Rayalaseema Gang in Banjara Hills: హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో ఓ భూ వివాదం చోటు చేసుకుంది. రాయలసీమకు చెందిన ఓ ముఠా మారణాయుధాలతో భూమిని ఆక్రమించేందుకు విఫలయత్నం చేసింది. ఆ భూమిపై కన్ను పడ్డ ఓ వ్యక్తి వందల కోట్ల విలువ చేసే ఆ భూమిని కాజేయాలనుకున్నాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో కబ్జా యత్నం విఫలమైంది. ఈ క్రమంలోనే మొత్తం 60 మందికి పైగా వ్యక్తులను అరెస్ట్‌ చేసి పోలీసులు స్టేషన్‌కు తరలించారు. మరికొందరు అక్కడినుంచి పరారయ్యారు. 


వైద్య పరీక్షలు పూర్తి
ఈ కేసులో పోలీసులు టీజీ విశ్వప్రసాద్‌, వీవీఎన్‌ శర్మ, సుభాష్‌, లపులి శెట్టి, మిథున్ కుమార్‌ అల్లు సహా పలువురిపై సంబంధిత సెక్షన్ల కింద కేసులు పెట్టారు. భూ కబ్జాలో అదుపులోకి తీసుకున్న వాళ్లను సోమవారం ఉదయం వైద్య పరీక్షల కోసం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. మళ్లీ వారిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.


అసలేం జరిగిందంటే.. 
ఏపీ జెమ్స్ అండ్ జువెలర్స్‌ పార్క్‌కి 2005లో 2.5 ఎకరాల స్థలాన్ని అప్పటి ప్రభుత్వం కేటాయించింది. ఆ స్థలంలో కొంతమేర నిర్మాణాలు చేపట్టారు. మిగతా స్థలం ఖాళీగా ఉంది. ఆ స్థలంపై టీజీ వెంకటేష్‌ సోదరుడు టీజీ విశ్వప్రసాద్‌ కన్ను పడింది. ఆ స్థలం మాదంటూ రౌడీలను మోహరించి కబ్జాకు యత్నించారు. ఏకంగా 90 మంది రౌడీలు అక్కడికి చేరుకున్నారు. అడ్డొచ్చిన సెక్యూరిటీ సిబ్బందిపై మారణాయుధాలతో దాడి చేయించారు. వాళ్ల అడ్డు తొలగించుకుని ఖాళీ స్థలంలో బోర్డు పాతేయాలని భావించారు. డీసీఎం వ్యాన్లు, జీప్‌లు.. రౌడీల హంగామాతో ఆదివారం అర్ధరాత్రి అంతా పెద్ద హల్ చల్ చేశారు. 


స్థలం వద్ద 10 మంది దాకా సెక్యూరిటీ గార్డులను నియమించారు. హైదరాబాద్‌ ఓల్డ్ సిటీకి చెందిన వీవీఆర్‌ శర్మ అనే వ్యక్తి పత్రాలను చూపిస్తూ.. ఆ స్థలం తమదేనంటూ ముందుకు రావడంతో ఈ స్థలంపై బంజారాహిల్స్‌ పీఎస్ సహా కోర్టులో కేసులు ఉన్నాయి. ఈ క్రమంలో రెండున్నరేళ్ల క్రితం ఏపీకి చెందిన మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్‌ సోదరుడి కుమారుడు విశ్వప్రసాద్‌కు చెందిన కంపెనీతో ఆయన ఈ స్థలం విషయమై ఒప్పందం కుదుర్చుకున్నారు. అప్పటి నుంచి విశ్వప్రసాద్‌, అతని కంపెనీ ప్రతినిధులు ఆ స్థలంలో నిర్మాణాలు చేపట్టేందుకు ప్రయత్నించగా.. సెక్యూరిటీ గార్డులు అడ్డుకున్నారు. దీంతో ఆదోనికి చెందిన కొందరు రాజకీయ ప్రముఖులను చేర్చుకుని ఆదివారం ఆ స్థలాన్ని ఆక్రమించాలని ప్రణాళిక వేశారు.


ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆదోని నుంచి కిరాయి గూండాలు, రౌడీలు, బౌన్సర్లను శనివారం రాత్రి 4 ఎస్‌యూవీల్లో హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. వారి వెంట భారీ ట్రక్కుల్లో రెడీమేడ్‌ కంటైనర్లు, ఆఫీసు కంటైనర్లను తీసుకువచ్చారు. ఆదివారం ఉదయం ఆదోని రౌడీలు, గూండాలు మారణాయుధాలతో ఆ స్థలం వద్దకు చేరుకుని.. వెంట తెచ్చుకున్న పరికరాలతో లోనికి ప్రవేశించారు. వెంటనే రెడీమేడ్‌ గదులను స్థలంలో ఉంచారు. 


దీనిపై సమాచారం అందుకున్న బంజారాహిల్స్‌ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకోగా.. వారిని గమనించిన విశ్వప్రసాద్‌ సహా మరికొందరు అక్కడి నుంచి పరారు అయ్యారు. ఈ క్రమంలోనే మొత్తం 60 మంది వరకూ పట్టుబడ్డారు. వీరిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్‌ సహా నిందితులపై కేసులు నమోదు చేశారు.