మీరు ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా చూశారా? ఆ చిత్రంలో సత్యదేవ్ సీబీఐ అధికారి అరుణ్ (సత్యదేవ్) ఓ కేసును చేధించే క్రమంలో చనిపోతాడు. దాంతో అతడి ప్రియురాలైన న్యూరో సైంటిస్ట్ సారా (నిధి అగర్వాల్) అరుణ్ మెదడులో నిక్షిప్తమైన రహస్యాల్ని శంకర్ (రామ్) బ్రెయిన్‌లోకి పంపిస్తుంది. అయితే, అది సినిమా కాబట్టి చూసేందుకు బాగుంటుంది. కానీ, నిజ జీవితంలో అలా జరుగుతుందా? మెదడుకు చిప్ పెట్టడం సాధ్యమేనా? అనేగా మీ సందేహం. ఒకరి జ్ఞాపకాలను మరొకరి మెదడులో నిక్షిప్తం చేయడం సాధ్యం కాకపోవచ్చు. కానీ, చిప్ ఇంప్లాంట్ ద్వారా మెదడుకు సంబంధించిన సమస్యలను నయం చేయొచ్చని లండన్ వైద్యులు తెలుపుతున్నారు.
పుర్రెకు డ్రిల్ చేసి.. కరెంటు తీగలు పెట్టడం గురించి మీరు ఎప్పుడూ ఊహించి ఉండరు. ఇటీవల వైద్యులు.. సారా అనే 36 ఏళ్ల మహిళకు వైద్యులు అలాంటి చికిత్స అందించారు. దాదాపు చిన్న అగ్గిపెట్టె సైజు ఉండే పరికరాన్ని ఇంప్లాంట్ చేసి మెదడుకు అనుసంధించారు. చాలా ఏళ్ల నుంచి డిప్రషన్ (కుంగుబాటు)తో బాధపడుతున్న సారా మళ్లీ సాధారణ మహిళగా మార్చేందుకు చేసిన ప్రయత్నం ఇది. సారా గత కొన్నేళ్ల నుంచి తీవ్రమైన కుంగుబాటుతో బాధపడుతోంది. దాన్ని తగ్గించుకోవడం కోసం ఎన్నో మందులు, చికిత్సలు తీసుకుంది. చివరికి యాంటీ-డిప్రెసెంట్స్, ఎలక్ట్రోకన్వయుల్సీవ్ థెరపీ కూడా ప్రయత్నించింది. కానీ, ఫలితం లేకపోయింది.
ఆమె సమస్యను అర్థం చేసుకున్న వైద్యులు మెదడుకు ఓ పరికరాన్ని ఇంప్లాంట్ చేయడం ద్వారా డిప్రషన్‌ను తగ్గించవచ్చని సూచించారు. మొదట్లో సారా భయాన్ని వ్యక్తం చేసినా.. డిప్రషన్‌ను భరించడం కంటే రిస్క్ చేయడమే బెటర్ అని, చికిత్స విజయవంతమైతే కుంగుబాటు నుంచి బయటపడవచ్చని భావించింది. బ్రెయిన్ ఇంప్లాంట్ సర్జరీకి అంగీకరించింది. దాదాపు రోజంతా ఈ సర్జరీ సాగుతూనే ఉంది. వైద్యులు ఆమె పుర్రెకు రంథ్రాలు చేసి, వాటి నుంచి ఎలక్ట్రికల్ వైర్లను నేరుగా ఆమె మెదడుకు కనెక్ట్ చేశారు. ఆమె పుర్రె లోపలి వైపు ఎముకకు ఒక బ్యాటరీతో పనిచేసే ఒక యూనిట్‌ను, పల్స్ జనరేటర్‌ను ఏర్పాటు చేశారు.
Also Read: చేప పేగులతో సాంప్రదాయక వంటకం.. ఇది ఏ దేశంలో ప్రత్యేకమో తెలుసా?
ఆమెకు వైద్యం అందించిన రీసెర్చర్, డాక్టర్ కేథరీన్ స్కాంగోస్ మాట్లాడుతూ.. ‘‘మెదడులో మేము వెంట్రల్ స్ట్రియాటం అనే ప్రాంతాన్ని కొనుగొన్నాం. ఇంప్లాంట్ చేసిన యూనిట్ ఆ భాగానికి కనెక్ట్ చేశాం. అది డిప్రషన్‌ను తొలగిస్తుంది. అమిగ్డాలాలో మెదడు కార్యకలాపాల ప్రాంతాన్ని కూడా గుర్తించాం. అది డిప్రషన్ తీవ్రతను అంచనా వేస్తుంది. సారా ఆ ఇంప్లాంట్‌ను జీవితాంతం ఉంచుకోవల్సిందే. అది ఆమె మెదడు కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షిస్తుంది. డిప్రషన్‌కు లోనైనప్పుడు మాత్రమే విద్యుత్ ప్రేరణ అందిస్తుంది. ఈ ప్రక్రియ ఆమెకు తెలియకుండానే జరిగిపోతుంది. ఫలితంగా ఆమె అప్రమత్తంగా, శక్తివంతంగా, సానుకూల భావనలతో డిప్రషన్‌కు దూరమవుతుంది’’ అని తెలిపారు. ప్రపంచంలో ఇలాంటి బ్రెయిన్ ఇంప్లాంట్ అమర్చుకున్న తొలి వ్యక్తి సారా. ఈ కేసు విజయవంతమైనా.. చాలా రిస్క్‌తో కూడుకున్న సర్జరీ కావడం వల్ల అందరికీ ఇలాంటి చికిత్స అందించడం సాధ్యం కాదని, దీనికి ప్రత్యామ్నయం ఆలోచించాల్సి ఉంటుందని వైద్యులు అంటున్నారు.
Also read: ఊరగాయలు, పెరుగు రోజూ తినడం మంచిదేనా? స్టాన్ ఫోర్డ్ అధ్యయనం ఏం తేల్చింది?
Also read: గాలిబుడగలు పేల్చే అలవాటు మీకూ ఉందా? కొత్త అధ్యయనం ఏం చెబుతుందంటే...
Also read: ఉపవాసం చేసినప్పుడు ఈ పనులు చేయకండి, ఆరోగ్యానికి ప్రమాదం