వేసవి వచ్చిందంటే చాలు, కొన్ని ఉత్పత్తుల ధరలు కొండెక్కి కూర్చుకుంటాయి. ఇప్పుడు నిమ్మకాయల వంతు వచ్చింది. వాటి ధరలు చూస్తే మామూలుగా లేవు. పేదల సంగతి పక్కన పెడితే ఎగువ మధ్య తరగతి వాళ్లు కూడా కొనలేని పరిస్థితి. చిన్న నిమ్మకాయ ధర పది నుంచి 15 రూపాయల దాకా ఉంది. విటమిన్ సికి కేరాఫ్ అడ్రెస్ నిమ్మను కొనలేక ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. విటమిన్ సి కోసం, ఆ పులుపు కోసం కేవలం నిమ్మకాయే తినక్కర్లేదు. దాని ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి.
ఉసిరికాయలు
ఉసిరి కాయలు తిన్నా కూడా విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. రోజుకో ఉసిరికాయ తిన్నా చాలు, కావాల్సినంత విటమిన్ సి శరీరంలో చేరుతుంది. ప్రతి పండు 600 నుంచి 700మిల్లీగ్రాముల విటమిన్ సి లభిస్తుంది. ఇది విటమిన్ సి పవర్ హౌస్ అని చెప్పచ్చు.
పుల్ల మామిడి
మామిడి కాయలు విరివిగా దొరికే కాలం ఇది. నిమ్మకాయ పులిహోర చేసినట్టు మామిడి తురుముతో కూడా పులిహోర చేసుకోవచ్చు. పుల్లపుల్లగా భలే రుచిగా ఉంటుంది. నిమ్మకాయల పులిహోరను మరిపించేస్తుంది. దీనిలో కూడా విటమిన్ సి దొరుకుతుంది.
బొప్పాయి
అందరికీ అందుబాటు ధరలో ఉండే పండ్లలో బొప్పాయి కూడా ఒకటి. మహిళలకు ఇవి చాలా మంచివి. పీరియడ్స్ ను క్రమబద్ధీకరించడంలో ఇవి ముందుంటాయి. ఫైబర్, పొటాషియం, సోడియం అధికంగా లభిస్తాయి. వందగ్రాములు బొప్పాయి ముక్కలు తింటే 60.9మిల్లీగ్రాముల విటమిన్ సి లభిస్తుంది.
నారింజలు
ఇవి కూడా నిమ్మజాతి పండ్లే. ప్రతి పండులో 53 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. తాజా నారింజ రసం చాలా టేస్టీగా ఉంటుంది కూడా. పిల్లలకు పెడితే చాలా మంచిది. నిమ్మ కన్నా ఇప్పుడు నారింజలే తక్కువ ధరలు పలుకుతున్నాయి.
టమాటోలు
కూరల్లో నిమ్మ అవసరం తక్కువనే చెప్పాలి. టమాటోలు ఉండగా నిమ్మతో పెద్ద అవసరం ఉండదు. కాకపోతే విటమిన్ సి కోసం టమాటలో కూరలను తిన్నా చాలు. శరీరానికి సరిపడా దొరుకుతుంది.
జామకాయలు, స్రాబెర్రీలు, క్యాప్సికం వంటి వాటిలో కూడా విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. నిమ్మకాయ ధరలు తగ్గేవరకు వీటితో సర్దుకు పోవాల్సిందే. నిజానికి నిమ్మకాయకు మించి అధిక పోషకాలు వీటిలోనే అందుతాయి.
Also read: గర్భం ధరించకుండా వేయించుకునే లూప్ ఎంత కాలం తరువాత మార్చాలి?
Also read: తీవ్రంగా బాధపడుతున్నారా? ఎవరికీ చెప్పుకోలేరా? అయితే ఇలా చేయండి