నమ్మిన వ్యక్తి చేసిన మోసం, దగా, ప్రేమ పేరుతో వంచనకు గురవ్వడం, కన్నవాళ్లే ద్వేషించడం, భార్య లేదా భర్త మానసిక హింసకు గురిచెయ్యడం.... ఇలాంటివి సమాజంలో జరుగుతూనే ఉన్నాయి. ఎంతోమంది మూగగా వాటిని భరిస్తూనే ఉన్నారు. పక్కవాళ్లకో, తమ తోటి సహోద్యోగులు లేదా విద్యార్థులకో చెప్పుకుంటే చులకన అయిపోతానేమో అనే భావన. అందుకే నోరు విప్పి తమ బాధను పంచుకోలేరు. లోలోపల మాత్రం ఆ బాధ గుండెను పిండేస్తూనే ఉంటుంది. ఇలా కొన్ని నెలల పాటూ కొనసాగితే డిప్రెషన్ బారిన పడిపోతారు. అందుకే మనసులోని బాధ పోవాలంటే వెంటనే ఎవరికైనా చెప్పేసుకోవాలి. అలా చేస్తే గుండెల్లోని సగభారం తగ్గిపోతుంది. కానీ కొందరు చెప్పుకోరు, చెప్పుకోలేని విషయాలు కూడా ఉంటాయి. ఇలాంటి వారికి ఒక మంచి ఐడియా ఇస్తున్నారు మిషిగాన్ యూనివర్సిటీ పరిశోధకులు. 


ఇలా చేయండి...
మీరు ఎవరికీ చెప్పుకోలేని విషయాలను మనసులో పెట్టుకుని మధనపడే కంటే  ఓ పెద్ద పేపర్ తీసుకుని రాసేయండి. మీరు మీ ఆప్తమిత్రులకు చెబుతున్నట్టు రాసుకుని వెళ్లిపోండి. మొత్తం రాసేశాక చూడండి మీకు మనసు ఎంత తేలికపడుతుందో. మెదడుకు విశ్రాంతి కూడా లభిస్తుంది. డైరీ మెయింటేన్ చేసినా మంచిదే, కాకపోతే అది ఎవరి కంటపడకుండా కాపాడుకోవడమే కష్టమైన పని. కాబట్టి పేపర్ మీద రాశాక దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చింపి పడేయండి. లేదా కాల్చేయండి. మీకు భారం దిగినట్టు ఉంటుంది, ఆ విషయాలు బయటి వారికి తెలియవు కూడా. 


ఇలా చేయడం వల్ల మెదడు ఎంత రిలాక్స్ గా ఉంటుందో ఓసారి మీరే టెస్టు చేసుకోండి. మీరు అధికంగా బాధపడడం వల్ల మీ మెదడు అంతే స్థాయిలో పనిచేయాల్సి ఉంటుంది. ఇలా కొన్ని రోజుల పాటూ కొనసాగితే మీలోని ఏకాగ్రత తగ్గిపోతుంది. మెదడు సమర్థంగా ఆలోచించే లక్షణాన్ని కోల్పోతుంది.అందుకే మనసులోని బాధను పేపర్ పై పెట్టి, మెదడులోంచి ఆ ఆలోచనలను తీసిపారేయండి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది. భావాలకు అక్షర రూపం ఇవ్వడం ఒక థెరపీ కూడా. 


మనదేశంలో...
మనదేశంలో 2016లో చేసిన ఓ సర్వే ప్రకారం దాదాపు 14 శాతం మంద ప్రజలు డిప్రెషన్ వంటి మానసకి సమస్యలతో బాధపడుతున్నారు. వారిలో 10 శాతం మందికి వైద్య సహాయం అవసరం. అంతేకాదు జనాభాలో 20 శాతం మంది జీవితంలో ఒకసారైనా డిప్రెషన్ బారిన పడుతున్నట్టు తేలింది. కాకపోతే అవగాహన లేమి వల్ల మానసిక ఆరోగ్యానికి వైద్యుడిని సంప్రదించి మందులు వాడుతున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. యాంగ్జయిటీ, డిప్రెషన్, ఏకాగ్రతలోపం, వంటివన్నీ మానసిక సమస్యల జాబితాలోకే వస్తాయి. వీటిని తక్కువగా అంచనా వేయద్దు. చికిత్స తీసుకోవడం చాలా అవసరం. 


Also read: మెదడులో కణితులుంటే మూత్రపరీక్షలో ఆ విషయం పసిగట్టేయచ్చు, కొత్త అధ్యయనం ఫలితం


Also  read: మహిళలూ పుట్టగొడుగులు తింటున్నారా? అయితే మీకు ఇది శుభవార్తే