చలికాలంలో రోజూ ఒక గ్లాసు క్యారెట్, బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల అనేక పోషకాలు అందుతాయని డైటీషియన్లు సిఫార్సు చేస్తున్నారు. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలలో ఇవి సమృద్ధిగా లభిస్తాయి. ఈ అధ్బుతమైన కూరగాయల ప్రయోజనాలు పొందాలంటే జ్యూస్ గా చేసుకోవడమే సరైన మార్గం అని సూచిస్తున్నారు. వెజిటబుల్ సలాడ్ రూపంలో కేవలం కొన్ని ముక్కలు మాత్రమే తీసుకుంటారు. అదే జ్యూస్ రూపంగా అయితే ఎక్కువ తీసుకోవచ్చని అంటున్నారు


క్యారెట్ జ్యూస్ ప్రయోజనాలు


క్యారెట్ తక్కువ కేలరీల ఉండే కూరగాయ. ఇది పోషకాలతో నిండి ఉంటుంది. ఈ కూరగాయాల్లో విటమిన్ ఎ, సి, కె, పొటాషియం పుష్కలంగా లభిస్తాయి. ఇందులో విటమిన్ ఎ ఉండటం వల్ల కంటి చూపు బలహీనంగా ఉన్న వారికి మేలు చేస్తుంది. క్యారెట్ జ్యూస్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడటమే కాకుండా ఇతర కంటి సంబంధిత వ్యాధులని నివారిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. క్యాన్సర్ నిరోధక లక్షణాలని కలిగి ఉంటుంది. చర్మానికి అంతర్గత మెరుపుని ఇస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా దీన్ని తీసుకోవచ్చు.


బీట్ రూట్ జ్యూస్ ప్రయోజనాలు


చర్మం సహజమైన రంగు రావాలంటే బీట్ రూట్ జ్యూస్ తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. రక్తహీనత ఉన్నవారికి బీట్ రూట్ జ్యూస్ తప్పనిసరి. ఇందులో ఐరన్, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది కొత్త ఎర్ర రక్తకణాలు వేగంగా ఏర్పడటానికి సహాయపడుతుంది. ఫోలేట్(విటమిన్ బి 9) సమృద్ధిగా ఉండటం వల్ల కణాల పెరుగుదలకి సహాయపడుతుంది. కణాల నష్టాన్ని నివారిస్తుంది. బీట్ రూట్ రసం అధిక రక్తపోటు, గుండె రోగులకి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన బీట్ రూట్ తీసుకోవడం వల్ల శరీరంలోని మంటని అణచివేస్తుంది. జీర్ణవ్యవస్థని క్రమబద్ధీకరిస్తుంది. గట్ ఫ్రెండ్లీ ఫైబర్ ని అందిస్తుంది.


ఇవి కూడా కలుపుకోవచ్చు


బీట్ రూట్ జ్యూస్ తాగడం కాస్త కష్టంగా అనిపిస్తుంది. ఆ రుచి ఇబ్బందిగా అనిపిస్తే దానికి నారింజ లేదా కిన్నో రసాన్ని జోడించుకోవచ్చు. ఇది రసానికి తీపి రుచిని జోడిస్తుంది. విటమిన్ సి పుష్కలంగా అందుతుంది. తాజా పండ్ల రసాలకి చక్కెర మాత్రం జోడించొద్దు. ఈ రసంలో చిటికెడు నల్ల ఉప్పుని జోడించుకోవచ్చు. ఇది గ్యాస్, అసిడిటీని నివారిస్తుంది.


తాగడానికి సరైన సమయం


ఉదయం అల్పాహారానికి ముందు లేదా మధ్యాహ్నం 12 గంటలకి లోపు తీసుకోవచ్చు. భోజనానికి కనీసం రెండు గంటల ముందు తాగాలి. సూర్యాస్తమయం తర్వాత లేదా భోజనంతో పాటు ఏ రకమైన జ్యూస్ అయిన తీసుకోకపోవడమే మంచిది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: చలికాలం చిట్కాలు: ఒత్తిడి వల్ల నిద్ర పట్టడం లేదా? ఇవి తాగితే హాయిగా బజ్జోవచ్చు!