ఐపీఎల్ 2022 సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్‌కు మరో విజయం దక్కింది. సోమవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌లో రాజస్తాన్ ఏడు పరుగులతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 217 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం కోల్‌కతా 19.4 ఓవర్లలో 210 పరుగులకు ఆలౌట్ అయింది. హ్యాట్రిక్ సహా ఐదు వికెట్లు తీసుకున్న యుజ్వేంద్ర చాహల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.


బట్లర్ వన్ మ్యాన్ షో...
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ భారీ స్కోరు చేసిందంటే దానికి కారణం జోస్ బట్లరే (103: 61 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, ఐదు సిక్సర్లు). ఒకవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు వేగంగా ఆడుతూ ఇన్నింగ్స్‌లో వేగం తగ్గకుండా చూశాడు. తను ఒక ఎండ్‌లో నిలకడగా ఉండబట్టే మరో ఎండ్‌లో వచ్చిన వారు క్రీజులో ఉన్నంత సేపు వేగంగా ఆడగలిగారు.


దేవ్‌దత్ పడిక్కల్ (24: 18 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్), సంజు శామ్సన్ (38: 19 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు), షిమ్రన్ హెట్‌మేయర్ (26 నాటౌట్: 13 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) ఉన్నంతసేపు స్కోరు వేగం తగ్గకుండా చూశారు. దీంతో రాజస్తాన్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది.


ఒక్క ఓవర్‌తో కథ మార్చేసిన చాహల్
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతాకు మొదట్లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఒక్క బంతి కూడా ఎదుర్కోకముందే సునీల్ నరైన్ (0) రనౌటయ్యాడు. అయితే ఆ తర్వాత మరో ఓపెనర్ ఆరోన్ ఫించ్ (58: 28 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సర్లు), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (85: 51 బంతుల్లో, ఏడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) చెలరేగి ఆడారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 48 బంతుల్లోనే 107 పరుగులు జోడించారు. ముఖ్యంగా ఆరోన్ ఫించ్ బౌండరీలతో చెలరేగాడు. అయితే ఆరోన్ ఫించ్‌ను అవుట్ చేసి ప్రసీద్ రాజస్తాన్‌కు బ్రేక్ ఇచ్చాడు.


ఆ తర్వాత నితీష్ రాణా (18: 11 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్), ఆండ్రీ రసెల్ (0: 1 బంతి) విఫలం అయ్యారు. మరో ఎండ్‌లో శ్రేయస్ అయ్యర్ టచ్‌లోకి రావడంతో పరుగులు రావడం ఆగలేదు. ఇక విజయానికి 24 బంతుల్లో కేవలం 40 పరుగులు మాత్రమే రావాల్సిన దశలో చాహల్ మ్యాజిక్ చేశాడు. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో హ్యాట్రిక్ సహా మొత్తంగా నాలుగు వికెట్లు తీసుకున్నాడు. దీంతో మ్యాచ్ రాజస్తాన్ వైపు తిరిగింది. చివర్లో ఉమేష్ యాదవ్ (21: 9 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు) పోరాడినా తను కూడా చివరి ఓవర్లో అవుట్ కావడంతో కోల్‌కతా ఇన్నింగ్స్‌కు తెరపడింది. యుజ్వేంద్ర చాహల్‌కు  ఐదు వికెట్లు దక్కాయి.