Jagga Reddy On Puvvada : ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కాంగ్రెస్ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆరోపించారు.  మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ని మంత్రివర్గం నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మంలో బీజేపీ కార్యకర్త ఆత్మహత్యపై బాధితుల వాంగ్మూలం తీసుకొని ఎమ్మారో, ఆర్డీవో, సీఐ, డీఎస్పీని సస్పెండ్ చేయాలన్నారు. గత మూడేళ్లుగా పువ్వాడ అజయ్ ఖమ్మంలో కాంగ్రెస్ కార్యకర్తలపై కూడా అనేక కేసులు, పీడీ యాక్ట్ లు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. పువ్వాడ అజయ్ పై డీజీపీకి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, తాను ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఖమ్మంలో బీజేపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం అని జగ్గారెడ్డి అన్నారు.  


మంత్రి ఓ సైకో 


"మంత్రి  పువ్వాడ అజయ్ ఓ సైకో. కేసీఆర్, కేటీఆర్ దగ్గర మార్కులు కొట్టేడానికి పువ్వాడ ఓవర్ యాక్షన్ చేస్తు్న్నారు. పువ్వాడకి కొందరు పోలీసులు చెంచాగిరి చేస్తున్నారు. మూడేళ్లుగా ఖమ్మంలో పోలీసుల వేధింపులు ఎక్కువ అయ్యాయన్నారు. సీఎం వెంటనే పువ్వాడని బర్తరఫ్ చేయాలి. మూడేళ్లుగా అజయ్ మీద ఉన్న ఫిర్యాదులపై విచారణ చేయాలి. కేసీఆర్ ఆలస్యం చేస్తే ప్రభుత్వానికే నష్టం.  ఖమ్మంలో ఇంత జరుగుతుంటే ఎస్పీ ఏం చేస్తున్నారు. పోలీసులపై ప్రజలకు విశ్వాసం పోకుండా చూడాలి" అని తూర్పు జగ్గారెడ్డి అన్నారు. 


మంత్రిపై కేసు నమోదుకు డిమాండ్ 


మంత్రి పువ్వాడపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలపై పీడీ యాక్టు కేసులు పెట్టిన పోలీసులను సస్పెండ్ చేయాలన్నారు. సీఎం కేసీఆర్ కాలయాపన చేస్తే ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుందన్నారు.  బీజేపీ కార్యకర్త ఆత్మహత్య కేసులో మంత్రి పువ్వాడ అజయ్ ను ఇంక్లూడ్ చేయాలన్నారు. ఈ కేసులో పోలీసులు వాంగ్మూలం ఎందుకు తీసుకోలేదని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఎమ్మార్వో, పోలీసుల వాంగ్మూలం కూడా తీసుకోవాలని డిమాండ్ చేశారు. 


బీజేపీ కార్యకర్త ఆత్మహత్య 


ఖమ్మంలో బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. మంత్రి పువ్వాడ అజయ్, పోలీసుల వేధింపుల వల్లే సూసైడ్ చేసుకున్నాడని ఆ పార్టీ నేతలు, బంధువులు ఆరోపిస్తున్నారు. బీజేపీ కార్యకర్త మృతదేహాన్ని నిన్న ఖమ్మం ఆసుపత్రికి తీసుకురావడంతో ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ నేతలు ఆసుపత్రి ముందు ఆందోళన చేశారు. మంత్రి పువ్వాడ అజయ్ పెట్టించిన తప్పులు కేసుల వల్లే మరణించాడని ఆరోపించారు. పట్టణంలోని మంత్రి కటౌట్లకు బీజేపీ కార్యకర్తలు నిప్పుపెట్టారు. దీంతో ఖమ్మంలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.