Vinayaka Nimajjanam 40 feet Lord Ganesha Idol Visargan In Warangal | వరంగల్: వరంగల్ నగరంలో ఏర్పాటు చేసిన 40 అడుగుల మట్టి వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అంతటా 3, 5,9, 11 రోజులకు నిమజ్జనం చేస్తే వరంగల్ లోని ఎల్లంబజార్ లో శ్రీ భద్రకాళి హిందూ ఉత్సవ సమితి ఏర్పాటు చేసిన ఈ భారీ మట్టి గణపతిని 15 రోజులకు నిమజ్జనం చేశారు. రెండు వారాల నుంచి పూజలు అందుకున్న భారీ బొజ్జ గణపయ్యకు ప్రతిష్టించిన చోటే ఘనం నిమజ్జనం చేశారు నిర్వాహకులు.
శ్రీ భద్రకాళి హిందూ ఉత్సవ సమితి నిర్వాహక కమిటీ వరంగల్ ఎల్లంబజార్ లో గణేష్ చతుర్థి సందర్భంగా 40 అడుగుల గణపతిని ఏర్పాటు చేశారు. పదిహేను రోజులపాటు పూజలు అందుకున్న భారీ గణపయ్యను ప్రతిష్టించిన చోటే నిమజ్జనం చేయడం ప్రత్యేక ఆకర్ణణగా నిలిచింది. ఫైరింజన్లతో గణేషుడిని నిమజ్జనం చేశారు. పెద్ద గణపతి, అందులోనూ మట్టి గణపతి కావడంతో ఈ భారీ గణపతి నిమజ్జనాన్ని చూసేందుకు వరంగల్ నగర నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మరో విశేషం ఏంటంటే.. ఇక్కడ ఏర్పాటు చేసిన గణపతి వద్ద ఏకంగా 365 కిలోల లడ్డూను నైవేద్యంగా సమర్పించరారు. తాజాగా నిర్వహించిన గణేష్ వేలం పాటలో ఈ భారీ లడ్డూ 2 లక్షల 26 వేల 116 రూపాయలు పలికింది. పోటీ పడి లడ్డూను దక్కించుకున్నారు.
ఆదిలాబాద్‌లో బావి మీద 52 అడుగుల గణేష్ నిమజ్జనం
ఆదిలాబాద్ జిల్లాలో గణేష్ నిమజ్జనం వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలోని కుమార్ జనతా గణేష్ మండలి ఆధ్వర్యంలో 52 అడుగుల గణపతిని నూతి మీద ఏర్పాటు చేశారు. 11వ రోజున ప్రతిష్ఠించిన చోటే గణేష్ నిమజ్జనం చేశారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ మోటర్ స్విచ్ ఆన్ చేసి ఈ నిమజ్జన ప్రక్రియను ప్రారంభించారు. బావి మీద ఏర్పాటు చేసిన భారీ గణేష్ విగ్రహం పైన కింద ఉన్న నూతి నుంచి మోటర్ పైపు సహాయంతో నీళ్లు ప్రెషర్ చేస్తూ నిమజ్జనం చేశారు. ఇక్కడి నూతి మీది గణేష్ ఆదిలాబాద్ లో చాలా ఫేమస్ అని తెలిసిందే. ఈ భారీ గణపతి నిమజ్జన వేడుకలను చూసేందుకు చుట్టుపక్కల నుంచి తరలివచ్చారు. పలువురు భక్తులు ఈ నిమజ్జనం ప్రక్రియను సెల్ ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీశారు. కొందరు ఈ గణేషుడి వద్ద సెల్ఫీలు దిగుతూ తమ ఫేస్‌బుక్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ గ్రూపులలో వైరల్ చేస్తున్నారు.