చాలా మందికి ఇళ్ళలో కుక్క పిల్లలని పెంచుకోవడం అంటే ఇష్టం. వాటిని చిన్నప్పటి నుంచి తెచ్చుకుని ఇంట్లో ఒక మనిషిలాగా చూసుకుంటారు. వాటికి బర్త్ డేలు, ఆడకుక్కలు అయితే సీమంతాలు కూడ చేస్తూ ఉంటారు. పిల్లలు ఉన్న ఇళ్ళలో బుజ్జి బుజ్జి కుక్క పిల్లలు తప్పకుండా ఉంటాయి. కాస్త ప్రేమ చూపిస్తేనే తోక ఊపుకుంటూ మన వెనుక తిరిగేస్తాయి. వాటికి పెట్టె ఫుడ్ దగ్గర నుంచి వేసే వ్యాక్సిన్స్ వరకు అన్నింటా జాగ్రత్తలు తీసుకుంటారు. పెట్ డాగ్స్ ఆరోగ్యం కోసం అన్ని పనులు చేస్తారు. అయితే వాటికి పెట్టకూడదని కొన్ని ఆహారాలు ఉన్నాయి. అవి పెట్టడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయి ప్రాణాల మీదకు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ ఆహారాలు ఎప్పుడు పెట్ డాగ్స్ కు పెట్టకూడదు.
ఉల్లిపాయ
మనం ఇళ్ళలో తప్పనిసరిగా ఉల్లిపాయ వాడుతూ ఉంటాం. వీటిని కుక్కలకు అసలు పెట్టకూడదు. ఇవి పెడితే అనీమియా వచ్చే అవకాశం ఉంది. ఉల్లిపాయ, వెల్లుల్లి కొద్ది మొత్తంలో డాగ్స్ కి పెట్టినా కూడా అది చాలా ప్రమాదకరంగా మారుతుంది.
అవకాడో
అవకాడోలో పెర్సిన్ అనే ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలు కలిగిస్తుంది. అవకాడో పొరపాటున కూడా దీన్ని వాటికి పెట్టకూడదు. అవకాడో తింటే వాటికి డయేరియా, వాంతులు అయ్యే అవకాశం ఉంది. ఒక్కోసారి పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంది.
చాక్లెట్
థియోబ్రోమిన్ ఉండటం వల్ల కుక్కలకి చాక్లెట్లు అసలు మంచిది కాదు. గుండె సమస్యలు, వణుకు, మూర్చలు కలిగిస్తాయి. ఒక్కోసారి వాటి ప్రాణాలు కూడా పోయే పరిస్థితి వస్తుంది.
పచ్చి గుడ్లు
పెంపుడు కుక్కలకు చాలా మంది మాంసం పెడుతూ ఉంటారు. కానీ వండని లేదా పచ్చి గుడ్లు మాత్రం కుక్కలకు పెట్టకూడదు. ఇవి వాటికి ఫుడ్ పాయిజన్ తో సమానం. ఇందులో ఉండే ఇ కోలి బ్యాక్టీరియా వల్ల హానికరంగా మారవచ్చు.
మిఠాయి
గమ్, టూత్ పేస్ట్ లేదా ఎటువంటి క్యాండిస్ లో అయినా xylitol అనే సమ్మేళనం ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలని తగ్గిస్తుంది. కుక్కల మూత్రపిండల వైఫల్యానికి దారి తీస్తుంది.
కెఫీన్
కాఫీ గింజలు, టీ ఆకులు, శీతల పానీయాలు, ఎనర్జీ డ్రింక్స్ లో కెఫీన్ ఉంటుంది. ఇది కుక్కలకు ప్రాణాపాయం కలిగించే పదార్థం. పొరపాటున కూడ వీటిని పెట్టకూడదు. ఏమైన తింటే వెంటనే పశు వైద్యులని సంప్రదించి ట్రీట్మెంట్ ఇప్పించడం మంచిది.
ఎండుద్రాక్ష
ద్రాక్ష, ఎండు ద్రాక్ష కుక్కలలో మూత్రపిండాల వైఫల్యానికి కారణమవుతాయి. కొద్ది మొత్తంలో వాటికి పెట్టినా కూడా ప్రమాదకరమే. మీరు వాటికి పెట్టె ఆహారంలో ఎండుద్రాక్ష లేకుండా చూసి పెట్టుకోవాలి.
ఉప్పగా ఉండే ఆహారం
ఉప్పు తింటే వాటికి అతిగా దాహం వేస్తుంది. అధిక మూత్రవిసర్జనకు కారణమవుతుంది. సోడియం అయాన్ విషానికి కూడా దారి తీస్తుంది.
సీడ్స్ ఫుడ్
అరటి, యాపిల్, పుచ్చకాయ వంటి కొన్ని పండ్లలో విత్తనాలు ఉంటాయి. వాటిని పెట్టడం మంచిది కాదు. ఒకవేళ ఇచ్చే ఆహారంలో విత్తనాలు ఉండే పండ్లు ఉంటే విత్తనాలు తొలగించి అందించడం మంచిది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: నిప్పుల మీద కాల్చిన ఆహారం తినడం ఆరోగ్యకరమా? కాదా?