ అయినా డైట్ సోడాలు అయినా సరే రెండింటి వల్ల గుండెల్లో మంట, ఆసిడ్ రిఫ్లక్స్ సమస్యను పెంచుతాయి. సోడాల్లో ఉండే కార్బన్ డైయాక్సైడ్ జీర్ణాశయం మీద ఒత్తిడి పెంచుతుంది. అందువల్ల మరింత ఎక్కువ ఆసిడ్ అన్నవాహిక లోకి చేరుతుంది. అదీకాక సోడాలో ఉండే చక్కెరలు అసిడిటిని మరింత పెంచుతాయి.
ఆపిల్ సైడర్ వెనిగర్
చాలా మంది ఆపిల్ సైడర్ వెనిగర్ తో అసిడిటి తగ్గుతుందని నమ్ముతారు. కానీ ఆసిడ్ రిఫ్లక్స్ కు ఇది ఎంత మాత్రం పరిష్కారం చూపదు. దీనిలోని ఆమ్ల గుణం సమస్యను మరింత తీవ్రతరం చేస్తుందని చెప్పవచ్చు. కాబట్టి ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవద్దు.
కొన్ని జాగ్రత్తలు
ఇలాంటి సమస్య తరచుగా ఎదుర్కొనే వారు కొన్ని చిన్న జాగ్రత్తలతో ఈ పరిస్థితి ఏర్పడకుండా నివారించవచ్చు.
ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోకుండా కొద్దికొద్దిగా చిన్న విరామాల్లో తీసుకోవాలి.
నిద్రకు రెండు మూడు గంటల ముందే రాత్రి భోజనం ముగించాలి.
పుల్లని ఆహార పదార్ధాలను తక్కువగా తీసుకోవాలి. చాక్లెట్, పుదీనా, ఉల్లిపాయల వల్ల సమస్య ఎక్కువవుతుంది. వీటిని తగ్గించి తీసుకోవాలి.
కాపీ, టీలు, సోడా డ్రింక్స్ తీసుకోవద్దు. ఆల్కాహాల్ అలవాటు కూడా సమస్యను మరింత పెంచుతుంది కనుక ఆల్కాహాల్ మానెయ్యాలి.
పొగతాగే అలవాటుంటే తప్పకుండా అది మానెయ్యాలి.