కన్నా లక్ష్మినారాయణ బీజేపీకి రాజీనామా చేసి, తెలుగు దేశం పార్టిలోకి వెళ్ళారు. ఆయనతోపాటుగా ఆయన అనుచరులంతా తెలుగు దేశం పార్టిలోకి వెళతారని అంతా భావించారు. అయితే అందుకు భిన్నంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. కన్నా లక్ష్మినారాయణతోపాటుగా ఆయన ముఖ్య అనుచరులు కొద్దిమంది మాత్రమే సైకిల్ ఎక్కారు. ఇంకా కొందరు భారతీయ జనతా పార్టీలోనే ఉన్నారు. అయితే వీరంతా తెలుగు దేశం పార్టీలోకి వెళ్ళటానికి ఇష్టపడలేకనే, బీజేపిలో ఉండిపోయారని అంటున్నారు. 


తెలుగుదేశంలోకి వెళ్లడం లేక బీజేపీలోనే ఉండిపోయిన నేత వంగవీటి నరేంద్ర. విజయవాడ తూర్పు నియోజకవర్గం బీజేపి ఇంచార్జ్‌గా ఉన్నారు. కన్నా సహకారంతోనే పార్టీలోకి వచ్చారు. గత ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే ఆశించిన స్థాయిలో ఓట్లు రాలేదు. వంగవీటి ఫ్యామిలీలో అత్యంత కీలకమైన వ్యక్తి వంగవీటి నరేంద్ర... కన్నాతోపాటుగా ఎక్కడకైనా వెళతారు. కానీ తెలుగు దేశం పార్టీలోకి మాత్రం వెళ్ళలేదు. 


వంగవీటి మోహన రంగా హత్య, తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో జరగటంతో ఆ పార్టీని జీవితాంతం రాజకీయంగా వ్యతికేరిస్తున్నారు నరేంద్ర. దీంతో ఆయన పార్టీ మారలేదు. అంతే కాదు గుంటూరుకు చెందిన రిటైర్డ్ శాస్త్రవేత్త చందు సాంబశివరావు కూడా కన్నా లక్ష్మినారాయణ ముఖ్య అనుచరుల్లో ఒకరు. ఆయన కూడా తెలుగు దేశం పార్టీలోకి వెళ్ళలేదు. ఆయన గతంలో తెలుగు దేశం పార్టీ నుంచి కన్నా ప్రోత్సాహంతో భారతీయ జనతా పార్టీలోకి వచ్చారు. దీంతో ఆయన ఇప్పుడు తిరిగి తెలుగు దేశం పార్టీలోకి వెళ్లేందుకు ఇష్టపడటం లేదని అంటున్నారు.


వారంతా కోవర్ట్‌లా 
కన్నా లక్ష్మినారాయణ పాటు చాలా మంది కీలక నేతలు ఇంకా భారతీయ జనతా పార్టీలోనే ఉంటున్నారు. కన్నా పార్టీ మారిన సమయంలో అత్యంత తక్కువ మంది మాత్రమే ఆయన వెనుక తెలుగు దేశం పార్టీ కార్యాలయానికి  వెళ్ళారు. అక్కడ వారందరికి చంద్రబాబు పార్టీ కండువా కప్పి ఆహ్వనించారు. ఆయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్న మిగిలిన కన్నా వర్గం పైనే అందరి చూపు ఉంది. వివిధ రకాల కారణాలతో వారు కన్నా లక్ష్మీనారాయణతోపాటుగా పార్టీ నుంచి బయటకు వెళ్లలేదు. అయితే ఇప్పుడు వారంతా కన్నా కోవర్ట్‌లు అనే ప్రచారం కూడా మొదలైంది. దీంతో అలాంటి వారందరికి ఇది మింగుడుపడని వ్యవహరంగా మారింది. 


భారతీయ జనతా పార్టిలోనే కొనసాగుతామంటూ, ఇప్పటికే ఆ పార్టీకి చెంది నాయకులు, చాలా మంది స్టేట్ మెంట్‌లు ఇచ్చినప్పటికి, వాటిని పార్టీ అధినాయకత్వం అంత ఈజీగా తీసుకోవటం లేదు. ఎక్కడ నుంచి వచ్చారో అక్కడకు వెళితే బెటర్ అని పరోక్షంగా సంకేతాలు పంపుతోందట. దీంతో అటు పార్టీ నుంచి బయటకు వెళ్లలేని స్దితిలో ఉన్నారు. దీని వల్ల కన్నా క్యాడర్‌గా ముద్రపడిన వారికి తలనొప్పిగా మారిందని చెబుతున్నారు.


జాబితా రెడీ చేసుకున్న వీర్రాజు వర్గం 
ఒక్క మాటలో చెప్పాలంటే కన్నా లక్ష్మినారాయణ బీజేపీకి రాజీనామా చేయటం, టీడీపీలో చేరడంతో ఎక్కువ రిలక్స్ అయ్యింది మాత్రం పార్టీ అధ్యక్షుడు సొము వీర్రాజు అనే ప్రచారం ఉంది. కన్నా పార్టీలో ఉన్నంత కాలంలో సొము వీర్రాజును టార్గెట్‌గా చేసి కామెంట్స్ చేశారు. పార్టీ వీడుతున్న రోజు కూడా కన్నా లక్ష్మినారాయణ, వీర్రాజుపైనే తీవ్ర స్దాయి ఆరోపణలు చేశారు. దీంతో కన్నా రాజీనామా తరువాత వీర్రాజు రిలాక్స్ అయ్యారని ప్రచారం జరుగుతుంది. దీంతో అదేసమయంలో కన్నా వర్గంగా ముద్ర పడిన వారిని వీర్రాజు ఎంపిక చేసి మరి లిస్ట్ అవుతుట్ చేసి పెట్టుకున్నారని చెబుతున్నారు.