పిల్లలకు, పెద్దలకు ఎంతో ఇష్టమైన పండుగ హోలీ. రంగులు చల్లుకుంటూ ఆడుకుంటారు. పెద్దవాళ్లు కూడా చిన్న పిల్లల్లా మారిపోయి, రంగులు విసురుకుంటారు. అందుకే హోలీ కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు. అయితే రంగులు తయారీలో కొన్ని రకాల హానికరమైన రసాయనాలు కలిపే అవకాశం ఉంది. ఆ రంగులు నేరుగా చర్మంపై పడినప్పుడు కొన్ని రకాల సమస్యలు రావచ్చు. అందుకే హోలీ ఆడటానికి ముందే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా చర్మానికి, చర్మ సౌందర్యానికి ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్త పడవచ్చు.
 
హోలీకి ముందు రోజు రాత్రి ముఖానికి, చేతులకు నూనెను రాసి బాగా మసాజ్ చేయాలి. దీనివల్ల మరసటి రోజు రంగులు చల్లుకున్నా కూడా ఆ రంగులను శోషించుకునే శక్తి చర్మానికి తగ్గుతుంది. కాబట్టి ఆ రంగుల్లోని రసాయనాలు చర్మం లోపలికి చేరలేవు. ఉదయం లేచాక ముఖం కడిగేయకుండా అలా నూనె రాసిన ముఖంతోనే హోలీ ఆడుకోవాలి. అప్పుడే ఈ చిట్కా పనిచేస్తుంది.


హోలీ ఆడటానికి ముందే ముఖాన్ని బాగా కడుక్కొని ఉండి ఉంటే, చర్మ రంధ్రాలు తెరుచుకుని  ఉంటాయి. దీనివల్ల ఆ రంధ్రాల్లోకి రంగులు, రసాయనాలు చేరే అవకాశం ఉంది. కాబట్టి హోలీ ఆడటానికి వెళ్లే ముందు ముఖానికి మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ లోషన్ వంటివి బాగా రాసుకోవాలి. 30 SPF లేదా అంతకంటే ఎక్కువ ఉన్నా క్రీమును ఎంచుకోవాలి.


రంగుల చర్మంపై పడడం వల్ల చర్మం పొడిబారిపోతుంది. అలా కాకుండా ఉండాలన్నా, అతినీలలోహిత కిరణాలు చర్మం పై నేరుగా పడకూడదనుకున్నా లిప్ బటర్‌‌‌‌ను వాడితే మంచి ఫలితం ఉంటుంది.


శరీరానికి బాడీ ఆయిల్ లేదా బాడీ మాయిశ్చరైజర్‌ను అప్లై చేయండి. ఇది చర్మానికి, రంగుకు మధ్య కంటికి కనిపించని ఒక రక్షణ వలయాన్ని ఏర్పాటుస్తుంది. ఎక్కువ గంటల మీ చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.  


హోలీ సమయంలో గోళ్లను కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఎక్కువ ప్రభావం పడింది గోళ్ళ మీదే.  గోళ్ళ లోపలికి రంగు చేరి అవి ఒక్కోసారి ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. కాబట్టి హోలీ ఆడడానికి ముందు నెయిల్ పాలిష్ ను గోళ్ళకు దట్టంగా పూయాలి. గోళ్లను కట్ చేసుకోవడం మంచిది. గోల్డ్ పొడవుగా ఉంటే ఆ లోపలకి రంగు చేరే అవకాశం ఉంది. అలాగే విటమిన్ E ఉన్న నెయిల్ లోషన్లు కూడా అమ్ముతారు.  వాటిని గోళ్ళపై పట్టించి అప్పుడు హోలీ ఆడితే మంచిది.


రసాయనాలు నిండిన రంగులు కన్నా ఆర్గానిక్ రంగులు వాడడం మంచిది.


Also read: జంక్ ఫుడ్ తినాలన్న కోరికని చంపేయాలంటే చేయాల్సిన పని ఇదే




గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.