పిజ్జా.. బర్గర్.. పొటాటో ఫ్రై చిప్స్.. ఐస్ క్రీమ్స్ ఇవి చూస్తే నోరు అసలు కంట్రోల్ లో ఉండదు. వాటిని ఎప్పుడెప్పుడు లాగించేద్దామా అనిపిస్తుంది. ఎక్కువ మంది ఆరోగ్యకరమైన ఆహారం కంటే ఈ జంక్ ఫుడ్స్ అతిగా తినడానికి ఇష్టపడతారు. కారణం అవి రుచిగా ఉండటం, కంటికి నచ్చడం అని అనుకుంటారు. ఆకలి అయినా కాకపోయినా వాటిని చూడగానే పొట్టలో ఆత్మారాముడు ఆకలి అని అనేస్తాడు. ఇంకేముంది గబగబా వాటిని తినేస్తారు. అవి రుచిగా ఉండటం వల్లే ఎక్కువగా వాటిని తింటూ ఉంటారని చాలా మంది అనుకుంటారు. కానీ కారణం అది కాదు. అందుకు పోషకాల లోపంతో పాటు మరికొన్ని శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి.


ఆరోగ్యకరమైన పోషకాహారం తీసుకోవడానికి ఇష్టపడరు. మీకు తెలుసా ప్రతి 5-6 సంవత్సరాలకి మీ రుచి మొగ్గలు మారిపోతాయి. అందుకే కొత్త రుచులని కోరుకుంటారు. జంక్ ఫుడ్ రుచిగా ఉండటం వల్ల వాటి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టేస్తారు. అసలు జంక్ ఫుడ్ ఎందుకు తినాలని అనిపిస్తుందో తెలుసా?


నిద్రలేమి


చాలామంది నిద్రలేమితో బాధపడుతూ ఉంటారు. మరికొంతమంది ఎక్కువ నిద్ర పోవడం వంటివి చేస్తారు. దీని వల్ల ఆహార కోరికలు ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. 9 గంటలు, కేవలం 4 గంటలు మాత్రమే నిద్రపోయే వారి మెదడు కార్యకలాపాలని నిపుణులు విశ్లేషించారు. తక్కువగా నిద్రపోయే వాళ్ళు కూరగాయలు, పెరుగును చూసినప్పుడు కాకుండా పిజ్జాలు, ఐస్ క్రీమ్ చూసినప్పుడు వారి మెదడు ఆనందం సంకేతాలను పంపిస్తుంది. దీని వల్ల జంక్ ఫుడ్ చూడగానే వాళ్ళకి తినాలని కోరిక కలుగుతుంది.


ఒత్తిడి


ఒత్తిడిలో ఉన్నప్పుడు మన శరీరం కారిస్టాల్ అనే హర్మోన్ విడుదల అవుతుంది. అటువంటి సమయంలో మనం కొవ్వులు, చక్కెరలు ఎక్కువగా ఉన్న ఆహారం తినాలని అనిపిస్తుంది. అందువల్లే జంక్ ఫుడ్ వైపు మొగ్గుచూపుతారు. చక్కెర మెదడులోని కార్టిసాల్, ఒత్తిడి సంకేతాలను తగ్గిస్తుంది.


చాలా త్వరగా తింటాం


ఆహారాన్ని కనీసం 32 సార్లు నమిలి మింగాలని వైద్యులు సూచిస్తారు. అప్పుడే అది త్వరగా అరుగుతుంది. కానీ ఇప్పుడు ఉన్న బిజీ షెడ్యూల్ లో కేవలం 5-10 నిమిషాల్లో భోజనం ముగించేయాలని చూస్తారు. చాలా వరకి అందరూ ఇదే అలవాటుగా ఉంటున్నారు. చాలా త్వరగా తినడం వల్ల మెదడుకి నుంచి తప్పుడు సంకేతాలు అందుతాయి. అవి అతిగా తినడాన్ని ప్రోత్సాహిస్తాయి.


హార్మోన్ల అసమతుల్యత


రుతుక్రమం లేదా గర్భవతిగా ఉన్న సమయంలో హార్మోన్లు పూర్తి గందరగోళంగా ఉంటాయి. దాని వల్ల మెదడు, శరీరానికి మధ్య సమన్వయ లోపం వల్ల లెప్టిన్, సెరోటోనిన్ వంటి హార్మోన్లు విచిత్రమైన సమయాల్లో బలమైన కోరికలను కలిగిస్తాయి. అందువల్ల జంక్ ఫుడ్ తినాలని అనిపిస్తూ ఉంటుంది.


నీరు తాగకపోవడం, పోషకాల లోపం


కొన్ని సార్లు దాహం వేసినప్పుడు మన మనసు ఆకలి సంకేతంగా అర్థం చేసుకుంటుంది. తగినంత నీరు తాగకపోయినా, మనం తీసుకునే భోజనంలో ప్రోటీన్లు లేకపోయినా ఆకలి బాధ జంక్ ఫుడ్ వైపు మనసు వెళ్ళేలా చేస్తుంది. అంతర్లీన పోషకాల లోపం వల్ల తినే కోరిక విషయం దారి తప్పుతుంది. మెగ్నీషియం లోపం వల్ల చాక్లెట్లు, గింజలు లేదా బీన్స్ తినాలి అనిపిస్తుంది. షుగర్ డ్రాప్స్, క్రోమియం, ఫాస్పరస్ లోపం వల్ల చక్కెర తినాలని అనిపిస్తుంది. అదే విధంగా సోడియం లోపం వల్ల ఉప్పగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి ఫ్రైడ్ ఫుడ్ తినాలని కోరిక కలుగుతుంది.


Also read: ఎండలో ఫోన్ చూస్తున్నారా? ఇక భవిష్యత్తులో ఏమీ చూడలేరు, ఎందుకంటే..


Also read: ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం ఇదే, అక్కడికి వెళితే చావు తప్పదు