Dimple Cheeks: బుగ్గలో సొట్ట పడితే ఆ అందమే వేరు. బుగ్గసొట్టలు అబ్బాయిలకన్నా అమ్మాయిలకే ప్రత్యేక ఆకర్షణ. ప్రాచీన కాలం నుంచి ఒక నమ్మకం వాడుకలో ఉంది. సొట్ట బుగ్గలు ఉన్న వాళ్లు చాలా లక్కీ ఫెలోస్ అని, వారికి జీవితంలో డబ్బుకు లోటుండదని, ఏదోరకంగా డబ్బు చేతికి అందుతూనే ఉంటుందని చెప్పుకున్నారు. ఇదెంత వరకు నిజమో తెలియదు కానీ, సైన్సు సొట్ట బుగ్గలు పడటానికి కారణాన్ని వివరించింది.
అందమైన కథ
చెంపల్లో డింపుల్ పడటానికి ఒక ప్రాచీన కథ కూడా వాడుకలో ఉంది. ఒక దేవదూత తాను మెచ్చిన ఒక మానవుని కోసం దేవలోకం నుంచి కిందకి పడతాడు. ఆయన రెక్కలు విరిగిపోతాయి. రెక్కడు విరిగిన ఆ దేవదూతకు చిహ్నంగా మనుషులకు ఇలా బుగ్గల్లో సొటలు పడడం ప్రారంభమైందని చెప్పుకుంటారు. ఎన్నో దేశాల్లో ఈ కథను నమ్ముతారు. డింపుల్ బుగ్గలు ఉన్న వారిని చాలా ప్రత్యేకంగా చూస్తారు. ఈ ప్రపంచ జనాభాలో దాదాపు 20 నుంచి 30 శాతం మందికి సొట్టబుగ్గలు ఉన్నట్టు అంచనా.
సైన్సు ఏం చెబుతోంది...
సొట్ట బుగ్గలు పడడం వెనుక మానవ శరీర నిర్మాణమే కారణం. ముఖంలోని కండరాల్లోని మార్పులే ఈ సొట్టలు పడటానికి కారణమని చెప్పుకోవాలి. ముఖంలోని ప్రధాన కండరం అయితే జైగోమాటికస్ వల్లే ఇలా ఏర్పడతాయి. ఈ కండరం సాధారణంగా చెంప ఎముక నుంచి మన నోటి మూల వరకు ఒకేలా ఉంటుంది. అలా కాకుండా కొందరిలో పుట్టుకతోనే ఈ కండరం రెండు వేర్వేరు తాళ్లలాగా విడిపోతుంది. ఇందులో ఒకటి నోటి చివర వరకు వెళుతుంది. ఇంకోటి మాత్రం నోటి మూలలో ఆగిపోతుంది. ఆ రెండు తాళ్లలంటి కండరాల మధ్య ఖాళీ స్థలం ఏర్పడుతుంది. అందుకే నవ్వినప్పుడు అక్కడ లోతుగా సొట్ట పడుతుంది. అది ముఖానికి అందాన్ని కూడా తెచ్చిపెడుతుండడంతో, దాన్కొక సమస్యగా ఎవరూ గుర్తించడం లేదు.
వారసత్వంగా...
సొట్ట బుగ్గలు వారసత్వంగా వస్తాయి. తల్లికి లేదా తండ్రికి ఉంటే పిల్లలకు వచ్చే అవకాశం 50 శాతం ఉంది. మానవ ముఖ లక్షణాలపై జరిపిన ఒక అధ్యయనంలో డింపుల్ ఉన్నవారి ముఖ కవళికలు మరింత ప్రభావవంతంగా ఎదుటివారికి తెలుస్తాయిట. వారి నవ్వు చాలా పాజిటివ్‌గా ఎదుటివారికి అనిపిస్తుందట.
Also read: ప్రొటీన్ పొడిని ఇలా ఇంట్లోనే తయారుచేసుకోండి, రోజూ తాగితే ఎంతో బలం
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.