Three Capitals Politics  :   మూడు రాజధానుల పేరుతో ఏపీలో జోరుగా రాజకీయం నడుస్తోంది. రాజీనామాలకు సిద్దమని ప్రకటిస్తున్నారు. ఓ వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే రాజీనామా లేఖ ఇచ్చారు. మరికొంత మంది తాము సిద్ధమన్నారు. విశాఖ కోసం ఒక్క ఎమ్మెల్యేనే రాజీనామా చేస్తారా మిగిలిన 150 మంది అమరావతికి అనుకూలమేనా అని విపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. కారణం  ఏదైనా  సీఎం  జగన్ చెబుతున్నట్లుగా మూడు రాజధానుల ఎజెండాగా పోటీ చేసి 175కి 175 స్థానాలు గెల్చుకున్నా మూడు రాజధానులు ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే ఈ అంశం ఇప్పటికే న్యాయస్థానాల్లో తేలిపోయింది. 


మూడు రాజధానులు కావాలంటే మొదట విభజన చట్టం మార్చాలి !


అమరావతి విషయంలో రాష్ట్రానికి శాసనాధికారం లేదని  హైకోర్టు స్పష్టం చేసింది. రాజధానికి భూములిచ్చిన అమరావతి రైతులు, 3రాజధానుల కేసుల్లో హైకోర్టు వెలువరించిన పలు తీర్పుల్లో రెండు కీలకమైన అంశాలను వెల్లడించింది.  పార్లమెంట్‌ చేసిన చట్టాలను మార్చకుండా, దానికి పూర్తి భిన్నమైన పద్ధతిలో మూడు రాజధానులు తీసుకురావడం సాధ్యం కాదని తెలిపింది. అంటే విభజన చట్టంలో ఒక్క  రాజధాని అనే ఉంది. రాజధానులు అని లేదు. కాబ్టటి మూడు రాజధానులు సాధ్యం కాదు.  రెండోది పౌరుల ప్రాథమిక హక్కులకు సర్కారే తన చర్యల ద్వారా భంగం కలిగించడం.  ఏపీ రాజధాని ఎక్కడ ఉండాలో ఎంపిక చేసుకునే అధికారం రాష్ట్రానికి ఉందని హైకోర్టు చెప్పింది. అయితే, ఏపీకి ఒకే రాజధాని ఉండాలని పార్లమెంట్‌ ఏపీ పునర్విభజన చట్టం ఆమోదించాక, మేం మూడు రాజధానులు తీసుకొస్తామంటూ రాష్ట్ర శాసనసభ చట్టం చేయజాలదని స్పష్టం చేసింది. పార్లమెంటు ఆమోదించిన చట్టాన్ని మార్చాలంటే తిరిగి అక్కడికే వెళ్లాలని, ఈ విషయంపై  శాసనసభలో చట్టాలు చేయకూడదని రాజ్యాంగ నిబంధనలను గుర్తు చేసింది. 


భూములిచ్చిన రైతుల హక్కులను హరించరాదు ! 
   
అమరావతి అంశం 30వేల మందికిపైగా రైతుల ప్రాథమిక హక్కులతో ముడిపడి ఉంది.  ప్రభుత్వం చట్టబద్ధమైన ‘గ్యారంటీ’ ఇచ్చింది. దీనిని నమ్మి... రైతులు తరతరాలుగా తమకు తిండి పెడుతున్న భూములను రాజధానికి అప్పగించారు. అంటే... జీవనోపాధిని కోల్పోయారు. ప్రభుత్వం తాను ఇచ్చిన మాట ప్రకారం... అక్కడ రాజధాని నిర్మించాలి. అభివృద్ధి చేయాలి. లేదంటే... రైతుల ‘జీవించే హక్కు’ను హరించినట్లే! ‘ఆస్తి హక్కు’నూ లాక్కున్నట్లే! అని స్పష్టం చేసింది. అంటే రైతులతో చేసుకున్న ఒప్పందాలను సీఆర్డీఏ చట్టం రద్దు చేయడం ద్వారాలో అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు పెట్టడం ద్వారానో సాధ్యం కాదు. ముఖ్యమంత్రి విశాఖలో క్యాంప్ ఆఫీస్‌ పెట్టుకోవడం ద్వారా రాజధాని తరలి పోదు. 


మూడు రాజధానులకు ప్రభుత్వం ముందు  ఒకే ఒక్క మార్గం !


హైకోర్టు తీర్పు ఇచ్చినా అమరావతి విషయంలో ప్రభుత్వం ముందు ఒకే ఒక్క  మార్గం ఉంది. మూడు రాజధానులు ఏర్పాటు చేసుకోవడానికి ఇదొక్కటే వివాదంలేని మార్గం. అదే అమరావతి రైతులకు నష్టపరిహారం చెల్లించడం. సీఆర్డీఏ, రైతుల మధ్య జరిగిన ఒప్పందాల్లో  భాగంగా.. రైతులు 9.14 ఫారం లో  పార్టీ-1: భూ యజమానులుగా.. పార్టీ-2: ప్రభుత్వం గా  ఒప్పంద జరిగింది. 9.14 ఫారం లో మనతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో 18వ షరతు ప్రకారం..ఏ షరతు అయిన ప్రభుత్వం ఉల్లంగిస్తే.. ప్రస్తుత చట్టము 2013 భూసేకరణ చట్టం కింద పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. సీఆర్డీఏ ఒప్పందంలోని 18వ షరతు ప్రకారం అమరావతిలో పనులు నిలుపుదల చేయమని పార్టీ 1 కోరకూడదని..అదే విధంగా ఒప్పందంలోని ఏ షరతు అయినా పార్టీ-2 ఉల్లంఘిస్తే నష్టపరిహారం తో పాటుగా చట్టం కింద అర్హమైన పరిహారము పొందటానికి అర్హులై ఉంటారు.  ఈ లెక్క ప్రకారం అమరావతిలో ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించిన రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం నష్టపరిహారం చెల్లంచాలి. అది కనీసం లక్ష కోట్ల వరకూ ఉంటుందని అంచనా. ఈ మొత్తం వారికి కట్టేస్తే అమరావతిని అక్కడి నుంచి తరలించవచ్చు. 


మూడు రాజధానుల పేరుతో రాజకీయం ప్రజల్ని మోసం చేయడమే..!


చట్టం, న్యాయం  ప్రకారం మూడు రాజధానులు సాధ్యం కాదు.కానీ రాజకీయ పార్టీలు మాత్రం రాజీనామాల గురించి మాట్లాడుతున్నాయి. రాజీనామాలు చేసినా..గెలిచినా.. మళ్లీ ప్రభుత్వం వచ్చినా మూడు రాజధానులు చేయలేరు. తాము గెలిస్తే మూడు రాజధానులు తెస్తామని చెప్పడం ప్రజల్ని మోసం చేయడమే. ఈ విషయంలో ప్రజల్లో మరింత అవగాహన పెరగాల్సి ఉంది. ప్రస్తుతం ఏపీ రాజధాని పొలిటికల్ గేమ్‌లో ఓ పంచింగ్ బ్యాగ్ గా అయిపోయింది. కాబట్టి ప్రజలకు ఈ అంశంపై ఎంత ఎక్కువ అవగాహన కల్పిస్తే అంత  త్వరగా వివాదానికి పరిష్కారం లభిస్తుంది.