మీరు కూల్ డ్రింగ్స్ లేదా సాఫ్ట్ డింక్స్ అతిగా తాగుతున్నారా? అయితే, జాగ్రత్త.. భవిష్యత్తులో అది మీ సంతానోత్పత్తి సామర్థ్యంపై ప్రభావం చూపవచ్చు. నమ్మబుద్ధి కావడం లేదా? అయితే, ఈ అధ్యయనాల్లో చెప్పిన కీలక విషయాలను తప్పకుండా తెలుసుకోవల్సిందే.
అధిక చక్కెర లేదా తీపి పదార్థాలు, పానీయాలతో ఊబకాయం వచ్చే అవకాశాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే. అంతేకాదు.. అధిక రక్తపోటు, మధుమేహం (డయాబెటీస్) వంటి సమస్యలు కూడా ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయి. అయితే, ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. కానీ, చాపకింద నీరులా మరో ముప్పు కూడా వెంటాడుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. అదే.. సంతాన సమస్య. తీపి పానియాలు అధికంగా తాగడం వల్ల పురుషుల్లో లైంగిక సమస్యలు తప్పవని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వీర్యంలోని స్పెర్మ్(శుక్రం) నాణ్యతను తగ్గిపోతుందని, ఫలితంగా పిల్లలను కనే సామర్థ్యం తగ్గిపోతుందని తెలుపుతున్నారు. సెక్స్ హార్మోన్లను తీపి పానీయాలు బలహీనం చేస్తాయని పేర్కొన్నారు.
జర్నల్ హ్యూమన్ రీప్రొడక్షన్‌లో పేర్కొన్న వివరాలు ప్రకారం.. 2014లో నిర్వహించిన ఓ అధ్యయనంలో పరిశోధకులు న్యూయార్క్‌లోని రోచెస్టర్‌లో 18 నుంచి 22 ఏళ్ల వయస్సు గల 189 మంది యువకుల వీర్యాలను విశ్లేషించారు. ఈ సందర్భంగా కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకున్నారు. తియ్యగా ఉండే పానీయాలను తాగడం స్పెర్మ్ చలనశీలత లేదా కదలికపై ప్రభావం చూపుతున్నట్లు కనుగొన్నారు. ఈ పానీయాల్లోని చక్కెర వల్ల బరువు పెరుగుతారని, దాని వల్ల నడుము, వృషణాల చుట్టూ ఉండే అదనపు కొవ్వు.. స్క్రోటల్ ఉష్ణోగ్రత పెంచుతుందని, ఫలితంగా స్పెర్మ్ నాణ్యత తగ్గుతుందని తెలిపారు. ముఖ్యంగా ఇది యువకులపైనే ఎక్కువ ప్రభావం చూపుతుందని, పెళ్లి వయస్సుకు వచ్చేసరికి అది ముదిరి సంతాన సమస్యలు ఏర్పడతాయని హెచ్చరించారు.
Also Read: ‘ఫస్ట్ నైట్’ బెడ్‌ను రోజా పూలతోనే అలంకరించాలట.. ఎందుకో తెలుసా?
పర్యావరణ ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హార్వర్డ్ T.H. చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, బోస్టన్, MA, USA కోపెన్‌హాగన్ విశ్వవిద్యాలయం, రిగ్‌స్పోస్‌పిటాలెట్, కోపెన్‌హాగన్, డెన్మార్క్ తదితర పరిశోధనా సంస్థలు నిర్వహించిన 2935 మంది యువకులపై జరిపిన పరిశోధనలో చక్కెర-తియ్యటి పానీయాలు(SSB) లేదా కృత్రిమంగా తీపి పానీయాలు(ASB)కు స్పెర్మ్ గాఢతను తగ్గిస్తాయని తెలుసుకున్నారు. ముఖ్యంగా SSB మొత్తం స్పెర్మ్ కౌంట్‌ని ప్రభావితం చేస్తాయి. చివరికి ఆరోగ్యంగా ఉండేు పురుషులపై కూడా ఇది ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలుసుకున్నారు. యూరోపియన్ సొసైటీ ఆఫ్ హ్యూమన్ రిప్రొడక్షన్ అండ్ ఎంబ్రియాలజీ తరపున ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ప్రచురించిన అధ్యయనం కూడా తీపి పానియాలు అతిగా తీసుకుంటే వీర్యం నాణ్యత తగ్గిపోతుందని, ఇది సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతుందని తేలింది. చూశారుగా.. తీపి ఎప్పటికే చేటే. ఏదైనా సరే మితంగా తీసుకుంటేనే మంచిది. అతిగా తీసుకుంటే.. కొత్త సమస్యలు వచ్చిపడతాయి.
Also Read: కూల్ డ్రింక్ తాగిన కొన్ని గంటల్లోనే వ్యక్తి మృతి.. ఇతడిలా మీరు చేయొద్దు!
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’ బాధ్యత వహించదు.