మన శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో గుండె ఒకటి. ఇది మన చివరి శ్వాస వరకు పనిచేస్తూనే ఉంటుంది.నిద్రపోతున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, తింటున్నప్పుడు ఇలా ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటుంది. గుండె జబ్బుల్లో కరోనరీ ఆర్డర్ డిసీజ్, పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్, కార్డియాక్ అరెస్టు, గుండెపోటు వంటివి గుండెను దెబ్బతీస్తాయి. దీనికి చెడు జీవనశైలి, జన్యుపరమైన కారకాలు కూడా కారణం అవుతాయి. అయితే ఇప్పుడు చేసిన అధ్యయనంలో ఒక షాకింగ్ విషయం తెలిసింది. మనిషి నిలబడి ఉన్నప్పుడు రక్తపోటు స్థాయిలు పెరుగుతున్నట్టు కనిపెప్టటారు. ఇది సాధారణంగా జరిగేదేనని అభిప్రాయ పడ్డారు. అయితే నిలబడి ఉన్నప్పుడు గుండె కొట్టుకునే వేగంలో సిస్టోలిక్ రక్తపోటు పెరిగితే మాత్రం అది చాలా డేంజర్ అని, భవిష్యత్తులో గుండె పోటు వచ్చే అవకాశం ఉందని కనిపెట్టారు. దీన్ని ముందస్తు సంకేతంగా భావించాలని చెబుతున్నారు పరిశోధకులు.
గుండె జబ్బులు ఏటా ఎంతో మంది ప్రాణాలు తీస్తున్నాయి. అధిక రక్తపోటు, హైపర్ టెన్షన్ వంటివి గుండె జబ్బులకు దారి తీసే అత్యంత ప్రమాదకరమైన కారణాలు. గుండె జబ్బుకు సంబంధించి దీర్ఘకాలిక ప్రమాదాన్ని అంచనా వేయగల లక్షణాలు ప్రజలకు తెలియజేయడం చాలా అవసరం. అధికరక్తపోటుకు గురయ్యే వారు గుండె పోటు బారిన పడే అవకాశం ఎక్కువే. కాబట్టి వారు జాగ్రత్తగా ఉండాలి.
రక్తపోటు అంటే?
ధమని గోడలను రక్తం గుద్దుకుంటూ వెళ్లే పరిస్థితిని రక్తపోటు అంటారు. ఇది రోజువారీ కార్యకలాపాలపై ఆధారపడి పెరగడం, తగ్గడం జరుగుతుంది. సాధారణ రక్తపోటు 120/80 mmHg. చాలా మందికి దీని కన్నా తక్కువగానే ఉంటుంది. ఇది ఈ స్థాయికి మించి ఉన్నప్పుడు అధికరక్తపోటుగా భావిస్తారు.
అధ్యయనం ఏం చెబుతుంది?
పడోవా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు గుండె జబ్బుకు, రక్తపోటుకు మధ్య అనుబంధాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించారు.ఇందుకోసం 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్కులను ఎంచుకున్నారు. వీరందరికీ అధిక రక్తపోటు ఉంది. వారు ఎలాంటి మందులు వాడడం లేదు. వారిపై చేసిన పరిశోధనలో అధిక రక్తపోటు లేని వారితో పోలిస్తే ఉన్న వారిలో గుండెపోటుకు గురయ్యే అవకాశం రెండు రెట్లు అధికంగా ఉన్నట్టు తేలింది. అలాగే ఓ కొత్త విషయాన్ని కూడా కనిపెట్టారు. ఒక వ్యక్తి నిలబడినప్పుడు రక్తపోటు స్థాయిలు అమాంతం పెరుగుతాయని తెలిసింది. అంతేకాదు సిస్టోలిక్ ఒత్తిడి కూడా పెరుగుతుందని, దీని వల్ల భవిష్యత్తులో గుండె పోటు, ఛాతీ నొప్పి, స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని తేలింది.
రక్తపోటును ఇలా తగ్గించుకోండి
1. ఉప్పు తక్కువగా తినాలి
2. పండ్లు, కూరగాయలు అధికంగా తినాలి,
3. ప్రొటీన్లు, ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తినాలి.
4. పొటాషియం అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి.
5. అధిక బరువును తగ్గించుకోవాలి.
6. రక్తపోటు తరచూ చెక్ చేసుకోవాలి.
7. ఒత్తిడి, యాంగ్జయిటీ వంటివి రాకుండా చూసుకోవాలి.