Kurnool Cummunal Voilance : కర్నూలు జిల్లా హోలగుందలో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీస్ స్టేషన్ ముందు ఇరు వర్గాలు భారీగా గుమిగూడారు. దీంతో ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. హోలగుందలో పరిస్థితులను అదుపుచేసేందుకు ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి అక్కడే మకాం వేశారు. శనివారం హనుమాన్ శోభాయాత్రలో రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ దాడుల్లో 10 మందికి గాయాలయ్యాయి. హోలగుందలో ఉన్న ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి.. హనుమాన్ జయంతి సందర్భంగా ర్యాలీలో ఘర్షణపై ఆరా తీశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హోలాగుందలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. 



అసలేం జరిగిందంటే?


కర్నూలు జిల్లా హోలగుందలో శనివారం రాత్రి హనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో రెండు సామాజిక వర్గాల మధ్య వివాదం నెలకొంది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు హనుమాన్ జయంతి ర్యాలీపై రాళ్లురువ్వారు. దీంతో రెండు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో దాడులు జరిగాయి. ఇరువర్గాల దాడుల్లో 10 మందికి గాయాలయ్యాయి. దీంతో ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి హోలగుందలోనే మకాం వేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం హోలగుందలో హనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు. ఈ సమయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. 



మరోసారి ఉద్రిక్తత 


ఈ ఘర్షణ సమాచారం అందుకున్న పోలీసులు భారీగా హోలగుందకు తరలివచ్చారు. అనంతరం అక్కడి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఓ వర్గానికి చెందిన వారు పోలీసు స్టేషన్‌‌ను ముట్టడించి మరో వర్గానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సమయంలో వర్షం రావడంతో ఆందోళన విరమించి ఇంటికి వెళ్లిపోయారు. డీఎస్పీ వినోద్‌‌కుమార్ హోలగుందకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా భారీగా బలగాలను మోహరించారు. అయితే ఆదివారం కూడా మరోసారి హోలగుందలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇరువర్గాలు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని నినాదాలు చేసుకున్నారు. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపుచేశారు.