మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. ఇక ఏప్రిల్, మే నెలలో ఎంత తీవ్రంగా ఉంటాయో అంచనా వేయవచ్చు. వేసవి వచ్చిందంటే ఆరోగ్యం పై చాలా ప్రభావం పడుతుంది. ఎండలో తిరిగేవారు వడదెబ్బ బారిన పడవచ్చు. అలాగే ఎంతోమంది ఆకలిని కోల్పోవడం, శక్తిని కోల్పోయి బలహీనంగా మారడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు వేసవిలో తీసుకోవలసిన జాగ్రత్తలు, చేయకూడని పనుల గురించి సూచించారు. వీటిని అందరూ పాటిస్తే వేసవి నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ముఖ్యంగా పగటిపూట ఇంట్లోనే ఉండాలని, మధ్యాహ్నం 12 గురించి మూడు గంటల మధ్య నేరుగా సూర్య రశ్మి తగలకుండా చూసుకోవాలని వారు సూచిస్తున్నారు. 


హైడ్రేటెడ్‌గా...
వేసవిలో ఘనాహారం కన్నా ద్రవాహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. రోజంతా ప్రతి గంట ఎంతో కొంత నీరు త్రాగుతూనే ఉండాలి. ఆయుర్వేదంలో కూడా ప్రతిరోజు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీటిని తాగమని చెబుతోంది. నీటిలో కీరాదోస, నిమ్మకాయ, పుదీనా ఆకులు కూడా వేసుకొని నానబెట్టి ఆ నీటిని తాగితే ఎంతో మంచిది. శరీరం హైడ్రేటెడ్ గా ఉండి డిహైడ్రేషన్ బారిన త్వరగా పడరు. 


ఉప్పు పానీయాలు
మన శరీరంలో ఉప్పు, చక్కెర సమతుల్యంగా ఉండాలి. చెమట కారణంగా ఉప్పు అధికంగా బయటికి పోతుంది. అందుకే వేసవిలో నిమ్మకాయ నీటిలో కాస్త ఉప్పు కలుపుకొని తాగడం ముఖ్యం. అలాగే మజ్జిగలో కూడా ఉప్పు కలుపుకొని తాగితే ఎంతో మంచిది. పండ్ల రసాలు తాగేటప్పుడు కూడా పంచదారకు బదులు కొంచెం ఉప్పు కలుపుకుంటే మేలు.  పండ్లలో ఉన్న చక్కెర, కలిపిన ఉప్పు రెండు శరీరానికి అందుతాయి.  ORSని కూడా ఎప్పుడూ దగ్గర ఉంచుకోవాలి. ఏమాత్రం నాలుక తడారి పోయినట్టు అనిపించినా, నీరసంగా అనిపించినా వెంటనే ORSను నీటిలో కలుపుకొని తాగడం ముఖ్యం. 


తాజా పండ్లు
వేసవికాలంలో నారింజ, పుచ్చకాయ, నిమ్మకాయ, మామిడి, కీరా దోస వంటి అధిక నీటి కంటెంట్ ఉన్న పండ్లను తినాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచిస్తుంది. 


ఆ డ్రింక్స్ వద్దు
ఈ కాఫీలాంటి పానీయాలు తాగే అలవాటు ఉంటే తీవ్రమైన వేసవిలో ఆ రెండింటిని మానుకోవడం ముఖ్యం.  అలాగే ఆల్కహాల్, కూల్ డ్రింక్స్ కూడా తాగడం మానేయాలి. వీటిలో అధిక మొత్తంలో చక్కెర, కెఫీన్ వంటివి ఉంటాయి. ఇవి శరీరంలోని ద్రవాలను బయటికి పోయేలా చేస్తాయి. దీనివల్ల శరీరం త్వరగా డిహైడ్రేషన్ బారిన పడుతుంది.


నో ప్రోటీన్
అధ్యయనాలు చెబుతున్న ప్రకారం అధిక ప్రోటీన్ కలిగిన ఆహారాలు జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి వేసవిలో అధిక ప్రోటీన్ ఉండే ఆహారాలను దూరం పెట్టాలి. సాధారణంగానే ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు జీర్ణ ప్రక్రియ మందగిస్తుంది. కాబట్టి తాజా కూరగాయలతో వండిన ఆహారాలు తినడం మంచిది.


మిగిలిపోయినవి వద్దు
రాత్రి మిగిలిపోయిన అన్నం, కూరలు ఉదయం లేచి తినడం వంటివి చేయకూడదు. పాత ఆహారాలు తినడం మానుకోవాలి. ఎందుకంటే వాతావరణంలో వేడి పెరిగినప్పుడు ఆహారాల్లో త్వరగా బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది. దీని తీసుకోవడం వల్ల పొట్టలో ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు వస్తాయి. 


Also read: హోలీకి సిద్ధమవుతున్నారా? ఈ చర్మ సంరక్షణ చిట్కాలు పాటించండి