తలనొప్పితో రోజు మొదలైందంటే ఇక ఇంట్లో యుద్దాలే జరుగుతాయి. ప్రతి చిన్న దానికి కూడా పక్క వారి మీద కోపం, చిరాకు ప్రదరిస్తూ ఉంటారు. అది మీకే కాదు ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేస్తుంది. మీకు కూడా రోజు ఇలాగే స్టార్ట్ అవుతుందా? అయితే మీకు ఈ సమస్యలు ఉన్నాయేమో ఒక సారి చెక్ చేసుకుంటే మంచిది.


నిద్రలేమి


అర్థరాత్రి దాకా ఫోన్లో వీడియోలు చూడటం లెట్ గా నిద్రపోవడం చేస్తారు. రాత్రి సమయంలో తగినంత నిద్ర లేకపోతే దాని ప్రభావం తలనొప్పిగా బయట పడుతుంది. ఎక్కువగా నిద్రలేమితో బాధపడే వాళ్ళు ఉదయం నిద్రలేవగానే తలనొప్పితో రోజు మొదలుపెట్టాల్సి వస్తుంది. ఈ సమస్యని అధిగమించేందుకు వైద్యులని సంప్రదించడం, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం మంచిది.


అతిగా నిద్రపోవడం


నిద్రలేకపోతే మాత్రమే కాదు అతిగా నిద్రపోయినా సమస్యే. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. అతిగా నిద్రపోవడం వల్ల కూడా తలనొప్పి వస్తుంది. అలా చేస్తే సిర్కాడియన్ రిథమ్ కి భంగం వాటిల్లుతుంది. ఇది నిద్రపోయే, మేల్కోనే చక్రాన్ని నియంత్రిస్తుంది. ఇది గజిబిజి అయితే తలనొప్పి రావడం ఖాయం.


ఆందోళన


డిప్రెషన్, ఆందోళన మైగ్రేన్ అభివృద్ధి పెంచుతాయి. డిప్రెషన్ నిద్ర గంటలని కూడా తగ్గిస్తుంది. మైగ్రేన్, ఇతర తలనొప్పి నేరుగా మానసిక స్థితికి ముడిపడి ఉంటుంది. మానసిక సమస్యలు ఉంటే వైద్యులతో మాట్లాడి వెంటనే పరిష్కరించుకోవాలి. తలనొప్పితో నిద్రలేవకుండా ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి.


స్లీప్ అప్నియా


నిద్రలేమి వంటి సమస్య ఇంకొకటి స్లీప్ అప్నియా. ఒక విధంగా గురకగా చెప్తారు. రాత్రిపూట గురక రావడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. దీని వల్ల నిద్రకు అంతరాయం ఏర్పడుతుంది. తగినంత నిద్రలేకపోతే పొద్దున్నే తలనొప్పి పలకరించేస్తుంది. గురక మిమ్మల్ని మాత్రమే కాదు పక్క వారికి కూడా నిద్రలేకుండా చేస్తుంది. మీతో పాటు వాళ్ళు ఇబ్బందులు పడతారు.


బ్రక్సిజం


బ్రక్సిజం అంటే నిద్రలో పళ్ళు పటా పటామని కొరికేస్తారు. కానీ వారికి అలా చేస్తున్నామనే విషయం మాత్రం గుర్తు ఉండదు. ఉదయం నిద్రలేవగానే తలనొప్పి రావడానికి ఇది మరొక పెద్ద కారణం. దంతాలు కొరకడం వల్ల దవడలోని టెంపోరోమాండిబ్యూలర్ జాయింట్ నుంచి నొప్పి వస్తుంది. ఇది తలనొప్పికి కారణమవుతుంది. దీనికి వెంటనే చికిత్స తీసుకోకపోతే అది దంతాల మీద ప్రభావం చూపిస్తుంది.


మెడ మీద ఒత్తిడి


స్లీపింగ్ పొజిషన్ కూడా నిద్రమీద ప్రభావం చూపిస్తుంది. సరిగా పడుకోకుండా ఉంటే మెడ కండరాలపై తీవ్ర ఒత్తిడి కలుగుతుంది. ఈ ఒత్తిడి తలనొప్పిని ప్రేరేపిస్తుంది.


డీహైడ్రేషన్


శరీరం డీహైడ్రేషన్ బారిన పడినప్పుడు కూడా భరించలేనంత తలనొప్పి వస్తుందని మీకు తెలుసా? నైట్ టైమ్ తగినంత నీరు తాగకపోతే డీహైడ్రేషన్ కు గురయ్యే అవకాశం ఉంది. ఇది ఉదయం తలనొప్పి కలిగిస్తుంది. పడుకునే ముందు తగినంతగా నీరు తాగాలి. ఒకవేళ నిద్రలో దాహంగా అనిపించినా కూడా లేచి నీరు తాగి పడుకోవడం మంచిది.


ఆరోగ్య సమస్యలు


కొన్ని సార్లు అంతర్లీనంగా ఉన్న ఆరోగ్య పరిస్థితుల వల్ల కూడా తలనొప్పి వస్తుందనే విషయం గ్రహించాలి. తలనొప్పి మెదడు కణితితో సంబంధం ఉంటుందని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అందుకే పదే పదే తలనొప్పి వస్తుంటే మాత్రం విస్మరించకుండా ఆరోగ్య నిపుణులని కలిసి చికిత్స తీసుకోవడం మంచిది.  


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: మీ పెంపుడు కుక్కలకు ఈ ఆహారాలు పొరపాటున కూడా పెట్టొద్దు