తల్లి కావడం వరం. గర్భం దాల్చాక ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. మొదటి నాలుగు నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి. కారణం ఆ సమయంలోనే గర్భస్రావం అయ్యే అవకాశం అధికం. అందుకే మెల్లగా నడవమని, ప్రయాణాలు కూడా చేయవద్దని సూచిస్తారు వైద్యులు. అంతేకాదు వారు తినే తిండి కూడా ప్రత్యేకంగా మారిపోతుంది. పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను తినమని చెబుతారు. కొన్ని రకాల ఆహారాలు పూర్తిగా మానివేయమని సూచిస్తారు. ఏ వైద్యులు కూడా గ్రీన్ టీ తాగవచ్చా లేదా అనే విషయం మాత్రం చెప్పరు. ఇప్పుడు ఆరోగ్యంపై చాలా శ్రద్ధ పెరిగిపోవడం వల్ల అందరూ గ్రీన్ టీ బాట పడుతున్నారు. దీన్ని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలతో పాటూ, బరువు కూడా తగ్గుతారనే నమ్మకం ప్రజల్లో ఉంది. అందుకే గ్రీన్ టీ అమ్మకాలు బాగా పెరిగిపోయాయి. ఇక అసలు విషయానికి వస్తే గర్భిణులు గ్రీన్ టీ తాగవచ్చా లేదా? 


తాగవచ్చా?
గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిదే. కానీ గర్భంతో ఉన్నప్పుడు మానేయడమే ఉత్తమం. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గర్భిణులకు అవసరమే కానీ ఇందులో ఉండే కెఫీన్ వల్ల మాత్రం పిండానికి కాస్త నష్టమే. దీని కెఫీన్ తక్కువ మొత్తంలోనే ఉంటుంది, కానీ అది పిండంలోని డీఎన్ఏకి నష్టం కలిగించవచ్చు. గ్రీన్ టీ అధికంగా తాగితే మాత్రం అందులో ఉండే కెఫీన్ బొడ్డు పేగు ద్వారా తల్లి నుంచి బిడ్డకు జరుగుతున్న రక్త ప్రసరణను అడ్డుకుంటుంది. దీని వల్ల పిండం సరిగా ఎదగదు. డీఎన్ఏ కణాలు కూడా దెబ్బతింటాయి. కెఫీన్ మరీ అధిక మొత్తంలో చేరితో గర్భస్రావం కూడా జరుగవచ్చు. బిడ్డ నెలలు నిండకుండా పుట్టే అవకాశాలు కూడా పెరుగుతాయి. అంతేకాదు కెఫీన్ వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది. దీని వల్ల శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు కూడా వెళ్లాల్సి వస్తుంది. దీనివల్ల శరీరంలో ద్రవాలు బయటికిపోతాయి. కాబట్టి గ్రీన్ టీకి దూరంగా ఉండడం ఉత్తమం. అలాగే కాఫీ, టీలను కూడా మానేయాలి. కాఫీలో కెఫీన్ మరీ అధికంగా ఉంటుంది. కాబట్టి కాఫీని పూర్తిగా మానేయాలి. 


నీళ్లు అధికంగా...
గర్భిణులు డీహైడ్రేషన్ కు గురికాకుండా చూసుకోవాలి. లేకుంటే ఆ ప్రభావం ఉమ్మనీరుపై పడుతుంది. కాబట్టి ద్రవ పదార్థాలను అధికంగా తీసుకోవాలి. గర్భసంచిలో ఉమ్మనీరు పుష్కలంగా ఉంటేనే బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతుంది. అందుకే రోజూ పండ్ల రసాలతో పాటూ, కొబ్బరి నీళ్లు, 9 గ్లాసులకు తగ్గకుండా నీళ్లు  తాగాలి. అలాగే మసాలా, కారం వంటకాలను తినడం తగ్గించాలి. దీని వల్ల బిడ్డకు ఇబ్బంది పడే అవకాశం ఉంది. మీరు తినే ఆహారమే బిడ్డకు తల్లి పేగు ద్వారా చేరుతుంది. కాబట్టి బిడ్డను ప్రసవించేదాకా ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. 


Also read: కొబ్బరిపాలతో స్వీట్ రైస్, ఒక్కసారైనా రుచి చూశారా


Also read: పిల్లల కోసం శునకాన్ని పెంచాలనుకుంటే ఈ జాతి శునకాలే బెటర్, ప్రేమగా ఉంటాయ్



గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.