ప్రాచీన కాలం నుంచి తేనె స్థానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అందానికి, ఆరోగ్యానికి తేనె చేసే మేలు ఇంతా అంతా కాదు. కానీ అందరికీ తేనె అంటే ముదురు బంగారు రంగులో ఉన్నదే గుర్తొస్తుంది.  అయితే ఊదా, ఆకుపచ్చ, తెలుపు, నలుపు వంటి రంగుల్లో ఉండే తేనె రకాలు కూడా ఉన్నాయి. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఈ తేనె రకాలు లభిస్తున్నాయి.  


ఊదా, ఆకుపచ్చ రంగు తేనె
ఇటీవల ఊదా రంగులో ఉన్న  తేనె ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ తేనెపై కాంతి పడినప్పుడు అది ఊదా రంగులోకి మారుతున్నట్టు గుర్తించారు. ఈ తేనెను ‘బ్లూ హనీ’ అని కూడా పిలుస్తారు.  ఈ తేనెను అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో ఉండే తేనెటీగలు ఉత్పత్తి చేసే అరుదైన తేనె.అలాగే ఇక్కడి తేనెటీగలు ఆకుపచ్చ తేనెను కూడా ఉత్పత్తి చేస్తాయి. ఆ ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 


మ్యాడ్ హనీ
మ్యాడ్ హనీ అనగానే పిచ్చి తేనె అంటారు కానీ ఇది పిచ్చిని కలిగించేది కాదు. ఈ తేనె తినడం వల్ల మత్తు కలుగుతుంది, అందుకే మ్యాడ్ హనీ అంటారు. ఇందులో గ్రేయనోటాక్సిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది మత్తు, మైకం, భ్రాంతులు కలుగుతాయి. జంతువులు, మనుషులు ఎవరూ తాగినా కూడా మత్తు కలుగుతుంది. 


మనుక తేనె
మనుకా తేనె న్యూజిలాండ్ తీర ప్రాంతంలో లభిస్తుంది. మనుక మొక్కలకు పూచే పూలలోని పుప్పొడితో మాత్రమే తేనెటీగలు ఈ తేనెను తయారుచేస్తాయి. ఈ తేనెలో యాంటీ బ్యాక్టిరియల్, హీలింగ్ గుణాలు ఎక్కువ. జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటివి తగ్గుతాయి. 


క్రీమ్డ్ క్లోవర్ హనీ
ఈ తేనె చాలా మందంగా ఉంటుంది. క్రీములాగా అనిపిస్తుంది. క్లోవర్ అని పిలిచే పువ్వులపై ఉండే పుప్పొడితో తేనెటీగలు ఈ తేనెను తయారుచేస్తాయి. దాదాపు 300 రకాల క్లోవర్ మొక్కలు ఉన్నాయి. 


బుక్వీట్ తేనె
బుక్వీట్ మొక్కకు పూసే తెల్లటి పువ్వుల నుండి సేకరించిన తేనె రకం ఇది. ఈ తేనెను బార్బెక్యూ సాస్, డెజర్ట్‌లు, టీలు తయారు చేయడంలో ఉపయోగిస్తారు.


యూకలిప్టస్ తేనె
యూకలిప్టస్ తేనె ...మెంథాల్ లాంటి రుచిని కలిగి ఉంటాయి. ఇది అత్యంత శక్తివంతమైన తేనె రకాల్లో ఒకటిగా నమ్ముతారు. యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన ఈ తేనె రకం జలుబు, దగ్గు, పుండ్లు, వాపులను నిరోధిస్తుంది.


వైట్ హనీ
కివే తేనెను వైట్ హనీ అని కూడా పిలుస్తారు.  ఇది హవాయిలో లభిస్తుంది. ఇది కివే చెట్టు పువ్వుల నుండి సేకరించిన పుప్పొడితో ఈ తేనె తయారవుతుంది.  అందుకే ఈ తేనె తెల్లగా ఉంటుంది. 


Also read: వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించిన ఆరోగ్య శాఖ, ఇవి పాటిస్తే వడదెబ్బ కొట్టదు





గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.