తెలుగిళ్లలో భోజనం పూర్తవ్వాలంటే నెయ్యి ఉండాల్సిందే.పప్పులో వేడి వేడి నెయ్యి వేసుకుని తింటే ఆ రుచే వేరు. లంచ్ బాక్సులతో ఆఫీసులకు వెళ్లే వారిని పక్కన పెడితే ఇంట్లో వేడివేడిగా భోజనం చేసే వారంతా నెయ్యితో ఓ ముద్ద కచ్చితంగా తింటారు. తెలుగింటి భోజనంలో నెయ్యి ప్రాధాన్యత చాలా ఎక్కువ. అంతేకాదు బూరెలు, బొబ్బట్లు, చక్కెరపొంగళి వంటి స్వీట్లు వండినప్పుడు, బిర్యానీ ఘుమఘుమలకు నెయ్యి కచ్చితంగా ఉండాల్సిందే. కానీ కొంతమంది నెయ్యి తినకూడదు. ఈ విషయం చాలా మందికి అవగాహన లేదు. కొన్ని రకాల ఆరోగ్యం సమస్యలు ఉన్నవారు నెయ్యి వాడకం తగ్గించడమో, లేక మానేయడమో చేయాలి.
ఎవరెవరు తినకూడదు...
నెయ్యి వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. అయితే కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే మాత్రం నెయ్యి జోలికి వెళ్లక పోవడమే మంచిది. అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నవారు, ఊబకాయంతో ఉన్నవారు, పీసీఓడీ సమస్యతో బాధపడుతున్న మహిళలు నెయ్యిని తినకూడదు. మన శరీరం దానంతట అదే మనం తిన్న ఆహారంలో కొంత కొవ్వును తయారుచేసుకుంటుంది. నెయ్యి తినడం వల్ల ఆ కొవ్వు శాతం పెరిగిపోతుంది. అప్పుడు మరింతగా కొవ్వు పెరిగి కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. ఊబకాయంతో ఉన్న వారిలో ఇది గుండె సమస్యలకు కారణం అవుతుంది. గుండె సంబంధ వ్యాధులు ఉన్నవారు, కిడ్నీ సంబంధిత జబ్బులతో బాధపడుతున్న వారు కూడా నెయ్యి, వెన్నను దూరంగా పెట్టాలి. ఇందులో ఉండే ఫ్యాటీ ఆమ్లాలు వారి సమస్యని పెంచేస్తాయి. జీర్ణశయంలో కూడా ఇబ్బందులు మొదలవుతాయి. కాబట్టి నెయ్యిని వీరెవరూ తినకుండా ఉండడమే ఉత్తమం.
ఒక స్పూను నెయ్యిలో 112 కేలరీలు ఉంటాయి. 7.9 గ్రాముల సంతృప్త కొవ్వులు ఉంటాయి. మనం రోజూ తీసుకునే కొవ్వు శాతం 56 నుంచి 78 గ్రాముల మధ్యలోనే ఉండాలి. ఇతర ఆహారం ద్వారా కూడా కొవ్వులు చేరుతాయి. కాబట్టి నెయ్యిని తగ్గించడం వల్ల కొంతవరకు కొలెస్ట్రాల్ శరీరంలో చేరకుండా అడ్డుకోవచ్చు. ఇక సంతృప్త కొవ్వులు రోజుకు 16 గ్రాముల కన్నా ఎక్కువ శరీరంలో చేరకూడదు. కానీ స్పూను నెయ్యి ద్వారా సగం సంతృప్త కొవ్వులు శరీరంలో చేరిపోతాయి. అలాగే మిగతా ఆహారం ద్వారా కూడా చేరుతాయి కదా. అందుకే పైన చెప్పిన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు నెయ్యిని మానేస్తనే మంచిది.
Also read: గర్భంతో ఉన్నప్పుడు గ్రీన్ టీ తాగవచ్చా? తాగడం వల్ల లాభమా, నష్టమా?
Also read: కొబ్బరిపాలతో స్వీట్ రైస్, ఒక్కసారైనా రుచి చూశారా
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.