ఆకుపచ్చని కూరగాయలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుందని అంటారు. శాకాహారులకు కూరగాయల ద్వారానే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. అయితే చాలా కాలం నుంచి ఓ వాదన ప్రజల్లో ఉంది. అధికంగా ఉడికించడం వల్ల వాటిలోని పోషకాలు తగ్గుతాయని అంటారు. ఉడకబెట్టడం, వేయించడం, గ్రిల్ చేయడం వల్ల చాలా మేరకు పోషకాలు పోతాయనే భావన. ఇందులో నిజమెంత?
పోషకాలు తగ్గుతాయా?
తాజా కూరగాయలలో కొవ్వు తక్కువగా ఉంటుంది, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిని అధికంగా తినమని చెబుతారు వైద్యులు. వీటి వల్ల గుండెజబ్బులు, స్ట్రోక్, క్యాన్సర్ వంటి ప్రాణాంతకవ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తపడవచ్చు. అయితే వంట చేసే విధానాన్ని బట్టి అందులోని పోషకాలు క్షీణిస్తాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కూరగాయల్లో ఉండే బి, సి విటమిన్లు చాలా సున్నితంగా ఉంటాయి. కూరగాయలను అధికంగా ఉడకబెట్టినప్పుడు ఇవి ఆవిరి రూపంలో బయటకు పోతాయి. ఇక ఎ, డి, ఈ, కె వంటి కొవ్వులో కరిగే విటమిన్ల విషయంలో మాత్రం అధికంగా ఉడికించడం వల్ల మేలే జరుగుతుంది. ఇవి మరింత మెరుగ్గా పనిచేస్తాయి.
నిపుణులు ఏమంటున్నారు?
ఇక పోషకాహార నిపుణులు మాత్రం కూరగాయలను అధికంగా ఉడికించడం వల్ల అందులోని పోషకరసాలు పోతాయని తెలిపారు. ఆహారంలో విటమిన్లు నాశనం అయిపోతాయని, అలాగే గ్రిల్లింగ్ చేయడం వల్ల 40 శాతం బి విటమిన్ పోతుందని అన్నారు. విటమిన్ సి కూడా ఉడికించడం వల్ల చాలా వరకు తగ్గిపోతుందని వివరించారు. వండిన కూరగాయలతో పోలిస్తే పచ్చి కూరగాయల్లో ఎక్కువ పోషకాలు లభిస్తాయి. కానీ పచ్చి కూరగాయలు తినడం ఇప్పుడు అంత సురక్షితం కాదు. ఎందుకంటే పురుగుల మందులు చల్లుతున్నారు కాబట్టి బాగా వండాక తినడం సురక్షితం. బీట్ రూట్, క్యారెట్ వంటివి పైన చెక్కు తీసేసి నేరుగా తిన్నా, జ్యూస్ చేసుకుని తిన్నా మంచిదే. ఇక ఆకుకూరలు మాత్రం వండుకుని తినడమే ఉత్తమం.
నానబెట్టద్దు...
చాలా మంది కూరగాయలను ముక్కలుగా కోశాక నీటిలో వేసి కాసేపు ఉంచి శుభ్రపరుస్తారు. ఇలా చేయడం వల్ల పోషకాల నష్టం తప్పదంటున్నారు నిపుణులు. ముక్కలుగా కోయక ముందే శుభ్రపరుచుకోవాలని, ముక్కలుగా కోశాక నీటిలో వేయడం వల్ల చాలా మేరకు ఖనిజాలు పోతాయని చెప్పారు. కాబట్టి ఏవైనా ముందుగా వాష్ చేసి తరువాత ముక్కలు కోసి నేరుగా వండుకోవడం ఉత్తమం.
Also read: నాన్ వెజిటేరియన్లకు హ్యాపీ న్యూస్, డిప్రెషన్‌కు అధికంగా గురయ్యేది ఈ ఆహారం తినేవారేనట
Also read: క్రిస్పీ క్రిస్పీగా రొయ్యల పకోడీ, సింపుల్ రెసిపీ ఇదిగో
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.