చేప తినడం ఆరోగ్యానికి మంచిదే. శరీరానికి అవసరమైన ‘ఒమెగా-3’ ఫ్యాటీ యాసిడ్స్ చేపల నుంచి లభిస్తుంది. అయితే, మనం చేపలను వండేప్పుడు దాన్ని రెండుగా చీల్చి.. పేగులు, ఇతర భాగాలను బయటకు తీసేస్తాం. వాటిని కూడా కలిపి వండితే కూర చేదుగా ఉంటుందని అంటారు. ముఖ్యంగా పేగులను పూర్తిగా తొలగించిన తర్వాతే చేపను ముక్కలు చేసి వంటకంలో వాడతారు. అయితే, ఆ దేశంలో మాత్రం చేప పేగులను కూడా కూరలా వండుకుని తినేస్తారు. 


ఛీ.. ఇలాంటి వంటకం గురించి ఎక్కడా వినలేదంటూ చీదరించుకోవద్దు. ఎందుకంటే ఈ వంటకానికి ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాముఖ్యత ఉంది. కేవలం ఈ వంటకం కోసమే ఆ దేశంలో ప్రత్యేకంగా ‘మిల్క్‌ఫిష్’ అనే చేపలను పెంచుతున్నారు. ఈ చేప పేగులు తినేందుకు చాలా బాగుంటాయట. నూడుల్స్ తరహాలో ఉండే చేప పేగులను రకరకాల వంటకాల్లో వాడేస్తున్నారు. మిల్క్ ఫిష్ పేగులతో సూప్, ఫ్రై, ఇతరాత్ర వంటకాలను తయారు చేస్తారు. ఈ పేగులు చూసేందుకు పురుగుల్లా కనిపిస్తాయి. అన్నట్లు.. ఈ చేప పేగుల వంటకం ఏ దేశంలో ప్రత్యేకమో చెప్పలేదు కదూ. ఇది చూసేయండి. 


దాదాపు అన్ని చోట్లా చేపలు, రొయ్యల చెరువులు ఉంటాయి. అయితే, దక్షిణ తైవాన్‌లో మాత్రం.. కేవలం ‘మిల్క్ ఫిష్’ను పెంచే చెరువులు మాత్రమే కనిపిస్తాయి. అక్కడి ప్రజలకు అదే జీవనాధారం. ఆ దేశంలో పర్యటించే పర్యాటకులకు అక్కడి ఆహారం తినాలంటే పెద్ద సవాల్. ఎందుకంటే.. ఆ చేప పేగులను దాదాపు ప్రతి వంటకంలో వాడేస్తుంటారు. అయితే, అన్ని చేపల్లా ఈ చేప నిల్వ ఉండదు. ముఖ్యంగా ఈ చేపను నీటి నుంచి బయటకు తీసిన వెంటనే పేగులు తీసి వంటలో వాడేయాలి. ఫ్రిజ్‌లో పెట్టినా అవి నిల్వ ఉండవు. ఇందుకు ఆ పేగుల్లో ఉండే ఎంజైమ్స్ కారణం.


చాలా సమయాల్లో చేపలను కట్ చేసేప్పుడు వాటి పేగులను చెత్తలోకి విసిరివేస్తారు. ఎందుకంటే.. అన్ని మిల్క్ ఫిష్‌ చేపల పేగులు తినదగినవి కావు. ఆ పేగుల్లో అవి తినే ఆహారం కనిపిస్తే.. అవి వంటకు పనికిరావు. ఆ పేగులు వంటకు ఉపయోగకరంగా ఉండాలంటే, చేపలు చాలా రోజులు ఆకలితో ఉండాలి. ఆ పేగుల్లో ఉండే ఆహార వ్యర్థాలు బయటకు పోయేన్ని రోజులు ఆ చేపలు పస్తులు ఉండాల్సిందే. దీంతో చేపలను పెంచేవారు కొన్ని రోజులు ఆ చేపలకు ఆహారం పెట్టకుండా చిత్ర హింసలు పెడతారు. 



Also Read: కూల్ డ్రింక్స్ తాగితే సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుందా?


మిల్క్ ఫిష్ పేగులను వంట చేయడానికి ముందు పూర్తిగా కడగాలి. వాటి నుంచి అన్ని వ్యర్థాలను తొలగించాలి. వాటిని సూప్‌లో వేయాలంటే బాగా ఉడకబెట్టాలి. లేదా నూనెలో బాగా వేయించిన తర్వాత సూప్‌లో వేయాలి. ఈ రెండు విధానాలూ రుచికరమైనవేనని ఆహార ప్రియులు చెబుతున్నారు. అయితే, చేప పేగుల తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి మేలు జరుగుతుందనేది మాత్రం తైవాన్ ఆహార నిపుణులు చెప్పలేదు. పైగా.. ఈ చేప పేగులు మన కడుపులోకి వెళ్లిన తర్వాత అంత త్వరగా జీర్ణం కూడా కావాట. కానీ, అక్కడి ప్రజలకు అదే ఫేవరెట్. వారి శరీరం కూడా ఆ ఆహారానికే అలవాటు పడిపోయింది. 


Also Read: ‘ఫస్ట్‌ నైట్’ బెడ్‌ను రోజా పూలతోనే అలంకరించాలట.. ఎందుకో తెలుసా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి