మేఘాలయలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తమిళనాడుకు చెందిన క్రీడాకారుడు మృతి చెందాడు. జాతీయ స్థాయి పోటీలకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
తమిళనాడు చెందిన టేబుల్ టెన్నీస్ ప్లేయర్ విశ్వ దీన్ దయాళన్ రోడ్డు యాక్సిడెంట్‌లో మృతి చెందాడు. నేటి నుంచి స్టార్ట్ కానున్న సీనియర్ జాతీయ ఇండియన్ టేబుల్ టెన్నీస్ ఛాంపియన్ షిప్ పోటీల కోసం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. గౌహతి నుంంచి షిల్లాంగ్ వెళ్తున్న విశ్వ దీన్‌దయాలన్ కారు ట్రక్‌ను ఢీ కొట్టింది.
షాన్ బంగ్లా సమీపంలో జరిగిన ప్రమాదంలో విశ్వ దీన్ దయాళన్‌తోపాటు ముగ్గురు స్నేహితులు గాయపడ్డారు. ప్రమాదంపై స్పందించిన పోలీసులు వీళ్లను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే విశ్వ దీన్ దయాళన్ మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. మిగతా ముగ్గురికి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి ప్రస్తుతానికి స్టేబుల్‌గా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
విశ్వ దీన్ దయాళన్ ఈ నెల 27 నుంచి జరిగే ఆస్ట్రియాలోని లింజ్‌లో జరిగే ప్రపంచ టేబుల్ టెన్నీస్ టోర్నీ ఆడాల్సి ఉంది. ఇంతలో మృత్యువు విశ్వ దీన్ దయాళన్‌ను కమ్మేసింది. దీంతో విశ్వ ఫ్యామిలీతోపాటు ఆయనకు శిక్షణ ఇచ్చిన క్లబ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
విశ్వ దీన్ దయాళన్ మృతిపై మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి కిరణ్ రిజూజు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. యువ టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు దీనదయాళన్ విశ్వ మరణం చాలా బాధాకరమన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.